Amaravati Expansion: అమరావతి.. డబుల్!
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:39 AM
అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా సీఆర్‌డీఏ మరో 44 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల రైతులతో చర్చలు జరుపుతున్నారు.

రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాల భూసమీకరణ?
4 మండలాల్లోని 11 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన
కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో వెలుగులోకి
తాజాగా అమరావతి వైపు పలు సంస్థల చూపు
అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత
విమానాశ్రయం, రైల్వే లైన్, మెట్రో తదితరాలకు ఇప్పుడున్న
భూములు చాలవు.. అందుకే మరిన్ని సమీకరణకు యోచన?
రాజధాని అమరావతి పరిధి రెట్టింపు కాబోతోందా..? మరికొన్ని వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాలని సీఆర్‌డీఏ భావిస్తోందా..? కొన్ని రోజులుగా రైతులతో అధికారులు జరుపుతున్న చర్చలు దీనినే సూచిస్తున్నాయని అంటున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండడంతో రాజధానిని విస్తరించాలన్న యోచనతో.. మరో 44 వేల ఎకరాల భూములను సమీకరణ కింద తీసుకునేందుకు సీఆర్‌డీఏ ప్రతిపాదన రూపొందించినట్లు తెలుస్తోంది.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. అమరావతిలో తలపెట్టే ప్రాజెక్టుల సంఖ్య కూడా గణ నీయంగా పెరిగింది. రాజధాని పనులను దశల వారీగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు 2014-19 నడుమ సంకల్పిస్తే.. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు ముక్కలాటతో విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అందుకు ఆస్కారం లేకుండా మూడేళ్లలో అమరావతి రాజధానికి నిర్దిష్ట రూపం తీసుకురావాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. 92 ప్రాజెక్టులకు గుర్తించి.. రూ.65 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5 వేల నుంచి 7 వేల ఎకరాలు అవసరం. అమరావతి రైల్వేలైన్, అంతర్జాతీయ స్టేడియం, మెట్రో రైలు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ప్రాజెక్టులకు భూములు కావాలి. ఇవి కాకుండా నవ నగరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతా ఉంది. నవ నగరాలకు భూములు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అమరావతికి వస్తున్న అనేక సంస్థలకు భూకేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున భూములను తీసుకోవలసి ఉంది. పారిశ్రామిక సంస్థలు, ఆతిథ్య రంగ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు.. ఇలా ప్రతి ఒక్కటీ ముందుకు వచ్చి అమరావతిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాయి.
వీటికి కూడా భూములను కల్పించాల్సి వస్తోంది. అమరావతిని బెంగళూరు తరహాలో ఇండియా టాప్-10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి సంబంధించిన రెసిడెన్షియల్, గ్రూప్ హౌస్‌లు, హైరైజ్ భవనాలు, కమర్షియల్ భవనాలు తదితరాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఇటీవలే బెంగళూరులోని టాప్-5 రియాలిటీ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. భూములు కేటాయిస్తే తప్ప ఇవి ముందుకు రావు. రియాలిటీ సంస్థలకు 60:40 వాటా ప్రాతిపదికన భూములిస్తే సీఆర్‌డీఏకు రాయల్టీ కూడా వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అమరావతి రాజమార్గాలుగా ఈ-13, ఈ-15 రోడ్లను జాతీయ రహదారి-16కు అనుసంధానిస్తున్నారు. గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) లకు అనుసంధానంగా అమరావతి రోడ్లను అనుసంధానించాలి. అంతర్గతంగా మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా పెరిగాయి. ఈ పనులన్నిటికీ భూములను సేకరించడం రానున్న రోజుల్లో కత్తిమీద సామే.
ఉభయతారకంగా..
