ఎ.రంగంపేటలో ఏఐ టెక్నాలజీ హబ్
ABN, Publish Date - Jan 16 , 2025 | 01:05 AM
నారావారిపల్లె క్లస్టర్‌కు సీఎం చంద్రబాబు వరాల జల్లు
చంద్రగిరి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీ సౌజన్యంతో చంద్రగిరి మండలం ఎ.రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏఐ టెక్నాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. నారావారిపల్లె క్లస్టర్ పరిధిలోని ఎ.రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామాపురం గ్రామస్తులతో మంగళవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఏఐ టెక్నాలజీ ల్యాబ్ వల్ల క్లస్లర్ పరిధిలోని 8 పాఠశాలల విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా రాణించేలా తయారవుతారన్నారు. క్లస్టర్ పరిధిలోని 2160 కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. వచ్చే నెలాఖరులోగా వందశాతం బహిరంగ మల విసర్జన లేని గ్రామాలు కావాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన 286 మందికి ఏడాదిలోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇక్కడా పైప్ లైన్ గ్యాస్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపించాలని రైతులకు సూచించారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెంచేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈనెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నామని, తద్వారా ఆధార్, కులం, నేటివిటీ, బర్త్ సర్టిఫికెట్లు, అడంగల్ వంటి 150 సర్వీసుల వరకు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. నారావారిపల్లె ఆస్పత్రిలో 5 వేల మంది వరకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.8 కోట్లతో ఎ.రంగంపేట నుంచి భీమవరం, మంగళంపేట రోడ్లను పూర్తి చేస్తామన్నారు. 500 మంది వరకు చదువుకునేందుకు, పని చేసేందుకు ఐటీ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి.. శ్రీసిటీ వంటి పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి కల్పిస్తామన్నారు. రేణిగుంట సమీపంలో 10 ఎకరాల స్థలంలో రతన్ టాటా స్ఫూర్తితో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి ఇక్కడి యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. హంద్రీనీవా నీటిని మూలపల్లెకు, కణితమడుగు చెరువులకు, కల్యాణి డ్యామ్, నాగపట్ల, వెంకట్రాయుని చెరువులకు అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కల్యాణి డ్యామ్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా టెక్నాలజీని వినియోగిస్తామని వివరించారు.
Updated Date - Jan 16 , 2025 | 01:05 AM