Adani Data Center: ‘అదానీ డేటా’లో కదలిక
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:30 AM
విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు భూమి కేటాయించి ఏళ్లు గడుస్తున్నా అక్కడ చిన్న గొయ్యి కూడా తవ్వలేదు. నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తోంది.
ఎట్టకేలకు సెంటర్ పనులకు మార్గం సుగమం
తాజాగా పర్యావరణ అనుమతులు జారీ
నాడు టీడీపీ హయాంలో విశాఖలో భూమి
ఏకంగా కొండనే కేటాయించిన వైసీపీ
అయినా మొదలుకాని నిర్మాణం
అధికారంలోకి రాగానే కూటమి దృష్టి
ఆరు నెలల్లోనే చకచకా సాగిన ప్రక్రియ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు భూమి కేటాయించి ఏళ్లు గడుస్తున్నా అక్కడ చిన్న గొయ్యి కూడా తవ్వలేదు. నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తోంది. మధురవాడలో ఈ సంస్థకు ఏకంగా ఒక కొండనే కేటాయించారు. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించడంతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది. నిబంధనలతో కూడిన పర్యావరణ అనుమతులను ‘రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (ఎస్‌ఈఐఏఏ)’ ఇటీవలే జారీచేసింది. నిజానికి, అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి తెలుగుదేశం హయాంలోనే (2014-19) శంకుస్థాపన జరిగింది. వైసీపీ దానిని రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకుంది. మధురవాడలో సర్వే నంబరు 409/పి నుంచి 427 వరకు విస్తరించి ఉన్న నాలుగో నంబరు కొండపై మొదట 130 ఎకరాలు కేటాయించింది. ఎకరం రూ.పది కోట్లు విలువ చేసే భూమిని కోటి చొప్పున ఇచ్చేసింది. దీనికి ముందు లీజు ఒప్పందం జరిగింది. అదానీ ఒత్తిడి పెట్టడంతో లీజు రద్దు చేసి సేల్ డీడ్ రాశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రాజెక్టును అదానీ పేరుతో కాకుండా ‘వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్’ అని స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేశారు.
ఆ కొండపై మొత్తం భూమి 276.77 ఎకరాలు ఉండగా, దఫదఫాలుగా రకరకాల కారణాలు చూపించి వైసీపీ ప్రభుత్వం కొండ మొత్తం అదానీకి రాసి ఇచ్చేసింది. 2023 మే 3న మరోసారి శంకుస్థాపన జరిగింది. ఆ తరువాత కొండపైకి ఎవరూ వెళ్లకుండా అడ్డంగా రాళ్లు వేసి దారి మొత్తం మూసేశారు. ఎటువంటి పనులూ చేపట్టలేదు. కొండపై మొదట ఇచ్చిన 130 ఎకరాలకే పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలపై ఒప్పందం జరిగింది. ఆ తరువాత ఇచ్చిన 146.77 ఎకరాల అదనపు భూమికి పెట్టుబడి, ఉద్యోగాలు వెల్లడించలేదు. మొదటి 130 ఎకరాలకు రూ.14,634 కోట్ల పెట్టుబడులు పెట్టి, 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అదానీ ఒప్పందం చేసింది. తొలుత 200 మెగవాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ పెడతామని ప్రకటించారు. ఆ తరువాత మరో 100 మెగావాట్లతో ఇంకొకటి నిర్మిస్తామన్నారు. మొత్తం 300 మెగావాట్ల డేటా సెంటర్ వస్తుందన్నారు. తొలి ఒప్పందం ప్రకారం 82 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్క్, 11 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ పెట్టాల్సి ఉంది.
ఎస్‌ఈఐఏఏ నిబంధనలు...
ప్రాజెక్టు భూమి విశాఖలోని ఎకో సెన్సిటివ్ జోన్ కంబాలకొండకు 970 మీటర్ల దూరంలోనే ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కిలో మీటరు దూరం వరకు ఎటువంటి భారీ భవంతులు నిర్మించకూడదనే నిబంధన ఉన్నందున 30 మీటర్ల వెడల్పున బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని, దానిని గ్రీన్ బెల్ట్‌గా అభివృద్ధి చేయాలని నిబంధన పెట్టింది. దీనికి రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలి.
ఈ ప్రాజెక్టుకు రోజుకు 2,644 కిలో లీటర్ల నీరు అవసరం. అందులో 1,429 కిలోలీటర్లు జీవీఎంసీ నుంచి తీసుకుంటామని, మిగిలిన 1,215 కిలో లీటర్ల నీటి కోసం సూయిజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు పెట్టి రీ సైకిల్ చేసి వినియోగిస్తామని సంస్థ పేర్కొంది.
ఈ ప్రాజెక్టు నుంచి వెలువడే ఘన, ద్రవ, వాయు వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యం జరగకూడదని నిబంధన విధించారు.
Updated Date - Jan 13 , 2025 | 03:30 AM