Bird Flu : కోళ్లకు మరణశాసనం..!
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:33 AM
బర్డ్ ఫ్లూ.. వైరస్ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు, బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి. కానీ.. ఆ పక్షుల్లో ఈ వ్యాధి కనబడదు. దీనివల్ల వలస పక్షులు, కొంగలు చనిపోవు.

వ్యాక్సిన్ లేని వైరస్ బర్డ్ ఫ్లూ.. వలస పక్షులతోనే వ్యాధి వ్యాప్తి
ఇది మనుషులకు సోకదు
జీవ భద్రతా చర్యలతో నివారణ
పశువైద్య నిపుణుల సూచన
గోదావరి జిల్లాల్లో వ్యాప్తిపై ఆందోళన
అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
నియంత్రణకు కఠిన చర్యలు
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచన
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బర్డ్ ఫ్లూ.. వైరస్ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు, బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి. కానీ.. ఆ పక్షుల్లో ఈ వ్యాధి కనబడదు. దీనివల్ల వలస పక్షులు, కొంగలు చనిపోవు. కేవలం క్యారియర్లుగానే ఉంటాయి. అవి విసర్జించే రెట్టల ద్వారా వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. వాటి ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటిలో చుక్క పడినా వైరస్ ప్రభావం చూపుతుంది. సాధారణంగా శీతాకాలంలో బర్డ్‌ఫ్లూ వైరస్ ఉనికిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ అంతరిస్తుంది. సహజంగా జలాశయాల వద్ద వలస పక్షులతో పాటు దేశీయ కొంగలు కూడా సంచరిస్తాయి. ఆ కొంగలు కోళ్ల ఫారాల వద్దకి రావడం వల్ల వైరస్ అంతర బదిలీ అవుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. కోళ్ల పెంపకంలో బాధ్యతగా లేకపోతే.. ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో సహజంగా కోళ్ల మరణాలు 3.5 శాతంగా ఉంటుంది. మరణాలు సహజమే కానీ.. కోళ్లు అత్యధికంగా మృతి చెందితే దానికి వైర్‌సలే కారణం. ప్రస్తుతం కోళ్ల మరణాలకు కారణమైన బర్డ్‌ఫ్లూ నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేదని పశుసంవర్థక శాఖ తెలిపింది. కోళ్ల ఫారాల వద్ద పరిశుభ్రతతోపాటు ఇతర జీవ భద్రతా ప్రమాణాలు పాటించడమే దీనికి నివారణ అని పేర్కొంది. కోడికి కోడికి మధ్య నిర్ణీతా దూరం పెట్టడం, మంచి దాణా అందించి, శాస్త్రీయ పద్ధతుల్లో పౌల్ర్టీలు నిర్వహించడం ద్వారా వైర్‌సలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: మంత్రి అచ్చెన్న
రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ నియంత్రణకు అన్నిచర్యలూ తీసుకుంటున్నామని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. బాగా ఉడికించిన గుడ్లు, చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చని ప్రభుత్వం తరఫున ప్రకటించారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బర్డ్‌ఫ్లూ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకిందంటూ జగన్ మీడియాలో స్ర్కోలింగ్ వేయడంతో.. వైద్యశాఖ కార్యదర్శి వెంటనే వెళ్లి పరిశీలించారని, అది తప్పుడు ప్రచారమని తేలిందని చెప్పారు. ఏపీ గుడ్లను తెలంగాణ ప్రభుత్వం నిషేధించలేదన్నారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో తమ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ రాష్ట్రం ప్రకటనలు చేస్తే.. ఏపీకి నోటీసులిచ్చినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు మాట్లాడుతూ.. వలస పక్షుల వల్ల కోళ్లు, బాతులకు మాత్రమే బర్డ్‌ఫ్లూ సోకే అవకాశం ఉంటుందని, మనుషులకు సోకినట్టు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు. వెటర్నరీ డాక్టర్లు తమ పరిధిలోని పౌల్ర్టీల యజమానులతో మాట్లాడి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బర్డ్‌ఫ్లూ సోకిన 14వేల కోళ్లను కాల్చేసి, 340 గుడ్లును నాశనం చేశామన్నారు. ఆయా పౌల్ర్టీల్లో ఉన్న 1.4లక్షల కోళ్లను కూడా కాల్చేస్తామన్నారు. వాటిలో ఒక్కో కోడికి రూ.140 చెల్లిస్తామని చెప్పారు.
నివారణకు కఠిన చర్యలు: సీఎస్
బర్డ్‌ఫ్లూ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని సీఎస్ విజయానంద్ తెలిపారు. గురువారం సచివాలయం నుంచి పశుసంవర్ధక, వైద్యఆరోగ్యశాఖల ఉన్నతాధికారులతో కలిసి, జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వ్యాధి నివారణకు చర్యలు, చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా పూడ్చిపెట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీచేశారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ.. బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర పశుసంవర్ధకశాఖ కమిషనర్ అమిత్ మిత్రా వర్చువల్‌గా మాట్లాడుతూ... కోళ్ల ఫారాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని, వైరస్ సోకిన కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించి, 15 రోజులకోసారి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ వైరస్ మనుషులకు సోకదు..
బర్డ్‌ఫ్లూ కారణంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 5.42లక్షల కోళ్లు మృతి చెందాయి. పక్షి జాతుల్లో వచ్చే వైర్‌సలను నిర్ధారించే ప్రయోగశాల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనే ఉంది. గోదావరి జిల్లాల్లో చనిపోయిన కోళ్లకి సంబంధించిన నమూనాలను ఈ ల్యాబ్‌కే పంపగా.. బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయింది. దీని శాస్త్రీయ నామం ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్5ఎన్1). కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. పశుసంవర్థక శాఖ అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. భోపాల్‌లోని ల్యాబ్‌కు మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అధికారం ఉందని చెప్పారు. ఈ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాగా, బర్డ్‌ఫ్లూ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టీ)లు ఏర్పాటు చేశామని, దీనిపై ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కోళ్లు చనిపోయిన గ్రామాల్లో ఒక కిలోమీటరు పరిధిని అలర్ట్ జోన్ (అప్రమత్తత పరిధి)గా, పది కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించి, ఆ ప్రాంతం నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేస్తున్నామని తెలిపింది.
భయం గుప్పెట్లో గోదావరి జిల్లాలు
కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ భయం వెంటాడుతూనే ఉంది. చికెన్ వినియోగానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు భయపడుతున్నారు. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బ్రాయిలర్ వారానికి 20వేల టన్నులు, ఫారం 15వేల టన్నులు తినేవారు. బర్డ్‌ఫ్లూ ప్రభావంతో బ్రాయిలర్ వ్యాపారం 2 వేల టన్నులు కూడా ఉండటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఫారం కోళ్లను కనీసం కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నారు. ఏలూరు జిల్లా బాదంపూడిలో బర్డ్‌ఫ్లూ కలకలం రావడంతో ఆ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై పడింది. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో చికెన్, గుడ్ల దుకాణాలు వెలవెలబోతున్నాయి.
మనుషులకు సోకిందంటూ వదంతులు.. ఏలూరు కలెక్టర్ సీరియస్
ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ప్లూ సోకిందంటూ వదంతులు చెలరేగాయి. దీనిపై ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీరియస్ అయ్యారు. సరైన నిర్ధారణ లేకుండా ఇలా అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించవద్దని కోరారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నారు. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను శాస్ర్తీయ పద్ధతుల్లో ఖననం చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తణుకు రూరల్ మండలం వేల్పూరులో గురువారం నిర్వహించిన కోళ్ల ఖననం చేసే పనులను ఆమె పరిశీలించారు.