Share News

Anna Lezhinova: శ్రీవారికి అన్నా లెజినోవా తలనీలాలు సమర్పణ

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:20 AM

తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి కోలుకున్న సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ భార్య అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Anna Lezhinova: శ్రీవారికి అన్నా లెజినోవా తలనీలాలు సమర్పణ

డిక్లరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ సతీమణి సంతకం

మార్క్‌ శంకర్‌తో హైదరాబాద్‌ చేరుకున్న పవన్‌

ప్రధాని మోదీకి పవన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు

తిరుమల/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇటీవల వీరి కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అన్నా లెజినోవా తిరుమల వచ్చారు. గాయత్రి అతిథిగృహానికి చేరుకున్న ఆమెకు టీటీడీ రిసెప్షన్‌ అధికారులు స్వాగతం పలికారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో నిబంధనల ప్రకారం హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని, తనకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయని పేర్కొంటూ డిక్లరేషన్‌పై ఆమె సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడినుంచి నేరుగా పద్మావతి కల్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి అతిథిగృహానికి చేరుకుని రాత్రి బస చేశారు. అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని, శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్నదానానికి విరాళం ఇవ్వనున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన కుటుంబసభ్యులతో కలసి శనివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన తనయుడు మార్క్‌ శంకర్‌ గాయపడి, అక్కడి ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. పవన్‌, ఆయన సతీమణి అన్నా లెజినోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా, మార్క్‌ శంకర్‌తో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మార్క్‌ శంకర్‌ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని పవన్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ప్రమాదం నుంచి తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన సభ్యులు, అభిమానులు, కుటుంబసభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


మీ సహకారం ధైర్యానిచ్చింది..

సింగపూర్‌లో తన కుమారుడు మార్క్‌ శంకర్‌కు జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో సత్వరమే స్పందించి, సహాయం అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి పవన్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌ అధికారులు అందించిన సహయ సహకారాలు, క్లిష్ట సమయంలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పవన్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:20 AM