Share News

కోర్‌ బ్రాంచిలే అసలైన ఆవిష్కరణకు పునాదులు

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:29 AM

అసలైన ఆవిష్కరణకు పునాదులు ఇంజినీరింగ్‌లోని కోర్‌ బ్రాంచ్‌లేనని ఆర్వీ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్వీ చక్రపాణి స్పష్టంచేశారు.

కోర్‌ బ్రాంచిలే అసలైన ఆవిష్కరణకు పునాదులు

రానున్న నాలుగేళ్లలో వీటికి మరింత డిమాండ్‌

స్పష్టం చేసిన ముఖ్య అతిథి ఆర్వీ చక్రపాణి

విజనరీ సీఎం ఆధ్వర్యంలో ఐఐటీ మరింత

పురోగతి సాధిస్తుందన్న డైరెక్టర్‌

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అసలైన ఆవిష్కరణకు పునాదులు ఇంజినీరింగ్‌లోని కోర్‌ బ్రాంచ్‌లేనని ఆర్వీ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్వీ చక్రపాణి స్పష్టంచేశారు. తిరుపతి ఐఐటీ 10వ వార్షికోత్సం సందర్భంగా శుక్రవారం ఐఐటీ క్యాంప్‌సలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటాసైన్స్‌ విభాగాల్లో చేరేందుకు పోటీ పడుతున్నారని, ఐతే ఇంజినీరంగ్‌లో కోర్‌ బ్రాంచిలైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచిలు లేకుండా ఏఐ, డేటాసైన్స్‌ మనలేవన్నారు. అందుకని ఏఐ, డేటా సైన్స్‌ తీసుకున్నప్పటికీ కోర్‌ బ్రాంచిల్లో బేసిక్స్‌పై పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అప్పుడే సాంకేతికంగా మంచి ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. ప్రస్తుతం కోర్‌ బ్రాంచిలకంటే ఏఐ, డేటాసైన్స్‌ వారికే ప్యాకేజి అధికంగా ఉంటోందని, అయితే, రానున్న నాలుగేళ్లలో ఇంజినీరింగ్‌ రంగంలో పెనుమార్పులు జరిగి కోర్‌బ్రాంచిలకు డిమాండ్‌ బాగా పెరుగుతుందని చెప్పారు. దీనికిగాను దేశంలోని అన్ని ఐఐటీలను కలుపుకొని ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన వర్క్‌షా్‌పను తిరుపతి ఐఐటీలోనూ త్వరలో నిర్వహిస్తామన్నారు.

విజనరీ ముఖ్యమంత్రి టెక్‌ సేవీ

దీనికిముందు ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎన్‌.సత్యనారాయణ మాట్లాడుతూ.. పదేళ్లకాలంలో తిరుపతి ఐఐటీ ఒక్కొక్కటిగా అనేక మైలురాళ్లను అధిగమించిందంటూ వివరించారు. దీనికి చెన్నై ఐఐటీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించాయన్నారు. చంద్రబాబు నాయుడిని విజనరీ ముఖ్యమంత్రిగా, టెక్‌ సేవీగా ఆయన అభివర్ణించారు. ఆయన నేతృత్వంలో మన ఐఐటీ మరిన్ని ఆవిష్కరణలు చేస్తుందన్నారు. అమరావతిలోని రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో తిరుపతి ఐఐటీ కూడా ఒక కీలక భాగస్వామిగా ఉందన్నారు. హబ్‌ ద్వారా సాంకేతిక పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఐఐటీ మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందన్నారు. వచ్చే నెలలో తిరుపతి ఐఐటీని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారని, అప్పుడు భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడిస్తామన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 02:29 AM