ఉందిగా మే.. డిసెంబరు పైన..!
ABN, Publish Date - Apr 27 , 2024 | 06:05 AM
కుదిరితే అసెంబ్లీ.. లేదంటే పార్లమెంటు. ఏదో ఒక చట్టసభలో ‘అధ్యక్షా’ అనాలన్నదే వారి లక్ష్యం. ఈ ప్రయత్నంలో నాలుగు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పలువురు నేతలు..
ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా బరిలోకి పలువురు.. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేతలు
పార్టీ మారి మరీ.. లోక్‌సభకు పోటీ చేస్తున్న మాజీలు
గతంలో ఇలా గెలిచిన వారికి కలిసొచ్చిన అదృష్టం
(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్)
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ‘మే’ నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నట్లుగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పలువురు నేతలు కూడా ‘మే’ నెలలోనే పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో కొందరు నేతలు ఇలా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టిన నేపథ్యంలో.. ఈసారి తాము కూడా ఎంపీలం అవుతామన్న విశ్వాసంతో బరిలోకి దిగారు. వారు ఎవరెవరో పరిశీలిస్తే..
ఈటల రాజేందర్ (బీజేపీ)
బీఆర్‌ఎ్‌సలో సుదీర్ఘకాలం కొనసాగి.. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి కూడా చేపట్టిన ఈటల రాజేందర్ ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరఫున హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కొప్పుల ఈశ్వర్ (బీఆర్‌ఎస్)
ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎ్‌సలో ఉంటూ పలుమార్లు ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన వెంకటేశ్ నేత ఆ పార్టీని వీడడంతో అధిష్ఠానం కొప్పుల ఈశ్వర్‌ను బరిలోకి దించింది.
ఎం.రఘునందన్‌రావు (బీజేపీ)
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి 2020లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావు.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి తిరిగి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెదక్‌తో ఉన్న అనుబంధం, దేశంలో బీజేపీకి ఉన్న సానుకూల వాతావరణంతో ఎంపీగాగెలుస్తానన్న విశ్వాసంతో రఘునందన్‌రావు ఉన్నారు.
ప్రవీణ్‌కుమార్ (బీఆర్‌ఎస్)
ఐపీఎస్ అధికారిగా, గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్.. ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. ఎన్నికల్లో తొలి అడుగులో అపజయాన్ని చవిచూశారు. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సతో బీఎస్పీకి పొత్తు కుదర్చాలని ప్రయత్నించి భంగపడ్డారు. చివరికి తానే బీఆర్‌ఎ్‌సలో చేరారు. నాగర్‌కర్నూల్ రిజర్వుడ్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
నీలం మధు (కాంగ్రెస్)
సుదీర్ఘకాలం బీఆర్‌ఎ్‌సలో పనిచేసి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రె్‌సలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి మధుకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. కానీ, ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం ఇటీవల తిరిగి కాంగ్రె్‌సలో చేరి.. మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు.
శానంపూడి సైదిరెడ్డి (బీజేపీ)
దశాబ్దకాలానికి పైగా బీఆర్‌ఎ్‌సలో పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. తిరిగి 2023 ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్ బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఇటీవల బీజేపీలో చేరి.. అనూహ్యంగా నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు.
అరూరి రమేశ్ (బీజేపీ)
బీఆర్‌ఎస్ తరఫున వర్ధన్నపేట నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా 2సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. 2023 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక..నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
బండి సంజయ్ (బీజేపీ)
కరీంనగర్ సిటింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2020 మార్చి నుంచి 2023 జూలై వరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేయడం ద్వారా బండి సంజయ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోసారి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగారు.
ధర్మపురి అరవింద్ (బీజేపీ)
2019 పార్లమెంటు ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్.. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తిరిగి నిజామాబాద్ నుంచి ఎంపీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Updated Date - Apr 27 , 2024 | 06:05 AM