Mobile App : రిజిస్ట్రేషన్లకు ‘బ్లాక్ చెయిన్’ సాంకేతికత
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:51 AM
సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రయోగాత్మక ప్రాతిపదికన మొబైల్
వ్యవస్థల ఏకీకరణతో సురక్షిత లావాదేవీలు
ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి
నకిలీల బెడద తగ్గనుందని సర్కారు అంచనా
భూముల సమాచారం కోసం మొబైల్ యాప్
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రయోగాత్మక ప్రాతిపదికన మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అలాగే, భూముల రిజిస్ర్టేషన్లను మరింత సురక్షితం, సులభతరం చేసేందుకు బ్లాక్ చెయిన్ సాంకేతికతను వినియోగించుకోనున్నారు. ఈ సాంకేతికత ఆధారంగా కార్డు 2, కార్డు 2.0 సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే, ప్రాంత(లొకేషన్) ఆధారిత పార్సిల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కొత్తగా అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల ఒక భూమికి సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారం మొత్తం ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా భూముల లావాదేవీలు, రిజిస్ర్టేషన్లలో కచ్చితత్వం పెరుగుతుంది. సర్వే ఆఫ్ ఇండియా, ఉపగ్రహ చిత్రాలు, డీటీసీపీ జాబితా, మునిసిపల్, సర్వే విభాగం, ఎఫ్‌ఎంబీ, బ్యాంకుల్లో ఉన్న సమాచారం, సదరు భూమి చిత్రాలు ఒకే చోట కనిపిస్తాయి. దీంతో వాటిలో కచ్చితత్వాన్ని బేరీజు వేసుకోవచ్చు. అలాగే, ఫోన్‌లో కూడా ఎవరి భూముల వివరాలు వారు తెలుసుకునేలా యాప్ రూపొందిస్తున్నారు. ఒక భూమి దగ్గరికి వెళ్లి ఆ యాప్ ఓపెన్ చేస్తే దాని ప్రాథమిక వివరాలు తెలిసేలా యాప్ రూపొందిస్తున్నారు. ఆ వ్యక్తి ఆధార్ నెంబర్ లేదా ఇతర వివరాలు యాప్‌లో పేర్కొనడం ద్వారా సదరు భూమికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. వ్యవస్థల ఏకీకరణ(సిస్టమ్స్ ఇంటిగ్రేషన్) విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం భూములకు సంబంధించి ప్రతి ప్రభుత్వ శాఖలో ఉన్న సమాచారం ఒకే చోట అందుబాటులోకి వస్తుంది. అన్ని శాఖల ఆమోదంతో ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు అందించే సేవల్లో కచ్చితత్వం పెరుగుతుందని, నకిలీ రిజిస్ర్టేషన్ల బెడద తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Updated Date - Jan 12 , 2025 | 06:51 AM