CM Chandrababu Naidu: ఆరోగ్యాంధ్రే లక్ష్యం
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:10 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.19,264 కోట్లతో మెడికల్ రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో మెగా మెడిసిటీతోపాటు ప్రతి నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, వర్చువల్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

అమరావతిలో 200 ఎకరాల్లో మెగా మెడిసిటీ
ఖతార్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు
105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీలు
పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తాం
ఆరోగ్యశ్రీ కేసుల్లో 50 శాతం వాటికే
ఆరోగ్య వివరాలతో హెల్త్ డిజీ లాకర్
26 నెలల్లో వర్చువల్ ఆస్పత్రులు
జూన్ 15న కుప్పంలో పైలట్ ప్రాజెక్టు: చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.19,264 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రధానంగా 10 రకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ‘‘కేంద్రం దేశంలో 25 మెడిసిటీలను పెట్టాలనే యోచనలో ఉంది. ఖతార్ ప్రభుత్వ సహకారంతో అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటుపై కేంద్రాన్ని సంప్రదించగా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మెడిసిటీ కోసం 200 ఎకరాలు కేటాయించి.. అందులో 100 ఎకరాలు హెల్త్‌కేర్ సేవలకు, 40 ఎకరాలు నివాసాలకు, 20 ఎకరాలు వాణిజ్య అవసరాలకు, 20 ఎకరాలు సర్వీస్ జోన్‌కు వినియోగించుకునేలా విధానాలు రూపొందించాం. హెల్త్ టూరిజానికీ ఇది ఉపయోగపడుతుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాలకు 70 చోట్లే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయన్నారు. మిగతా 105 నియోజకవర్గాల్లో పీపీపీ విధానంలో నిర్మిస్తామని, అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) అందిస్తామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ కేసుల్లో 50 శాతం వీటికే రిఫర్ చేసి నిలబడేలా చూస్తామని, వీటి నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయిస్తామని వివరించారు. ‘‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల జారీలో ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్ర జనాభాలో 88ు మందికి హెల్త్ అకౌంట్లు రూపొందించాం. వర్చువల్ ఆస్పత్రులను రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలన్న లక్ష్యంతో కుప్పం నియోజకవర్గంలోని 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. జూన్ 15న దీనిని ప్రారంభిస్తామన్నారు. ‘‘26 నెలల్లో ఈ వర్చువల్ ఆస్పత్రులను పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డులను డిజిటల్ లాకర్‌లో పెడతాం. మొబైల్ వైద్య వాహనాల ద్వారా ఇంటి వద్దే పరీక్షలు చేయిస్తాం. డాక్టర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సేవలందిస్తారు’’ అని వివరించారు. ‘‘ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు టాటా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున న్యూట్రిఫుల్ యాప్‌ను డెవలప్ చేశారు. ప్రస్తుతం 4 లక్షల మంది దీనిని అనుసరిస్తున్నారు’’ అన్నారు.
సీఎం చెప్పిన ఆరోగ్య సూత్రాలు
పాఠశాల విద్య నుంచే ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యం అంశాన్ని కూడా ఒక సబ్జెక్టుగా పెట్టాలన్న ఆలోచన ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ‘నలుగురు ఉన్న కుటుంబంలో వంటనూనె నెలకు 2 లీటర్లు, చక్కెర 3 కేజీల కన్నా ఎక్కువ వినియోగించకుండా చూసుకోవాలి. ఉప్పు వినియోగం తగ్గిస్తే 40 శాతం మేర గుండెపోట్లు తగ్గుతాయి’ అని తెలిపారు. రోజూ అరగంట నడవడం, దైవ చింతనలో గడపడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. పొగాకు, డ్రగ్స్, అల్కహాల్‌ను దూరం పెడితే కేన్సర్, లివర్, కిడ్నీ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. జంక్ ఫుడ్, పాలిష్డ్ బియ్యం తినడం తగ్గించి మిల్లెట్స్, ముడి బియ్యం, కూరగాయలు ఎక్కువగా తినాలని సూచించారు.
వైద్యసేవలు మెరుగు
గత మూడు నెలల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల పలు అంశాల్లో ప్రజల్లో సానుకూలత మరింత పెరిగింది. అయితే పరిశుభ్రతపై పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజాభిప్రాయాన్ని సేకరించిన ఆర్టీజీఎస్ ఆ వివరాలను సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 27, ఫిబ్రవరి 7, మార్చి 5న, తాజాగా సోమవారం సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు. తాజా సర్వేలో ప్రజాభిప్రాయం 78.13 శాతానికి పెరిగిందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. డాక్టర్ రాసిన మందులు ఇచ్చే అంశంపై సానుకూలత 18.65శాతం పెరిగిందని పేర్కొంది. సెకండరీ ఆసుపత్రులకు సంబంధించి కూడా వైద్యసేవలపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని ఆర్టీజీఎస్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..