Agriculture Power: సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత కరెంటు!
ABN, Publish Date - Jan 11 , 2025 | 03:50 AM
వ్యవసాయ రంగానికి 9గంటల ఉచిత విద్యుత్‌ను పగటిపూటే అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎంకుసుమ్(ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష-ఉత్థాన్ మహాభియాన్)’ పథకం కింద రాష్ట్రంలో లక్ష వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్‌ను అందిస్తామని స్పష్టంచేసింది.
సబ్సిడీ నిధులు సమకూరుస్తాం
ఏపీఈఆర్‌సీకి ఇంధన శాఖ నివేదన
పీఎంకుసుమ్ కింద లక్ష సౌర పంపు సెట్లు
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి 9గంటల ఉచిత విద్యుత్‌ను పగటిపూటే అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎంకుసుమ్(ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష-ఉత్థాన్ మహాభియాన్)’ పథకం కింద రాష్ట్రంలో లక్ష వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్‌ను అందిస్తామని స్పష్టంచేసింది. మరో 4 లక్షల పంపు సెట్లకు ఈ స్కీంను విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపింది. ఆమోదం వచ్చిన వెంటనే వాటికీ సౌర విద్యుత్ అందిస్తామని వెల్లడించింది. ఉచిత పథకాలకు సబ్సిడీ నిధులు సమకూరుస్తామని పేర్కొంది. శుక్రవారం కర్నూలులో ఏపీఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్ ఠాకూర్ రామసింగ్, సభ్యుడు పి.వెంకటరామిరెడ్డితో కూడిన కమిషన్ ముందు రాష్ట్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్‌రెడ్డి ఓ ప్రకటన చేశారు. 2024 నాటికి విద్యుత్‌రంగంలో రూ.71,762 కోట్ల పైబడి అప్పులు ఉన్నాయని.. రూ.29,377 కోట్ల నష్టాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం గృహ, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు, రైతులకు అందిస్తున్న విద్యుత్‌కు సబ్సిడీ నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు.
గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రోజంతా సరసమైన ధరలకు కరెంటు అందిస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. ఆక్వా, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, వివిధ రంగాలకు సబ్సిడీపై విద్యుత్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధిని పెంచేందుకు.. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎ్‌సఎస్) కింద ప్రీపెయిడ్ మీటర్లను బిగిస్తాం. కేంద్రం ప్రకటించిన ఈ స్కీం వల్ల రూ.13,405 కోట్ల మేర నిధులు సమకూరుతాయి. ఇందులో రూ.6,192 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటుగా వస్తాయి. గృహ వినియోగదారులకూ స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. మౌలిక సదుపాయాలు కల్పి స్తాం. ఇలాంటి చర్యలతో నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటాం. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నాం. వారికి 2కిలోవాట్ల దాకా ఉచితంగా రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఫలకాలు అమరుస్తాం. ఒక్కో సోలార్ ప్యానెల్‌పై 60శాతం సబ్సిడీ అందిస్తాం. 25,054 గిరిజన గృహాలకు విద్యుత్ సర్వీసుల కోసం రూ.127కోట్లు మంజూరు చేస్తున్నాం. పారదర్శక విధానంలో విద్యుత్ కొనుగోళ్లు చేపట్టి భారాన్ని తగ్గిస్తాం. విద్యుత్ నష్లాలను తగ్గించడానికి ఆధునీకరణ చర్యలు చేపడతాం’ అని ఇంధన శాఖ వివరించింది. వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా, మెరుగైన సేవలు అందించడానికి సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గించే చర్యలు చేపడతామని ప్రకటనలో పేర్కొంది.
Updated Date - Jan 11 , 2025 | 03:50 AM