Minister Payyavula అభివృద్ధి, సంక్షేమంలో ముందుకే..
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:26 AM
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ అధ్వర్యంలో నిర్వహించారు.

గత ప్రభుత్వ తీరుతో ఆర్థిక సంక్షోభం
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
విడపనకల్లులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విడపనకల్లు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ అధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం సభలో కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభు త్వం అప్పుల పాలు చేసి వెళ్లిందని, వాటికి వడ్డీలు చెలించేందుకు, తీర్చేందుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోవటం లేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా పనులు పూర్తి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్క రించేందుకే ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ సమస్యలపై 464 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉండబండలో వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న పాఠశాల భవనాలను ఖాళీ చేయించాలని ఆ గ్రామ ప్రజలు మంత్రి పయ్యావులకు ఫిర్యాదు చేశారు.
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోండి
ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్ కొట్టాల, డొనేకల్లు గ్రామాల ప్రజలు మంత్రి కేశవ్‌కు పిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో ఓ అధికారి వైసీపీ కార్యకర్తలా పని చేసి ఆపార్టీ నాయకులకు ఉపాధి నిధులు దాదాపు 1.19కోట్లు దోచి పెట్టారు అంటూ ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజలే ఆధారాలు తెచ్చి ముందు పెడుతున్నా గత పీఓ(ఎంపీడీఓ) శ్రీనివాసులుపై ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు అంటూ డ్వామా పీడీ సలీం బాషాపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారిని రక్షించి మీరు తప్పు చేయ వద్దు అంటూ హెచ్చరించారు.
మండలంలోని పెద్ద కొట్టాలపల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ గత రబీలో జింకల వల్ల రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా అధికారులు పట్టించుకోలేదన్నారు. నష్ట పరిహారం ఇప్పించాలని మంత్రిని కోరారు. వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మను, మండల ఏఓ పెన్నయ్యను వేదిక మీదికి పిలిపించి ఎందుకు నివేదికలు పంపలేదు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ట్రాన్సఫార్మర్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, సామాజిక పింఛన్లు, భూ సర్వేలు కోసం అర్జీలను మండల ప్రజలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మలోలా, జిల్లా ఫారెస్టు అధికారి రామక్రిష్ణారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, సీఈఓ రామచంద్రారెడ్డి, మండల అధికారులు, టీడీపీ నాయకులు చిన్న మారయ్య, మాజీ ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, సర్పంచలు చంద్రశేఖర్, తిమ్మరాజు, తిప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.