Sriramireddy water శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:28 AM
డిమాండ్లు పరిష్కరిస్తే తప్ప సమ్మె విరమించేదిలేదని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు తెగేసి చెప్పారు. డిమాండ్ల సాధనకు 4 రోజులుగా విధులను బహిష్కరించి కార్మికులు సమ్మె బాట పట్టారు.

డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ
అనంతపురం న్యూటౌన ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): డిమాండ్లు పరిష్కరిస్తే తప్ప సమ్మె విరమించేదిలేదని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు తెగేసి చెప్పారు. డిమాండ్ల సాధనకు 4 రోజులుగా విధులను బహిష్కరించి కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈఈ మురళీధర్‌రావు, డీఈ శ్రీనివాసులు మంగళవారం సమ్మె చేస్తున్న కార్మికులకు వద్దకు వెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఉమ్మడి జిల్లాలోని ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, పెనుకొండ మండలాల్లోని 727 గ్రామాలకు పీఏబీఆర్ నుండి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీటిని అందించడానికి 588 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి 5 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఈపీఎఫ్ జమ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే పలు మార్లు కార్మికులు సమ్మెబాట పట్టారు. అయితే అధికారులు తాత్కాలిక చర్యలతో సమ్మెను విరమింపజేస్తూ వచ్చారు. కానీ ఈ సారి మాత్రం తమ సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తేలేదని చెప్పడం, ఈ వేసవిలో అధికారులకు మరింత మంట పుట్టిస్తోంది.