‘సిట్‌’ కార్యాలయంలో రోజంతా టెన్షన్‌ టెన్షన్‌

ABN, Publish Date - Feb 10 , 2025 | 01:37 AM

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ బృందం కోసం కార్యాలయం ఏర్పాటైన తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఆదివారం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీల డైరెక్టర్లను అరెస్టు చూపించే క్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీయడంతో సందడి నెలకొంది. దానికితోడు తమిళనాడు, తిరుపతిలకు చెందిన న్యాయవాదుల హడావిడి కూడా కనిపించింది. కీలక నిందితుల అరెస్టు నేపథ్యంలో సిట్‌ అధికారులు, సిబ్బంది భోజనాలకు సైతం ఇళ్ళకు వెళ్ళకుండా కార్యాలయానికే తెప్పించుకున్న పరిస్థితి కనిపించింది.

‘సిట్‌’ కార్యాలయంలో   రోజంతా టెన్షన్‌ టెన్షన్‌
- పోలీసుల ఉరుకుల పరుగులు

- పోలీసుల ఉరుకుల పరుగులు

- తమిళనాడు న్యాయవాదుల హడావిడి

- కల్తీ నెయ్యి కేసులో అర్ధరాత్రి రెండు డెయిరీల డైరెక్టర్లు అరెస్టు

- నిందితులకు నడిరోడ్డుపై గుర్తింపు పరీక్షలు

తిరుపతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ బృందం కోసం కార్యాలయం ఏర్పాటైన తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఆదివారం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీల డైరెక్టర్లను అరెస్టు చూపించే క్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీయడంతో సందడి నెలకొంది. దానికితోడు తమిళనాడు, తిరుపతిలకు చెందిన న్యాయవాదుల హడావిడి కూడా కనిపించింది. కీలక నిందితుల అరెస్టు నేపథ్యంలో సిట్‌ అధికారులు, సిబ్బంది భోజనాలకు సైతం ఇళ్ళకు వెళ్ళకుండా కార్యాలయానికే తెప్పించుకున్న పరిస్థితి కనిపించింది.

సిట్‌ బృందానికి కార్యాలయం ఏర్పాటు చేసిన తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులోకి గత నవంబరు 23వ తేదీ నుంచీ ఇతరులను ఎవరినీ అనుమతించడం లేదు. చెక్‌పోస్టు కూడా ఏర్పాటుచేసి సిట్‌ సిబ్బందిని తప్ప ఇతరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ప్రాంతం శనివారం వరకూ ఎలాంటి హడావిడి లేకుండా కనిపించేది. ఆదివారం పరిస్థితి మారింది. ఉదయం నుంచే పోలీసు అధికారులు, సిబ్బంది రాకపోకలు పెరిగాయి. మధ్యాహ్నానికి ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీల డైరెక్టర్లను, ఇతర సిబ్బందిని పోలీసులు భూదేవి కాంప్లెక్సుకు తీసుకొచ్చారు. దాంతో ఆయా డెయిరీల అధికారులు, యజమానుల సన్నిహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆపై తమిళనాడు, తిరుపతికి చెందిన న్యాయవాదులూ వచ్చారు. నిందితుల అరెస్టు నేపథ్యంలో రిమాండు రిపోర్టు తయారీలో పోలీసు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) వెంకట్రావు అక్కడే మకాం వేసి స్వయంగా రిమాండు రిపోర్టు రూపొందించారు. రాత్రి 8.20 గంటలకు రిపోర్టు సిద్ధం కావడంతో భారీ బందోబస్తు నడుమ నలుగురు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక 9.10 గంటలకు తిరుపతి రాయలచెరువు రోడ్డులోని జడ్జిల నివాస సముదాయం వద్దకు తరలించారు.

నడిరోడ్డుపైనే గుర్తింపు పరీక్షలు

రాత్రి 9.10 గంటలకు నిందితులను జడ్జిల నివాస సముదాయం వద్దకు తీసుకురాగా వాహనాలను రోడ్డుకు ఇరువైపులా పార్కు చేసి జడ్జి అనుమతి కోసం పోలీసు అధికారులు నిరీక్షిస్తూ గడిపారు. రాత్రి 10.33 గంటలకు దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీ ఇరువురూ అక్కడికి చేరుకున్నారు. 11 గంటలకు జడ్జి ఎదుట నిందితులను హాజరు పరిచారు. అంతకు మునుపు జడ్జిల నివాస సముదాయం ఎదుట రోడ్డుపైనే నిందితులకు పోలీసు అధికారులు గుర్తింపు పరీక్షలు నిర్వహించారు. ఈఎ్‌సఐ ఆస్పత్రి గేటు వద్ద వీధి దీపాల కింద నిందితులను నిలబెట్టి గుర్తింపు చిహ్నాలు నమోదు చేశారు.

అర్ధరాత్రి రిమాండు

ఆదివారం రాత్రి 11 గంటలకు రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఎదుట నిందితులను హాజరుపరచగా వారికి 14 రోజుల పాటు ఆయన రిమాండు విధించారు. అనంతరం 11.30 గంటల సమయంలో నిందితులను పోలీసులు తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు.

Updated Date - Feb 10 , 2025 | 01:37 AM