జనవరి ఫస్టు వేడుకలకు కాణిపాకం సిద్ధం
ABN, Publish Date - Jan 01 , 2025 | 01:29 AM
కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి జనవరి ఫస్టున వచ్చే భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి జనవరి ఫస్టున వచ్చే భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన వారందరికీ దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలికంగా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. స్వామి దర్శనాన్ని రాత్రి 10 గంటల దాకా కొనసాగిస్తామన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు బాదం పాలు, బిస్కెట్లు, పులిహోర అందిస్తామన్నారు. భక్తులు స్వామిని దర్శించుకుని వెలుపలకు రాగానే ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వీలుగా లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎనిమిది వేల పెద్ద లడ్డూలు, 80 వేల చిన్న లడ్డూలను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. క్యూలైన్లలో ఎవరైనా అస్వస్థతకు గురైతే అందుబాటులో ప్రథమ చికిత్సాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాణిపాకానికి విచ్చేసే భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడానికి ఖాళీ స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Updated Date - Jan 01 , 2025 | 01:29 AM