అట్టహాసంగా బండలాగుడు పోటీలు
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:39 PM
మండల పరిధిలోని దేవిబెట్ట గ్రామంలో రంగస్వామి జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర ఒంగోలు (నాలుగు పళ్లసైజు) ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి.

ఎమ్మిగనూరు రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని దేవిబెట్ట గ్రామంలో రంగస్వామి జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర ఒంగోలు (నాలుగు పళ్లసైజు) ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి 11 జతల ఎద్దులు వచ్చాయి. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎంతో సంబరంగా ఎద్దుల బండలాగుడు పోటీలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సాంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలన్నారు. ఈ పోటీల్లో గద్వాల జిల్లా గట్టు మండలం లింగాపురం గ్రామానికి చెందిన సురేంద్ర ఎద్దులు మొదటి బహుమతి, కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం పందిర్లపల్లెకు చెందిన చాంద్‌బాషా ఎద్దులు ద్వితీయస్థానం, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చౌటుపల్లికి చెందిన హనుమంతు ఎద్దులు మూడవ బహుమతి కైవసం చేసుకున్నాయి. అలాగే వరుసగా ఏడు బహుమతులను అందజేశారు. పోటీల్లో గెలుపొందిన వృషభరాజుల యజమానులకు నిర్వాహకులు దేవిబెట్ట సోమేశ్వరరెడ్డి, నాగరాజుగౌడు, శ్రీనివాసులస్వామి, మహదేవప్ప, లక్ష్మీరెడ్డి, చంద్రప్ప, చిన్న తాయప్ప, పి.సోమేష్ ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో రాముడు, జగదీష్, సోమశంకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 11:39 PM