Amaravati Mega Plans: విమానాశ్రయం కోసమే అదనపు భూ సమీకరణ
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:27 AM
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం నిర్మాణం కోసం అదనంగా 30–40 వేల ఎకరాల భూ సమీకరణ అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు

రాజధానిలో ఎయిర్‌పోర్టు కోసం
ఐదు వేల ఎకరాలు అవసరం
ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం
దీంతో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, ఇతర పనులకు వేల ఎకరాలు అవసరం
రాజధానిలో క్రీడా నగరం నిర్మిస్తాం
మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడతో మహా నగరం ఏర్పాటు
పురపాలక మంత్రి నారాయణ వెల్లడి
అనంతవరంలో గ్రావెల్ కొండల పరిశీలన
గుంటూరు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు క్రీడా నగరం కూడా నిర్మించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అదేవిధంగా తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మెగా సిటీ(మహా నగరం) ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిపారు. ఒక్క విమానాశ్రయాన్నే ఐదు వేల ఎకరాల్లో నిర్మించనున్నట్టు తెలిపారు. అయితే, రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకోవాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారని.. ఇదే జరిగితే మరింత భూమి అవసరం అవుతుందన్నారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అవసరాలకు 30-40 వేల ఎకరాలు అవసరం అవుతాయని తెలిపారు.
ప్రభుత్వం వద్ద 5 వేల ఎకరాలు ఉంటాయని చెప్పారు. అయితే, పూలింగ్ విధానంలో భూములు తీసుకోవాలా? సేకరించాలా? అనే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. భూసేకరణ విధానంలో అయితే, రిజిస్ట్రేషన్ ధరకు రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా భూసమీకరణ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని.. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్నారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగాసిటీగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. రాజధానిలోని అనంతవరంలో ఉన్న గ్రావెల్ కొండలను మంగళవారం మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం, మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని, దీంతో న్యాయ పరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవడానికే 8 నెలల సమయం పట్టిందని చెప్పారు. ప్రస్తుతం రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలను సీఆర్డీయేకు కేటాయించిందని మంత్రి చెప్పారు. రాజధానిలో క్రీడా నగరం కూడా నిర్మించనున్నట్టు తెలిపారు.
అమరావతికి టైమ్ లైన్!
మరో 10 రోజుల్లో 15 వేల మందితో పనుల పరుగు.
ఏడాదిలోగా అధికారుల భవనాల నిర్మాణం పూర్తి.
4 వేల మంది అధికారులకు సకల సౌకర్యాలతో ఏర్పాటు.
ఏడాదిన్నరలో 350 కిలో మీటర్ల మేర ట్రంక్ రోడ్లు పూర్తి.
రెండున్నరేళ్లలో రైతుల లేఅవుట్‌లలో రోడ్లు పూర్తి.
మూడేళ్లలో ఐకానిక్ భవన నిర్మాణాలు.