తిరుపతి జిల్లాకు నేటితో మూడేళ్లు

ABN, Publish Date - Apr 04 , 2025 | 01:51 AM

తిరుపతి జిల్లా ఏర్పడి నేటితో మూడేళ్ళు పూర్తయింది. అశాస్త్రీయంగా జరిగిన విభజనతో కాలూచెయ్యీ కూడదీసుకోవడానికే కొత్తజిల్లా సతమతం అవుతోంది. జిల్లా కలెక్టరేట్‌ సహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

తిరుపతి జిల్లాకు నేటితో మూడేళ్లు
తిరుపతిలో టీటీడీకి చెందిన పద్మావతీ నిలయంలో కొనసాగుతున్న జిల్లా కలెక్టరేట్‌

- ఇంకా అద్దె నీడలోనే..

తిరుపతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా ఏర్పడి నేటితో మూడేళ్ళు పూర్తయింది. అశాస్త్రీయంగా జరిగిన విభజనతో కాలూచెయ్యీ కూడదీసుకోవడానికే కొత్తజిల్లా సతమతం అవుతోంది. జిల్లా కలెక్టరేట్‌ సహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడూ, విశాలమైన సముద్ర తీరం, శ్రీసిటీ పారిశ్రామిక సముదాయం ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే తిరుపతి జిల్లా ఈపాటికి కుదేలై కుప్పకూలి ఉండేది. సమర్ధులైన అధికారుల సారధ్యంలో ప్రగతి దిశగా పరుగులందుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజాప్రతినిధుల తోడ్పాటు జతకలిస్తేనే ఈ పరుగు వేగం అందుకుంటుంది.

మూడు జిల్లాల్లోకి చెల్లాచెదురు

పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా, తిరుపతి జిల్లాలో దానిని పాటించలేదు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, గూడూరు మాత్రమే పూర్తిగా తిరుపతి జిల్లాలో వున్నాయి. వెంకటగిరి సెగ్మెంట్‌లో మూడు మండలాలు తిరుపతి జిల్లాలో, మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో కలిపారు. సర్వేపల్లి సెగ్మెంట్‌ పూర్తిగా నెల్లూరు జిల్లాలో వుంది. అంటే పార్లమెంటు నియోజకవర్గం మూడు రకాలుగా రెండు జిల్లాల నడుమ చెల్లాచెదురైంది. మరోవైపు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి సెగ్మెంట్‌ పూర్తిగా తిరుపతి జిల్లాలో వుండగా అదే పార్లమెంటు పరిధిలోని నగరి సెగ్మెంటుకు సంబంధించి మూడు మండలాలు చిత్తూరు జిల్లాలో, రెండు మండలాలు తిరుపతి జిల్లాలో కలిపారు. దీనివల్ల పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అభివృద్ధి, సమస్యలపై రెండు జిల్లాల అధికార యంత్రాంగాలతో ఎంపీలు సంప్రందించాల్సి వస్తోంది. అలాగే వెంకటగిరి, నగరి ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యల గురించి రెండు జిల్లాల అధికారులను కలవాల్సి వస్తోంది. ఎన్నికల నిర్వహణ సైతం ఇబ్బందిగా మారుతోంది. మూడేళ్ళవుతున్నా ఈ అశాస్త్రీయ విభజనను సరిదిద్దనే లేదు.

కంగాళీగా రెవిన్యూ డివిజన్లు

వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, సైదాపరం, రాపూరు మండలాలు నెల్లూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలో వుండగా వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు తిరుపతి జిల్లా గూడూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలో వున్నాయి. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట, పుత్తూరు మండలాలు తిరుపతి రెవిన్యూ డివిజన్‌ పరిధిలో వుండగా నగరి, నిండ్ర, విజయపురం మండలాలు చిత్తూరు జిల్లాలోని నగరి రెవిన్యూ డివిజన్‌ పరిధిలో వున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు, వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ తదితర మూడు మండలాలు సూళ్ళూరుపేట రెవిన్యూ డివిజన్‌ పరిధిలో వుండగా పిచ్చాటూరు, నాగలాపురం, కేవీబీపురం, నారాయణవనం శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజన్‌ పరిధిలో వున్నాయి. దీనివల్ల వెంకటగిరి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలకు సైతం ఆర్డీవోలను కలవడం సమస్యగా మారుతోంది.

