Andhra Pradesh: చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద ఊరట
ABN, Publish Date - Mar 31 , 2025 | 04:23 AM
ఏపీ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్ల కోసం రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించనుంది. ముఖ్యంగా నీరు-చెట్టు, రహదారి పనులకు సంబంధించిన బిల్లులకు ప్రాధాన్యత ఇస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

ఉగాది కానుకగా రూ.2,000 కోట్ల బిల్లుల చెల్లింపునకు సర్కారు నిర్ణయం
17 వేల మందికి మేలు: మంత్రి కేశవ్
జగన్ హయాంలోపెండింగ్ పెట్టారని వెల్లడి
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పనులు చేపట్టి పూర్తి చేసిన చిన్న తరహా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వైసీపీ హయాంలో కాళ్లరిగేలా తిరిగినప్పటికీ బిల్లుల చెల్లింపు జరగని చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు రూ.2 వేల కోట్ల మేరకు పేరుకుపోయిన బిల్లులను చెల్లించాలని నిర్ణయించారు. దీంతో దాదాపు 17 వేల మంది చిన్న తరహా కాంట్రాక్టర్లకు మేలు జరగనుంది. వీరిలో 8 వేల మంది కాంట్రాక్టర్లు నీరు-చెట్టు పథకంలో పలు పనులు చేపట్టారు. మరో 9 వేల మంది ప్రభుత్వానికి సంబంధించిన చిన్నపాటి కాంట్రాక్టులు చేశారు. ఏళ్ల తరబడి తమ బిల్లుల కోసం ఎదురు చూసిన వీరికి ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఊరట కల్పిస్తూ.. సాధ్యమైనంత వరకు ముందొచ్చిన బిల్లులను ముందుగా చెల్లించే విధానం పాటించి వారికి బకాయిలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి కేశవ్ ఆ శాఖ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ప్రస్తుతం విడుదల చేస్తున్న రూ.2,000 కోట్లలో 10 శాతం పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించామన్నారు. రూ..కోటిలోపు ఉన్న బిల్లులకే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి చెప్పారు. నీరు-చెట్టు, గుంతల రహిత రోడ్లు, నాబార్డు పనులకు ఈ విడతలో బిల్లుల చెల్లింపులు పూర్తవుతాయని వెల్లడించారు. జలవనరుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొన్ని నిధులు విడుదల చేస్తామని కేశవ్ వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులెదురైనా పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి చెప్పారు. ఈ బిల్లులన్నీ జగన్ పాలనకు చెందినవేనని, మూడు, నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News
Updated Date - Mar 31 , 2025 | 04:23 AM