తిరుపతి కన్నీరు పెట్టిన వేళ..
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:18 AM
అఖిలాండకోటి భక్తజనం కన్నీరు పెట్టింది. తిరుపతి నగరం దుఃఖ సముద్రంగా మారిపోయింది. వైంఠద్వార దర్శనాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అశువులుబాసిన వారిని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. బుధవారం రాత్రి బైరాగిపట్టెడ పార్క్ ప్రధాన గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఆరుగురి మృతదేహాలున్న.. రుయా మార్చురీ ప్రాంతం ఏడుపులతో నిండిపోయింది. గాయపడిన వారున్న స్విమ్స్ పద్మావతి ఆసుపత్రి.. నాయకుల పరామర్శలతో కిక్కిరిసింది. ఏర్పాట్లలో వైఫల్యమా? భక్తోత్సాహపు ఆత్రుతా? నిర్వహణ లోపమా?.. కారణాలు ఏవైనా కన్నుమూసింది మాత్రం అమాయకపు, సాధారణ భక్తజనం. లక్షల పరిహారాలు.. పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురావు. విపక్షపు నిందలు.. ఓదార్పునివ్వవు. వైంకుఠద్వారాల్లోంచి స్వామి దర్శనం కోసం వచ్చి విగతజీవులైన తమవారి దేహాలతో కుటుంబసభ్యులు స్వస్థలాలకు పయనమయ్యారు.
అఖిలాండకోటి భక్తజనం కన్నీరు పెట్టింది. తిరుపతి నగరం దుఃఖ సముద్రంగా మారిపోయింది. వైంఠద్వార దర్శనాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అశువులుబాసిన వారిని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. బుధవారం రాత్రి బైరాగిపట్టెడ పార్క్ ప్రధాన గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఆరుగురి మృతదేహాలున్న.. రుయా మార్చురీ ప్రాంతం ఏడుపులతో నిండిపోయింది. గాయపడిన వారున్న స్విమ్స్ పద్మావతి ఆసుపత్రి.. నాయకుల పరామర్శలతో కిక్కిరిసింది. ఏర్పాట్లలో వైఫల్యమా? భక్తోత్సాహపు ఆత్రుతా? నిర్వహణ లోపమా?.. కారణాలు ఏవైనా కన్నుమూసింది మాత్రం అమాయకపు, సాధారణ భక్తజనం. లక్షల పరిహారాలు.. పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురావు. విపక్షపు నిందలు.. ఓదార్పునివ్వవు. వైంకుఠద్వారాల్లోంచి స్వామి దర్శనం కోసం వచ్చి విగతజీవులైన తమవారి దేహాలతో కుటుంబసభ్యులు స్వస్థలాలకు పయనమయ్యారు.
మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
రెండు గంటల్లోనే పోస్టుమార్టం పూర్తిచేసి స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
డీఎస్పీ రమణకుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెన్షన్
ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్ బదిలీ
తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం
తిరుపతి, జనవరి9(ఆంధ్రజ్యోతి) : వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురి మృతి నేపథ్యంలో గురువారం తిరుపతి నగరం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. సీఎం, డిప్యూటీ సీఎం, విపక్ష నాయకుడు, మంత్రుల రాకతో ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతం, క్షతగాత్రులున్న స్విమ్స్ పద్మావతి ఆసుపత్రుల ప్రాంగణం ఓదార్పులతో హోరెత్తిపోయింది. ఉదయం ఎనిమిదింటికే మంత్రుల బృందం రుయా ఆస్పత్రికి చేరుకుంది. హోం మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ రుయా మార్చురీవద్ద విలపిస్తున్న మృతుల బంధువులను ఓదార్చారు. దగ్గర ఉండి మృతదేహాలను వారి స్వస్థలాలకు అధికారులను వెంట ఇచ్చి పంపించారు.
చంద్రబాబు ఆగ్రహం
మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు బైరాగపట్టెడలోని పద్మావతి పార్కుకు చేరుకుని ఘటనా స్థలానికి పరిశీలించారు. అక్కడే ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్షమించరాని తప్పుగా అభివర్ణించారు. అక్కడనుంచి నేరుగా మధ్యాహ్నం 2.40 గంటలకు స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. దాదాపు గంటకు పైగా వారితో పాటు బంధు మిత్రులతో మాట్లాడారు. సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దురదృష్టకర ఘటనపై చింతించారు. ఆతర్వాత టీటీడీ పరిపాలన భవనంకు చేరుకుని తొక్కిసలాట ఘటనపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌లను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణకుమార్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. మీడియా సమావేశం అనంతరం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు పయనమయ్యారు.
