ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికాతో అట్లుంటది

ABN, Publish Date - Nov 22 , 2024 | 02:18 AM

లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లంచాలు ఇవ్వడం కోసం... ‘సౌర విద్యుత్తు ప్రాజెక్టు’ పేరుతో అమెరికా లోని బ్యాంకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి 1500 కోట్ల పెట్టుబడులు సేకరించింది. అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలు ఆ దేశంలోని ‘ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీఏ)’ కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచం ఇచ్చినా నేరం అవుతుంది. అదానీ ఈ నిధుల నుంచే కోట్లాది రూపాయలు లంచాలు ఇచ్చింది. అమెరికాలో ఈ చట్టం కిందే అదానీపై కేసు నమోదు చేశారు.

  • ఆంధ్రాలో లంచమిస్తే.. అక్కడ కేసులు

  • అమెరికన్‌ పెట్టుబడిదారుల నుంచి రూ.1500 కోట్లు సేకరించిన అదానీ

  • అలా నిధులు సేకరించే విదేశీ సంస్థలు ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ కిందికి!

  • ఆ నిధుల నుంచే కోట్లకు కోట్లు లంచాలు

  • ఆ చట్టం కిందే అదానీ బృందంపై కేసు

అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే.. భారతీయుడైన అదానీ భారతదేశంలో సౌర విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి ఇక్కడి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు నమోదైంది? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో పార్టీలుగా ఉన్న కంపెనీల గురించి, ఆ ఒప్పందాల గురించి సవివరంగా తెలుసుకోవాలి. న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు తమ నేరారోపణ పత్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గౌతమ్‌ అదానీకి చెందిన గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ, మారిష్‌సకు చెందిన అజూరే పవర్‌ కంపెనీ.. సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో అజూరే పవర్‌ కంపెనీ 2023దాకా న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టెడ్‌ కంపెనీగా ఉండేది. సెకీ నుంచి సౌర విద్యుత్తును కొనుగోలు చేయడానికి దేశంలోని ఏ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థా ముందుకు రాలేదు.


దీంతో అదానీ రంగంలోకి దిగి లంచాల దందాకు తెరతీసి.. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన డిస్కమ్‌లను ఒప్పించినట్టు యూఎస్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ లంచాలు ఇవ్వడానికిగాను.. అదానీ గ్రీన్‌ఎనర్జీ ‘సౌర విద్యుత్తు ప్రాజెక్టు’ పేరుతో అమెరికాలోని బ్యాంకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. అయితే, కార్పొరేట్‌ కుంభకోణాలకు చెక్‌ పెట్టడం కోసం.. అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదైన (అమెరికా పెట్టుబడిదారుల ప్రమేయం ఉన్న) విదేశీ కంపెనీలు లంచాలు ఇవ్వడాన్ని, ఇస్తామని ఆశ పెట్టడాన్ని, వ్యాపార లబ్ధి కోసం విదేశీ ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇవ్వజూపడాన్ని నేరంగా పేర్కొంటూ అమెరికా ప్రభుత్వం ‘ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీఏ)’ పేరిట 1977లో ఒక చట్టం చేసింది. సౌర విద్యుత్తు ప్రాజెక్టు పేరిట అమెరికాలో పెట్టుబడులు సేకరించిన నేపథ్యంలో.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో నమోదైన అజూరే కంపెనీ ఈ చట్టం కిందకి వచ్చాయి. అందుకే వారిపై కేసు నమోదైంది.


కాగా.. అదానీ లంచాల దందాపై న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లతో పాటు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) కూడా వేరొక సివిల్‌ కేసు నమోదు చేసింది. అమెరికా పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ 175 మిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ.1500కోట్లు) సేకరించినట్టు ఎస్‌ఈసీ ఆ కేసులో పేర్కొంది. తాము ఎవ్వరికీ లంచాలు ఇవ్వలేదని 2021 సెప్టెంబరులో తన కార్పొరేట్‌ బాండ్లు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు అదానీ గ్రీన్‌ కంపెనీ చెప్పిందని.. కానీ, అది నిజం కాదని, గౌతం అదానీ, సాగర్‌ అదానీ వ్యక్తిగతంగా ఈ అవినీతిలో భాగమయ్యారని ఎస్‌ఈసీ విస్పష్టంగా వెల్లడించింది. అమెరికాలోని చట్టాల ప్రకారం విదేశాల్లోనూ ముడుపులు, లంచాలు ఇచ్చి వ్యాపారాలు చేయడం, కాంట్రాక్టులు పొందడం చట్ట విరుద్ధం. ఇందుకోసం దేశానికి చెందిన ఫోన్లను, వ్యవస్థలను వాడుకున్నా నేరమే. సంబంధిత కంపెనీలపై కేసు పెడతారు. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌తో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ కేసులో సెబీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, నిబంధనలకు వ్యతిరేకంగా నిధుల సేకరణ, పెట్టుబడిదారులను మోసం చేయడం, ఆ దేశ టెలికామ్‌ వ్యవస్థను మోసం చేయడం, బాండ్ల జారీలో సెక్యూరిటీ యాక్టును ఉల్లంఘించడం, దర్యాప్తునకు విఘాతం కలిగించడం వంటి అభియోగాల కింద అదానీపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - Nov 22 , 2024 | 02:18 AM