హాస్టళ్లకు మంచి రోజులు

ABN, Publish Date - Feb 10 , 2025 | 01:26 AM

గత వైసీపీ ప్రభుత్వం.. సంక్షేమ వసతి గృహాల నిర్వహణను గాలికొదిలేసింది. ఐదేళ్లపాటూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఏ వసతి గృహంలో చూసినా విరిగిపోయిన మరుగుదొడ్ల బేసిన్లు.. కిటికీలకు అడ్డుగా కట్టిన పరదాలు.. ఆరుబయట స్నానాలు కనిపించేవి. ప్రహరీలు లేనిచోట్ల విషపురుగుల సంచారంతో విద్యార్థులు భయం.. భయంగా గడిపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. మరోవైపు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మతులకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి పంపడంతో నిధులు విడుదలయ్యాయి.

హాస్టళ్లకు మంచి రోజులు
గంగాధరనెల్లూరులోని ఎస్సీ బాలికల వసతి గృహానికి వేసిన రంగులు

  • కూటమి ప్రభుత్వ హయాంలో

  • బాగుపడుతున్న సంక్షేమ వసతి గృహాలు

  • మరమ్మతులకు రూ.11.83 కోట్ల విడుదల

గత వైసీపీ ప్రభుత్వం.. సంక్షేమ వసతి గృహాల నిర్వహణను గాలికొదిలేసింది. ఐదేళ్లపాటూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఏ వసతి గృహంలో చూసినా విరిగిపోయిన మరుగుదొడ్ల బేసిన్లు.. కిటికీలకు అడ్డుగా కట్టిన పరదాలు.. ఆరుబయట స్నానాలు కనిపించేవి. ప్రహరీలు లేనిచోట్ల విషపురుగుల సంచారంతో విద్యార్థులు భయం.. భయంగా గడిపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. మరోవైపు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మతులకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి పంపడంతో నిధులు విడుదలయ్యాయి.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

జిల్లాలోని నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో మొత్తం 57 (41 ప్రీమెట్రిక్‌, 16 పోస్టుమెట్రిక్‌) వసతి గృహాలున్నాయి. వీటిల్లో రెండు వసతి గృహాలు బాగున్నాయి. ఏడు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన 48 వసతి గృహాల్లో పనులు మొదలయ్యాయి. వీటిల్లో మూడో తరగతి నుంచి డిగ్రీ, ఆపై కోర్సుల్లో 3,500 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ బాధ్యతలు తీసుకున్నాక కుప్పం తదితర ప్రాంతాల్లోని వసతి గృహాలను పరిశీలించారు. సరైన వసతుల్లేక ఇబ్బంది పడటాన్ని గమనించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి కలెక్టర్‌ పంపగా నిధులు విడుదలయ్యాయి.

జరుగుతున్న పనులు

48 వసతి గృహాల్లో మరమ్మతులకు రూ.11.83 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరు నియోజకవర్గాలకు కలిపి రూ.8.83 కోట్లను, కుప్పానికి మాత్రం రూ.3కోట్లను కేటాయించింది. ఈ నిధులతో స్నానాలగదులు, మరుగుదొడ్లు, కిటికీలు, మెష్‌, ఫ్యాన్లు, వాటర్‌ పైపులు, డోర్లకు మరమ్మతులు, అవసరమైన చోట్ల ప్రహరీల నిర్మాణం, రంగులు వేయడం, సెప్టిక్‌ ట్యాంకు క్లీనింగ్‌, వైరింగ్‌, ఫ్లోరింగ్‌, పిచ్చి మొక్కల తొలగింపు, బోరు మోటర్ల రిపేర్లు తదితర పనులు చేస్తున్నారు.

ఐదు శాఖలకు పనులు అప్పగించిన కలెక్టర్‌

సాధారణంగా జిల్లా అంతటికీ కలిపి ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేవారు. వారు నెలల తరబడి పనులు చేయడం, నాణ్యత లేకపోవడంతో ఏడాదిలోనే మళ్లీ మరమ్మతులకు గురయ్యేవి. ఈ సమస్యలన్నింటినీ గమనించిన కలెక్టర్‌ ఈ పనులను సోషియల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌) శాఖలకు అప్పగించారు. ఒక్కో మండలంలోని వసతి గృహాల పనులను ఒక్కశాఖ మాత్రమే చేయాలి. ఆ పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇంజనీరింగ్‌శాఖ అధికారులకు కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు మాత్రం పుంగనూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో పనులను అప్పగించారు. ఈ పనులు జరిగేచోట ఏఈ స్థాయి అధికారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం

ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో వసతి గృహంలో వందమంది విద్యార్థులు ఉండాలి. ఈ లెక్కన 57 వసతి గృహాల్లో 5,700 మంది విద్యార్థులు ఉండాలి. కానీ 3,500 మంది మాత్రమే ఉన్నారు. దీనికి కరోనా ఓ కారణమైతే.. మౌలిక వసతులు లేకపోవడం మరో కారణంగా ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి చెప్పారు. వసతి గృహాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తే.. విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు.

మార్చిలోగా పనులు పూర్తి చేస్తాం

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో వసతి గృహాల రూపురేఖలు మారుతున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో ఉన్నాం. మార్చి చివరినాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం.

- చెన్నయ్య, డీడీ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ

============================

Updated Date - Feb 10 , 2025 | 01:26 AM