‘ఆల్తూరుపాడు’కు రూ.669 కోట్లతో కొత్త ప్రతిపాదనలు
ABN, Publish Date - Apr 08 , 2025 | 01:09 AM
డక్కిలి మండలం ఆల్తూరుపాడులో 1.4 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యంతో రిజర్వాయరు నిర్మాణానికి కొత్తగా రూ.669 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

వెంకటగిరి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): డక్కిలి మండలం ఆల్తూరుపాడులో 1.4 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యంతో రిజర్వాయరు నిర్మాణానికి కొత్తగా రూ.669 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణంలో భాగంగా ఆల్తూరుపాడు రిజర్వాయరు పనులను 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.310 కోట్లతో మొదలు పెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రీ టెండరు పిలిచారు. 26 శాతం లెస్‌కు కాంట్రాక్టు దక్కించుకున్న కడపకు చెందిన ఓ కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఈ రిజర్వాయరును వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు సీఎం కాగానే.. ఈ ప్రాజెక్టుకు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయాఆలని ఆదేశించారు. ఈ కొత్త ప్రతిపాదనలను ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ రిజర్వాయరు పూర్తయితే వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో 97 వేల ఎకరాలకు సాగు నీరు.. శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలకు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ కొత్త ప్రతిపాదనలను సోమవారం వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రాధాకృష్ణకు తెలుగుగంగ ఈఈ రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రిజర్వాయరును జగన్ ప్రభుత్వం అడ్డుకోవడంతో నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. మట్టికట్టకు అవసరమైన 50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాల్లోని చెరువుల్లో తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తెలుగుగంగ డీఈ విజయరామిరెడ్డి, ఏఈ తిరుమలయ్య తదితరులున్నారు.
Updated Date - Apr 08 , 2025 | 01:09 AM