అన్‌స్టాపబుల్ కుప్పం
ABN, Publish Date - Jan 07 , 2025 | 02:14 AM
‘కుప్పం అభివృద్ధిని ఇక ఎవరూ ఆపలేరు. అన్‌స్టాబుల్‌గా అభివృద్ధి చేసి చూపిస్తా.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
మోడల్ నియోజకవర్గంగా సర్వతోముఖాభివృద్ధి
రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానీ, మీకు ఎమ్మెల్యేనే
స్వర్ణకుప్పం విజన్- 2029 ఆవిష్కరణలో సీఎం
నడిమూరులో సోలరైజేషన్ పథకం ప్రారంభం
నెట్ జీరో కాన్సెప్ట్‌పై కాన్పూర్ ఐఐటీతో ఒప్పందం
కుప్పం/గుడుపల్లె, జనవరి6(ఆంధ్రజ్యోతి): ‘కుప్పం అభివృద్ధిని ఇక ఎవరూ ఆపలేరు. అన్‌స్టాబుల్‌గా అభివృద్ధి చేసి చూపిస్తా.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానీ, మీకు ముందుగా ఎమ్మెల్యేని. అందుకే కుప్పం సర్వతోముఖాభివృద్ధి నా బాధ్యత. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది, రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతా.’ అన్నారు.కుప్పం నియోజకవర్గ పర్యటనలో మొదటి రోజైన సోమవారంనాడు ముఖ్యమంత్రి కుప్పం, గుడుపల్లె మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్వర్ణకుప్పం విజన్- 2029 ఆవిష్కరించారు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విజన్ డాక్యుమెంట్‌తో కుప్పం భవిష్య అభివృద్ధిని వివరించారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం మండలం నడిమూరులో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభించి వేదికనుంచి ప్రసంగించారు. అంతకుముందు ఆయన నెట్ జీరో కాన్సె్‌ప్టపై కాన్పూర్ ఐఐటీతో ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత మండలంలోని శీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత అయిదేళ్ల విధ్వంస పాలనలో కుప్పం అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవడమే కాక, పదేళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రెట్టించిన వేగంతో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి స్వర్ణ కుప్పం విజన్‌తో ముందుకు వచ్చానన్నారు.గత పాలకులు కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవడమే కాక, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారన్నారు. అయితే ఇక ఎవరూ కుప్పం అభివృద్ధిని ఆపలేరని,అది అలా అన్‌స్టాపబుల్‌గా ముందుకు సాగుతూనే ఉంటుందని ప్రకటించారు.2024లో అధికారంలోకి వచ్చాక ఒకసారి కుప్పం వచ్చి వెళ్లానని గుర్తు చేసుకున్న చంద్రబాబు, అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా కడా ఏర్పాటు చేసి, తద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టానన్నారు. పేదరికంలేని సమాజాన్ని ఇక్కడ సృష్టిస్తానని, ప్రతి కుటుంబమూ ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు అమలుపరుస్తానని చెప్పారు. పెద్దయెత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఇందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా వారి స్వావలంబనకు చర్యలు తీసుకుంటానన్నారు.
జూన్‌కల్లా హంద్రీ-నీవా జలాలు
హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కెనాల్‌ను జూన్ నెలకల్లా పూర్తి చేసి నియోజకవర్గానికి సాగు, తాగునీటి వనరులు పుష్కలంగా అందేలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హంద్రీ-నీవా జలాలను పాలారు నదికి తీసుకొస్తానన్నారు. ఈ నదిపై చెక్‌డ్యామ్‌లు మరిన్ని నిర్మించి నీటిని నిల్వ చేసి కుప్పంలో బంగారు పంటలు పండించేలా చూస్తానన్నారు. ‘ప్రతి రంగంలో సాంకేతికత ప్రముఖ పాత్ర వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వ్యవసాయాన్ని కూడా అత్యాధునిక సాంకేతికత వినియోగంతో లాభసాటిగా మారుస్తాం’ అని హమీ ఇచ్చారు. భవిష్యత్తులో డీప్ టెక్నాలజీదే హవా అని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఏకంగా 150 సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.
సోలరైజేషన్ ఒక చరిత్ర
నడిమూరులో సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభించడం ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలుత ఈ పథకాన్ని ప్రారంభించిన నడిమూరు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. సోలరైజేషన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం ప్రజలు తనకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతిసారీ గెలిపిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అవకాశం కల్పిస్తున్న ఇక్కడి ప్రజలకు అండగా ఉండి, ఆర్థికంగానే కాక, అన్ని అంశాలలో పైకి తీసుకొస్తానన్నారు. నెట్ జీరో కాన్సెప్ట్‌కు సంబంధించి కాన్పూర్ ఐఐటీతో కుదిరిన ఒప్పందంతో కాలుష్య రహిత కుప్పాన్ని నిర్మిస్తామని, ప్రజలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సైకిళ్లు వంటివాటి ద్వారా కర్చన ఉద్గారాలను అరికడతామని చెప్పారు.జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, కోనేటి ఆదిమూలం, గురజాల జగన్మోహన్, డాక్టర్ థామస్, మురళీమోహన్, టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్.మునిరత్నం,టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ బీఆర్ సురేశ్‌బాబు, కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్, ఎస్పీడీసీఎల్ అధికారులు, రెస్కో ఎండీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 07 , 2025 | 02:14 AM