Andhra Pradesh industrial incentives: పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలకు మోక్షం!
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:32 AM
గత వైసీపీ ప్రభుత్వంలో బకాయిలుగా ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.3,000 నుండి రూ.5,000 కోట్ల వరకు ఈ నెల 15 లోగా చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్త పారిశ్రామిక విధానాలకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక చర్యలు చేపడుతోంది.

మే 15లోగా విడుదలకు ప్రభుత్వం చర్యలు
5 వేల కోట్ల వరకు చెల్లించేందుకు ప్రణాళిక
2 నెలల్లో జిల్లాకో పారిశ్రామిక పార్కు
మంత్రులు టీజీ భరత్, కొండపల్లి వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కార్ చెల్లించని పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్, సెర్ప్, ఎంఎ్‌సఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే నెల 15వ తేదీలోగా రూ.3 నుంచి 5 వేల కోట్ల వరకు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే అత్యున్నతమైన ‘ఎర్లీబర్డ్ ఇన్సెంటివ్స్’ను అందించే రాష్ట్రం ఏపీ ఒక్కటేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాల అమలు కోసం ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను శుక్రవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంత్రులు విడుదల చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఏపీ ఎంఎ్‌సఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్ డెవల్‌పమెంట్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0)లకు సంబంధించిన మార్గదర్శకాల బుక్‌లెట్‌లను మంత్రులు ఆవిష్కరించారు. వీటితోపాటు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ఎర్లీ బర్డ్ పోర్టల్‌ను ప్రారంభించారు.
బాబు ఇమేజ్‌తో భారీగా పెట్టుబడులు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని, నేడు సీఎం చంద్రబాబు బ్రాండ్‌నేమ్‌తో ఇప్పటికే రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ, రామాయపట్నంలో బీపీసీఎల్ తదితర భారీ పరిశ్రమలు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంకా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు దరఖాస్తులు పెట్టుకోగానే ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభించవని, వారు సమర్పించే ప్రాజెక్టు డీపీఆర్‌లు, మూలధన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను బట్టే ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక పాలసీని ప్రకటించినప్పటికీ.. దాని అమలుకు మార్గదర్శకాలు రూపొందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ పాలసీతోపాటు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీలకు కూడా మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేశామని తెలిపారు.
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రెండు నెలల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కును ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో, ఆ తర్వాత మండలానికో పారిశ్రామిక పార్కు చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వీటిలో ఏపీఐఐసీ ద్వారా కొన్ని, పీ3, పీ4 కార్యక్రమాల ద్వారా మరికొన్ని పార్కులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా ఐటీతోపాటు సివిల్, మెకానికల్, పెట్రో కెమికల్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో స్టార్ట్‌పలు, వెంచర్ క్యాపిటలిస్టులను ప్రోత్సహిస్తూ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్‌బాబు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:32 AM