తిరుపతి జిల్లాకు మరో పారిశ్రామిక మణిహారం క్రిస్ సిటీ
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:09 AM
నేడు విశాఖ నుంచీ శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ రూ.2139 కోట్లతో 2500 ఎకరాల్లో మౌళిక వసతుల కల్పన రూ.37,500 కోట్ల పెట్టుబడులు... 4.67 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న అంచనా
తిరుపతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాకు మణిమకుటంగా మారనున్న క్రిస్ సిటీకి నేడు ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్టణం నుంచీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రీసిటీ సెజ్ ద్వారా అంతర్జాతీయ కంపెనీల స్థాపనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు అందుకున్న తిరుపతి జిల్లా తాజాగా క్రిస్ సిటీ ప్రాజెక్టుతో మరింత ఉన్నత స్థానానికి చేరనుంది. కృష్ణపట్నం పోర్టు, చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లను ఆధారంగా చేసుకుని క్రిస్ సిటీ ఏర్పాటవుతోంది. చిల్లకూరు, కోట మండలాల్లో మొత్తం పది వేల ఎకరాల్లో మూడు దశల్లో ఏర్పాటయ్యే క్రిస్ సిటీ రూ.37,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని, తద్వారా 4.67 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.
తిరుపతి-నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని కృష్ణపట్నం పోర్టు ఏర్పాటుతో ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో ఏపీఐఐసీ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. మరోవైపు కృష్ణపట్నం పోర్టును ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వం చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభించింది. దీనికింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ కింద క్రిస్ సిటీని ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వ్యయం భరించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది.
10,834 ఎకరాల్లో మూడు దశలుగా..
కేంద్రం రూపొందించిన క్రిస్ సిటీ మొత్తం 10,834 ఎకరాలలో మూడు దశలుగా ఏర్పాటు కానుంది. తొలి దశ పనులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో జిల్లాలోని చిల్లకూరు, కోట మండలాల్లో 2500 ఎకరాలు సేకరించి అందులో క్రిస్ సిటీ ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ తొలిదశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2139.43 కోట్లు. మౌళిక సదుపాయాలు కల్పిస్తే ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ అండ్ అప్పారెల్స్, ఎలకా్ట్రనిక్స్, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ అండ్ ఎంఎ్‌సఎంఈ, ఇతర బిల్డింగ్ మెటీరియల్స్ వంటి సెక్టర్ల నుంచీ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ రంగాల నుంచీ మొత్తంగా రూ. 37,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా 4,67,500 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాయి. క్రిస్ సిటీ ప్రాజెక్టు 2027 ఫిబ్రవరికి పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
తొలి దశ భూసేకరణ పూర్తి
జిల్లాలోని గూడూరు నియోజకవర్గం చిల్లకూరు, కోట మండలాల పరిధిలో ప్రతిపాదిత క్రిస్ సిటీ ఏర్పాటు కానుంది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం, తూర్పు కనుపూరు, మోమిడి, వెల్లపాలెం, బల్లవోలు గ్రామాలు, అలాగే కోట మండలం కొత్తపట్నం, సిద్ధవరం, కర్లపూడి గ్రామాల నుంచీ భూములు సేకరిస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో 1494.15 ఎకరాలు, తూర్పు కనుపూరులో 400.17 ఎకరాలు, మోమిడిలో 282.61 ఎకరాలు, వెల్లపాలెంలో 1715.71 ఎకరాలు, బల్లవోలులో 1639.09 ఎకరాలు, కోట మండలం కొత్తపట్నంలో 3620.79 ఎకరాలు, సిద్ధవరంలో 745.60 ఎకరాలు, కర్లపూడిలో 936.38 ఎకరాలు చొప్పున మొత్తం 10,834.50 ఎకరాలు సేకరించాల్సి వుండగా ప్రస్తుతానికి తొలిదశ కోసం గుర్తించిన 2500 ఎకరాల్లో ఇప్పటి వరకూ 2,238 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 262 ఎకరాలు పెండింగులో వుంది.
మొదలైన పనులు
క్రిస్ సిటీలో మౌళిక సదుపాయాల కల్పన కింద రోడ్ నెట్‌వర్క్, వాటర్ సప్లై నెట్‌వర్క్, రీ యూజ్ వాటర్ నెట్‌వర్క్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 132-33 కేవీ సబ్ స్టేషన్, 33-11 కేవీ ఇంటర్నల్ సబ్ స్టేషన్లు వంటివి నిర్మించాల్సి ఉంది. వీటిలో రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాల పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నేడు ప్రధాని శంకుస్థాపన చేయనుండడంతో ఇక నుంచీ పనులు జోరందుకోనున్నాయి.
Updated Date - Jan 08 , 2025 | 01:09 AM