కోరుకున్న వేళకే.. స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌

ABN, Publish Date - Apr 01 , 2025 | 12:42 AM

ప్రజలు తాము కోరుకున్న వేళకే స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకోసం బుధవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రారంభించనుంది.

కోరుకున్న వేళకే.. స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌

రేపటినుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం ప్రారంభం

ప్రయోగాత్మకంగా చిత్తూరు ఆర్వోలో అమలు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తాము కోరుకున్న వేళకే స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకోసం బుధవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రారంభించనుంది. ఈ నూతన ప్రక్రియను జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం (ఆర్వో)లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం శుభ ముహూర్తాలు చేసుకుని ఎక్కువమంది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. దీనివల్ల కొనుగోలు, విక్రయదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దీనికి స్వస్తి పలకడానికి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. స్లాట్‌ బుకింగ్‌ విధానంపై జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బందికి, రాష్ట్రస్థాయిలో ఐజీ కార్యాలయంలో ఇదివరకే సిబ్బందికి పలు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఆనవాయితీగా..

పదేళ్లుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతి ప్రక్రియకు చిత్తూరు ఆర్వోను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ విజయవంతమయ్యాక దశలవారీగా జిల్లాలోని మిగతా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రయోజనాలిలా..

గంటలు, రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి స్వస్తి

క్రయ, విక్రయదారులతోపాటు అధికారులు, సిబ్బందికి ఒత్తిడి ఉండదు.

దళారులు, డాక్యుమెంటు రైటర్ల ప్రభావం తగ్గుతుంది.

దస్తావేజులు, దరఖాస్తులను సరిచూసుకోవడంలో గతంలో లాగా గందరగోళం ఉండదు.

వృద్ధులు, దివ్యాంగులకు అవస్థలు దూరం

అధికారులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేయడానికి తగిన వాతావరణం ఉంటుంది.

వీలునామా వంటి కీలక దస్తావేజుల్లో రాసిన వివరాలను చదివి, వినిపించే సమయంలో నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది.

సేవలు పొందాలంటే..

ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ ఎంపిక చేసుకుని వివరాలు పొందుపరచాలి.

రిజిస్ట్రేషన్‌, ఇతర సేవలకు తమకు నచ్చిన తేదీ, సమయాన్ని ఎంచుకున్నాక క్యూఆర్‌ కోడ్‌తో ఒక టోకెన్‌ వస్తుంది.

ఆ సమయానికి సంబంధిత టోకెన్‌, దస్తావేజులు, దరఖాస్తులతో కార్యాలయానికి వెళ్లి హాజరైతే గంట వ్యవధిలోనే ప్రక్రియ పూర్తవుతుంది.

ఎనీవేర్‌ విధానంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలంటే మాత్రం నిర్ణీత తేదీకి ముందురోజు సంబంధిత దస్తాలను సంబంధిత కార్యాలయానికి ఆన్‌లైన్‌లో చేరేలా చూసుకోవాలి.

స్లాట్‌ బుకింగ్‌ విధానం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

స్లాట్‌ బుకింగ్‌ సేవలకు ఎలాంటి రుసుం ఉండదు.

ఒకవేళ ఈ సేవలను రద్దు చేసుకోవాలంటే రూ.100 చెల్లించాలి. తిరిగి అదే సేవలను పొందాల్సి వస్తే రూ.200 కట్టాలి.

Updated Date - Apr 01 , 2025 | 12:42 AM