విభజన కాని శాఖలు, సంస్థలు

కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాక కూడా కొన్ని శాఖలు, పాలకమండళ్ళతో కూడిన సంస్థలు విభజితం కాలేదు. ఉదాహరణకు తిరుపతి జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి కోర్టులు చిత్తూరు జిల్లా జడ్జి నియంత్రణలో వుండగా సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి కోర్టులు నెల్లూరు జిల్లా జడ్జి పర్యవేక్షణ కింద వున్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్‌ బోర్డు, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటివి జిల్లాల నడుమ విభజన కాలేదు. ఇక జిల్లా పరిషత్తు అనేది పంచాయతీరాజ్‌ శాఖలో గ్రామీణాభివృద్ధి పరంగా కీలక పాత్ర పోషిస్తుంది. జడ్పీ విభజన జరగకపోవడంతో తిరుపతి జిల్లాలోని 34 మండలాలకు గానూ 20 మండలాలపై చిత్తూరు జడ్పీ నియంత్రణ, పర్యవేక్షణ కొనసాగుతుండగా మిగిలిన 14 మండలాలపై నెల్లూరు జడ్పీ అజమాయిషీ నడుస్తోంది. చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ పరిధిలో 20 మండలాలు, నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థ పరిధిలో 14 మండలాలు వున్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల కార్యకలాపాలు కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల అజమాయిషీలో వున్నాయి. ఇందువల్ల జిల్లా అధికార యంత్రాంగానికి ఆయా శాఖలు, సంస్థలపై పట్టు, నియంత్రణ లేకుండా పోతోంది.

టీటీడీ భవనలోనే కలెక్టరేట్‌

మూడేళ్లయినా తిరుపతి జిల్లా కలెక్టరేట్‌కే సొంత భవనం లేదు. యాత్రికుల కోసం టీటీడీ నిర్మించిన పద్మావతీ నిలయంలో తాత్కాలికం పేరుతో మొదలైన పాలన అలాగే కొనసాగుతోంది. ఏడంతస్తులు, 200 గదులతో కూడిన పద్మావతీ నియలంలో 46 శాఖలకు 180 గదులు కేటాయించారు. ఇంకా 20 గదులు ఖాళీగా వున్నాయి. నెలకు రూ. 25,29,755 అద్దె చెల్లించేలా 2022 మార్చి 7 నుంచీ రెండేళ్ళ పాటు లీజుపై ఈ భవనాన్ని కేటాయించారు. రెండేళ్ళ గడువు ముగిశాక 2024 మార్చి 7నుంచీ 2027 మార్చి 6 వరకూ మూడేళ్ళ పాటు లీజు పొడించారు. నెలవారీ అద్దె రూ. 26,05,647గా నిర్ణయించారు. ఇప్పటిదాకా ఈ భవనానికి అద్దెకింద ప్రభుత్వం టీటీడీకి రూ.9,19,81,884లు చెల్లించాల్సి వుండగా, ఇప్పటిదాక రూ. 5,62,47,187లు చెల్లించారు. రూ. 3,57,34,697 బకాయి ఉన్నారు. ఇక నెలకు విద్యుత్‌కే రూ.9లక్షలు ఖర్చవుతోంది. భవన సముదాయంలో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ వంటివి టీటీడీయే చేపడుతోంది. మూడేళ్ళు అయినా ప్రభుత్వం కలెక్టరేట్‌కు సొంత భవనం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. కనీసం స్థల సేకరణ కూడా జరగలేదు. ఏడాదికి 3 కోట్లకు పైగా అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం అదే నిధులతో నిర్మాణం చేపడితే అద్దె భారం తగ్గుతుందని పలువురు సూచిస్తున్నారు.

సర్దుకుని నడుస్తున్న ఆర్డీవో ఆఫీసులు

తిరుపతి జిల్లా ఏర్పాటయ్యాక కొత్తగా శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. దీనికి సొంత భవనం లేదు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలోనే నడుస్తోంది. అలాగే నాయుడుపేట కేంద్రంగా మునుపటి నుంచీ వున్న రెవిన్యూ డివిజన్‌ కేంద్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం సూళ్ళూరుపేటకు మార్చింది. అక్కడా ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనం లేదు. రైతు సేవా సహకార సంఘం ఆవరణలో గోదాము కోసం నిర్మించిన భవనంలో నడుస్తోంది.

ఎస్పీ ఆఫీసుకు మాత్రమే సొంత నీడ

తిరుపతి జిల్లా ఏర్పాటు కాక మునుపే తిరుపతి కేంద్రంగా అర్బన్‌ పోలీసు జిల్లా ఏర్పాటైనందున ఎస్పీ కార్యాలయానికి మాత్రమే శాశ్వత భవన వసతి అందుబాటులో వుంది. మిగిలిన ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలకు సొంత భవనాలు లేవు.

Updated Date - Apr 04 , 2025 | 01:51 AM