అమరావతిలో రూ.కోట్లు పలుకుతున్న భూములను భూ సేకరణ ద్వారా తీసుకోవడం చాలా కష్టం. ఉభయతారకంగా ఉండాలంటే ల్యాండ్ పూలింగ్ అంటే.. భూ సమీకరణ ఒక్కటే సీఆర్‌డీఏకు మార్గంగా కనిపిస్తోంది. అమరావతిలో వరదనీటి కాలువల విస్తరణ పనుల వల్ల కూడా ప్రస్తుతం సమీకరించిన భూముల విస్తీర్ణం తగ్గుతోంది. కొండవీడువాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ వంటి వాటి పొడవు, వెడల్పులు అదనంగా మూడు రెట్లు పెరుగుతున్నాయి. ఇవి కాకుండా రిజర్వాయర్ల కోసం కొంత కోల్పోవలసి వస్తోంది. మరో కీలక విషయం ఏమిటంటే.. ప్రపంచ బ్యాంకు కూడా మరిన్ని భూములు సమీకరించాలని సూచించినట్లు సమాచారం. రాజధానికి రుణాలు సమకూరుస్తున్న ఈ సంస్థ కొన్ని ప్రయోజనకర ఫలితాలను ఆశిస్తోంది. ఇక్కడ చేపడుతున్న పనుల కారణంగా ఆర్థికంగా మెరుగుపడాల్సి ఉంటుంది. అమరావతి అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలి. స్థానికంగా ఉద్యోగాల కల్పన దిశగా మరిన్ని ప్రాజెక్టులను అమరావతి నిర్మాణ పనులతోనే సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన మేరకు పలు నూతన ఆర్థిక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నిటికీ అమరావతిలో ప్రస్తుతం సరిపడా భూమి అందుబాటులో లేదు. అలాగని భూసేకరణకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. జగన్ ఐదేళ్ల విధ్వంసంతో తలెత్తిన ఆర్థిక ఇక్కట్లతో ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ కారణంగానే రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాలను భూసమీకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ భూములు సమీకరించాలో కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ సీఆర్‌డీఏ ఓ ముసాయిదాను రూపొందించినట్లు తెలిసింది.
భూ సమీకరణ ప్రతిపాదిత ప్రాంతాలు..
తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని మొత్తం 11 గ్రామాల్లో 18,080 హెక్టార్ల (సుమారు 44,670 ఎకరాలు) భూములను తీసుకోవాలనేది ఆలోచన. తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురంలో మొత్తం గ్రామంలోని 2,429.05 ఎకరాలు, వడ్డమానులోనూ పూర్తిగా 1,937.31 ఎకరాలు, పెదపరిమిలో పాక్షికంగా 6,513.69 ఎకరాలు సమీకరించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. అమరావతి మండలం వైకుంఠపురంలో 3,360.63 ఎకరాలు, ఎండ్రాయిలో 2,167.11 ఎకరాలు, కర్లపూడిలో 2,947.06 ఎకరాలు, మోతడక గ్రామంలో 2,345.03 ఎకరాలు, నిడుముక్కలలో 2,013.91 ఎకరాలు.. తాడికొండ మండలం తాడికొండలో 12,797.59 ఎకరాలు, కంతేరులో 3,671.98 ఎకరాలు, మంగ ళగిరి మండలం కాజ గ్రామంలో 4,492.37 ఎకరాలు పాక్షికంగా సమీకరించాలని సీఆర్‌డీఏ అనుకుంటోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ర్టియల్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అంగీకరించాయి. అయితే వీటికి అవసరమయ్యే భూముల కోసం భూ సమీకరణకు వెళ్లాలా.. భూసేకరణ జరపాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. భోగాపురం విమానాశ్రయం మాదిరిగా అమరావతిలో కూడా భూ సేకరణ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.
57 వేల ఎకరాలు సమీకరించాలనుకున్నా
రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించిన తర్వాత భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే ముందు 57 వేల ఎకరాలు సమీకరించాలని భావించారు. అప్పట్లో వైకుంఠపురం ప్రాంతానికి చెందిన రైతులు తమ భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. లంక భూములు, నదీ తీర ప్రాంత భూములను కూడా తీసుకోవాలన్న డిమాండ్ రైతుల నుంచి వచ్చినప్పటికీ 34 వేల ఎకరాలకే ఆనాడు ప్రభుత్వం పరిమితమైంది. తీసుకున్న వాటిలో వాస్తవంగా మరో 3 వేల ఎకరాలు పలు కారణాల వల్ల ఇంకా సీఆర్‌డీఏ చేతికి రాలేదు. ఈ దశలో అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేంద్రప్రభుత్వ సంస్థ హడ్కో వంటి రుణ సంస్థలు రుణాలు సమకూర్చుతున్నాయి. ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి కూడా నిధులు తీసుకోవడానికి సీఆర్‌డీఏ సిద్ధమవుతూనే.. రాజధాని విస్తరణ ఆలోచన చేస్తుండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News