తేలనున్న పింఛన్ల లెక్క
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:07 AM
ప్రారంభమైన గుర్తింపు సర్వే జిల్లాలో 10 బృందాలుగా తనిఖీలు నకిలీ పింఛన్ల తొలగింపునకు చర్యలు
చిత్తూరు రూరల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): అర్హత లేకున్నా వైకల్య ధుృవపత్రాలతో పింఛన్లు అందుకుంటున్న వారి వివరాలను జల్లెడ పట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పింఛను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేపడుతోంది. సర్వేబృందంలో ఆర్థో డాక్టర్, జనరల్ మెడిసన్ డాక్టర్, పీహెచ్‌సీ వైద్యాధికారి, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, గ్రామస్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. కొన్ని మండలాల్లో ఈనెల 6 నుంచే తనిఖీ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా రూ.15 వేలు పొందుతున్న వారి (డీఎంహెచ్‌వో) వివరాలపై వీరు దృష్టిపెట్టారు.
మొదటి విడత డీఎంహెచ్‌వో పింఛన్లపై ఆరా
జిల్లాలో డీఎంహెచ్‌వో పింఛను పొందుతున్న వారు 1936 మంది ఉన్నారు. బృంద సభ్యులు పరిశీలించిన వివరాలను ప్రభుత్వ యాప్‌లో నమోదు చేస్తారు. సర్వే మూడు వారాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారంలో సోమ, మంగళ, బుధవారాల్లో బృందం తనిఖీలు చేస్తారు. ఇప్పటివరకు చిత్తూరు అర్భన్, ఐరాలు, గంగవరం ,రామకుప్పం, సోమలలో మండలాల్లో 10 టీములు తనిఖీలు ప్రారంభించి 361 మందిని పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో 35374 మంది వికలాంగుల పింఛను లబ్ధిదారుల వివరాలను పరిశీలించనున్నారు. అనర్హులు ఉంటే వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తారు. ధ్రువపత్రం మంజూరు చేసిన వైద్యాధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తనిఖీలు పూర్తయ్యే వరకు సదరం కొత్త స్లాట్లు, రూ.15వేల పింఛను ధృవపత్రాల జారీ ప్రక్రియను ఆపాలని ఆదేశాలు అందినట్లు సమాచారం.
పక్కాగా తనిఖీ చేస్తున్నాం
వైద్య బృందం పక్కాగా తనిఖీలను నిర్వహిస్తోంది. వారంలో మూడు రోజులు పాటు తనిఖీలు నిర్వహించి మిగిలిన రోజులు వారు రెగ్యలర్ విధులు నిర్వహిస్తారు. మూడు వారాల్లో డీఎంహెచ్‌వో పింఛన్లు తనిఖీ పూర్తవుతుంది. రెండో విడతగా వికలాంగుల పెన్షన్లపై సర్వే జరుగుతుంది.
- సుధారాణి, డీఎంహెచ్‌వో
Updated Date - Jan 08 , 2025 | 01:07 AM