మండిపడ్డ పవన్
సీఎం చంద్రబాబు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో ఉండగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 3.30గంటలకు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టెడ ప్రాంతంలోని పద్మావతి పార్క్ రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయితో పాటు అధికార యంత్రాంగంతో చర్చించారు. ప్రమాదానికిగల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4.20గంటలకు స్విమ్స్‌కు చేరుకొని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. చికిత్స పొందుతున్నవారినీ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆస్పత్రి బయటకువచ్చి మీడియాతో మాట్లాడారు. టీటీడీ, పోలీస్ అధికారుల వైఫల్యాలపై మండిపడ్డారు. తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ క్షమించమని వేడుకున్నారు.
జగన్ హడావుడి
పవన్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తన అనుచరగణంతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈసందర్భం గా వైసీపీ శ్రేణులు నానా యాగీచేయడంతో విమర్శలకు గురయ్యారు. తొక్కిసలాట ఘటనకు ప్ర భుత్వమే పూర్తి బా ధ్యత వహించాలని డిమాండు చేశారు.
మనసు కలత చెందింది
తిరుపతి సంఘటన నా మనసును కలిచివేసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయాలకతీతంగా వెంకన్నకు సేవ చేస్తున్నామన్న భావనతో అందరం ముందుకెళ్లాలి. అధికారయంత్రాంగం సమన్వయంతో ఇలాంటి అపశ్రుతులు జరగకుండా జాగ్రత్త పడాలి. ఇటువంటి సంఘటనలు ఇక జరగకుండా చర్యలు తీసుకుంటాం.
- సీఎం చంద్రబాబు
క్షమించండి !
ఈ ఘటనకు శ్రీవారి భక్తుల్ని, రాష్ట్ర ప్రజల్ని, హైందవ ధర్మాన్నీ.. ఇలా ప్రతి ఒక్కరినీ క్షమించమని ప్రభుత్వం తరుపున కోరుతున్నా. తప్పు జరిగిందని తప్పించుకోవడంలేదు. బాధ్యత తీసుకుంటున్నాం. తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలననే ప్రణాళిక కూడా లేదు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నాం. టీటీడీలో ప్రక్షాళన మొదలుకావాల్సిన అవసరం ఉంది.
- డిప్యూటీ సీఎం పవన్
ప్రతిష్ట దిగజార్చారు టీటీడీ పరువు ప్రతిష్టను
దిగజార్చింది చంద్రబాబు ప్రభుత్వమే. టీటీడీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో పాటు బాబు కూడా బాధ్యుడే. కుప్పం పర్యటనకు పోలీసులను తరలించి, ఇక్కడ ప్రత్యామ్నాయం చూడకపోవడం కూడా తప్పిదమే. సీఎం పర్యటనకు ఇచ్చిన ప్రాధాన్యత భక్తులకు ఇవ్వలేదు. ఇది ఓ బ్లాక్ మార్క్‌లా నిలిచిపోతుంది.
- మాజీ సీఎం జగన్
కుట్రకోణంపై పవన్ అనుమానాలు
వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీలో జరిగిన తొక్కిసలాటపై కుట్రకోణాలు దాగివుందని వస్తున్న అనుమానాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా లేవనెత్తారు. ముఖ్యంగా పోలీసుల వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. అంతేకాకుండా స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పవన్ పరామర్శించి బయట మీడియాతో మాట్లాడుతుండగా అప్పుడే జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ముఖ్యనేతలను పోలీసులు ఆసుపత్రి లోపలకు అనుమతించడంపై పవన్ తప్పుబట్టారు. ఉద్విగ్న పరిస్థితుల నేపథ్యంలో ఒక నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు అదేస్థానానికి మరో నాయకుడిని ఎలా అనుమతిస్తారని పవన్ ప్రశ్నించారు. ఇదేదో ఉద్దేశ్యపూర్వంగా చేస్తున్నట్టు కనిపించందని తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వద్ద ఈ అంశంపై మాట్లాడారు.
Updated Date - Jan 10 , 2025 | 01:18 AM