‘స్వీట్’గా ముంచేస్తోంది
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:05 AM
జిల్లాలో పెరుగుతున్న మధుమేహ బాధితులు జనాల్లో రైజ్ అవుతున్న ‘బీపీ’ రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే ఆందోళన కలిగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సర్వే ఫలితాలు

తిరుపతి, ఆంధ్రజ్యోతి: జిల్లాలో ‘తియ్యటి’ ప్రమాదం ముంచుకొస్తోంది. మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో ఎక్కువ మంది హైపర్ టెన్షన్‌తో బీపీ బాధితులుగా మారుతున్నారు. ఇక, మధుమేహం, బీపీ.. రెండూ ఉన్న వారి సంఖ్యా 83 వేల వరకు ఉంటోంది. ఇక, మూడేళ్లుగా ఎన్టీయార్ వైద్య సేవలు పొందిన రోగుల సంఖ్య.. రోడ్డు ప్రమాద గణాంకాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వెల్లడైన ఈ అంశాలను సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం వెల్లడించారు.
జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. 57 వేల మందికి పైగా బాధితులతో రాష్ట్రంలో 5వ స్థానం.. రాయలసీమ జిల్లాలతో పోలిస్తే మెదటి స్థానంలో ఉంది. ఇక, హైపర్ టెన్షన్ బాధితుల పరంగానూ ఆందోళన కలిగించేలా ఉంది. రాష్ట్రంలో 18వ స్థానంలో ఉండగా.. రాయలసీమలో కడప, కర్నూలు జిల్లాల తర్వాత మూడవ స్థానంలో ఉన్నాం. ఇక, బీపీ, డయాబెటిస్ రెండూ ఉన్న బాధితుల్లోనూ మన జిల్లా రాయలసీమలో మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా ప్రమాణాల విషయంలో జిల్లా గణనీయంగా వెనుకబడి ఉంది. ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ లోపాలు బయటపడ్డాయి. రోడ్డు భద్రతా చర్యలు సక్రమంగా లేనందున రాష్ట్రంలో కృష్ణా, చిత్తూరు జిల్లాల తర్వాత ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తేలింది. రోడ్డు ప్రమాద ఘటనల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య విషయంలో కూడా జిల్లా ఏపీలో మూడో స్థానంలో ఉంది.
ఎన్టీఆర్ వైద్య సేవలూ ఎక్కువే
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా సర్జరీలు, చికిత్సలు, ఔషధాలు పొందుతున్న వివిధ రకాల రోగుల సంఖ్య జిల్లాలో గణనీయంగా ఉంది. 2022-23 నుంచీ 2024-25 వరకూ మూడేళ్ల పాటు ఎన్టీఆర్ వైద్య సేవల కింద ప్రభుత్వ సాయం పొందిన వారి సంఖ్యను పరిశీలిస్తే ఈ అంశం వెల్లడైంది. వ్యాధుల వారీగా సేవలు అందుకున్న రోగుల వివరాలిలా వున్నాయి.
కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఏపీలో 30,646 మంది వుండగా అందులో జిల్లాలో 1829 మంది వున్నారు. 5.97 శాతం మందితో జిల్లా ఏపీలో 3వ స్థానంలో వుండడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమలో అయితే కర్నూలు జిల్లా తర్వాత అత్యధిక రోగులు జిల్లాలోనే వున్నారు.
దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ఏపీలో 54,362 మంది ఉండగా, అందులో 6.85 శాతం అంటే 3775 మందితో జిల్లా మూడో స్థానంలో వుంది. రాయలసీమ జిల్లాలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉంది.
రాష్ట్రంలో దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు 1,73,479 మంది ఉంటే, 5.02 శాతంతో అంటే 8700 మందితో జిల్లా ఆరవ స్థానంలోనూ, రాయలసీమలో మూడో స్థానంలోనూ వుంది.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఏపీలో 1,19,397 మంది ఉండగా, అందులో 3.86 శాతం మంది అంటే 4607 మందితో జిల్లా 15వ స్థానంలో వుంది. రాయలసీమలో అయితే మొదటి స్థానంలో వుంది.
నరాల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్రంలో 1,07,433 మంది ఉన్నారు. అందులో 3.376 శాతం అంటే 3626 మందితో జిల్లా 18వ స్థానంలో ఉంది. రాయలసీమలో 4వ స్థానం.
గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 2,61,100 మంది వుంటే వారిలో 2.753 శాతం అంటే 7,187 మందితో జిల్లా 21వ స్థానంలో వుంది. అదే రాయలసీమ పరిధిలో జిల్లా 6వ స్థానంలో వుంది.