చిరుతలు రోడ్డెందుకు దాటుతున్నాయి?
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:49 AM
ఏడాదిన్నర కిందట అలిపిరి నడక దారిలో మూడు నెలల వ్యవధిలో ఇద్దరు చిన్నారులపై చిరుతలు రాత్రిపూట దాడి చేసిన ఘటన అందరికీ గుర్తుండే వుంటుంది. ఇపుడు ఏకంగా అలిపిరి-చెర్లోపల్లి ప్రఽధాన రహదారిలో పట్టపగలు ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసినంత పని చేసింది. ఎవరి కంటా పడడం ఇష్టపడని జంతువుగా చిరుతకు పేరుంది.
- అటవీ ప్రాంతంతో కలగలసిపోయిన వర్శిటీలు
- అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో హోటళ్లు, హాస్టళ్లు
- వాటినుంచి వచ్చే వ్యర్థాల చుట్టూ చేరుతున్న కుక్కలు, జింకలు, అడవి పందులు
- చిరుతలను ఆకర్షిస్తున్న ఫుడ్ చెయిన్
ఏడాదిన్నర కిందట అలిపిరి నడక దారిలో మూడు నెలల వ్యవధిలో ఇద్దరు చిన్నారులపై చిరుతలు రాత్రిపూట దాడి చేసిన ఘటన అందరికీ గుర్తుండే వుంటుంది. ఇపుడు ఏకంగా అలిపిరి-చెర్లోపల్లి ప్రఽధాన రహదారిలో పట్టపగలు ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసినంత పని చేసింది. ఎవరి కంటా పడడం ఇష్టపడని జంతువుగా చిరుతకు పేరుంది. అలాంటిది మిట్ట మధ్యాహ్నం పూట అందులోనూ నగరం నుంచీ అడవిలోకి వెళ్ళేందుకు ప్రధాన రహదారి దాటుతూ చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. అసలు చిరుత పగటి వేళ శేషాచలం వదిలి అలిపిరి రోడ్డుదాటి మరీ నగరంలోకి ఎందుకు వచ్చింది? అడవి విడిచిపెట్టి వచ్చేంతగా తిరుపతిలో చిరుతలను ఆకర్షిస్తున్నది ఏముంది? అన్న ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.
తిరుపతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):ప్రకృతిలో జీవి మనుగడకు ఆధారమైంది ఆహారపు గొలుసు. ఇపుడదే ఆహారపు గొలుసు చిరుతలను శేషాచలం నుంచీ తిరుపతి నగరంలోకి రప్పిస్తోంది. తిరుపతిని శేషాచల అడవుల నుంచీ విడదీసేందుకు ప్రత్యేకంగా ఎలాంటి కంచెలు, ప్రహరీలు లేవు. ఎస్వీ యూనివర్శిటీ మొదలుకుని అనేక విద్యా సంస్థల ఆవరణలు శేషాచల అటవీ ప్రాంతంతో కలసిపోయి వున్నాయి. కేవలం అలిపిరి-చెర్లోపల్లి మెయిన్ రోడ్డు ఒక్కటే వాటిని విడదీస్తోంది. అయితే రాకపోకలను ఆపే సరిహద్దు కాదది. ఒకరకంగా చెప్పాలంటే అడవి నుంచీ జంతువుల రాకపోకలను ఈ రోడ్డు మరింత సులువు చేస్తోంది. ఎస్వీయూ, వేదిక్, వెటర్నరీ వర్శిటీలు, అగ్రికల్చర్ కాలేజీలలో హాస్టళ్ళు వున్నాయి. వాటి ద్వారా రోజువారీ భారీగా వ్యర్థాలు ఆవరణల్లో పోగుపడుతున్నాయి. మరోవైపు అలిపిరి-చెర్లోపల్లి ప్రధాన మార్గం వెంబడీ పలు హోటళ్ళు, కేఫ్‌లు వెలిశాయి. వీటి నుంచీ కూడా పెద్దఎత్తున వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఈ వ్యర్థాల కోసం కుక్కలు, జింకలు, అడవి పందులు యధేచ్ఛగా వస్తున్నాయి. వర్శిటీల ఆవరణల్లో పగలు కూడా జింకలు, అడవి పందులు పెద్ద సంఖ్యలో తిరుగాడుతూ కనిపిస్తున్నాయి. ఇక కుక్కలైతే మందలుమందలుగా తిరుగుతున్నాయి. ఈ మూడింటి కోసం చిరుతలు శేషాచలం నుంచీ రోడ్డు దాటి ఈ వర్శిటీల వైపు వస్తున్నాయి. శేషాచల దిగువ భాగాన వున్న ఎస్వీయూ సహా పలు విద్యా సంస్థల ఆవరణల్లోకి చిరుతలు రావడం కొత్త కాదు. పై జంతువుల కోసం రెండు దశాబ్దాలుగా చిరుతల రాకపోకలు సాగుతున్నాయి. అయితే గతంలో ఎప్పుడూ రాత్రిళ్ళు మాత్రమే ఎవరి కంటా పడకుండా అడవి దాటి వర్శిటీల ఆవరణల్లోకి వచ్చే చిరుతలు ఇపుడు ఏకంగా పగలే చొరబడుతున్నాయి. అలిపిరి నడక దారిలో చిన్నారులపై దాడి జరిగినట్టు వర్శిటీల ఆవరణల్లోనూ, అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులోనూ ఇప్పటి దాకా ఎలాంటి ఘటనలూ నమోదు కాలేదు కానీ ఇకమీదట జరగబోవన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అమర్చిన కెమెరా ట్రాపుల్లో చిరుతల రాకపోకలు, కుక్కలను నోటకరుచుకుని వెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. విద్యార్థులు కూడా తమ మొబైళ్ళలో చిరుతల కదలికలను చిత్రీకరించిన ఉదంతాలున్నాయి.
తక్షణ చర్యలు తీసుకోకుంటే ప్రమాదమే!
శేషాచల అడవుల్లో చిరుతలు సుమారు 50కి పైగా వుంటాయని అంచనా. అడవిలో వాటి సంఖ్య పెరిగే కొద్దీ సులువుగా దొరికే ఆహారం కోసం అడవి దాటి బయటకు రావడం కూడా పెరుగుతోంది. అడవిలో అయితే జింకలు, అడవిపందులు వంటి వాటిని వెంటాడి వేటాడాలి. అదే అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు దాటి దక్షిణానికి వస్తే విద్యాసంస్థల ఆవరణల్లో కుక్కలు, జింకలు, అడవిపందులు సులువుగా దొరికే అవకాశముంది. అందుకే ఈ వైపు చిరుతల కదలికలు క్రమేపీ పెరుగుతున్నాయి. అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు వెంబడీ హోటళ్ళు, కేఫ్‌లకు అనుమతి రద్దు చేయడం, లేదా కనీసం వారు వ్యర్థాలను దూరంగా పారబోసేలా చర్యలు తీసుకోవాల్సివుంది. వర్శిటీల హాస్టళ్ళ నుంచీ వచ్చే వ్యర్థాలు ఆవరణలో పడేయకుండా చూడాలి. వర్శిటీల ఆవరణల్లో రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం వచ్చే వారు కూడా వ్యర్థాలు పడేస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కుక్కలకు పెడుతున్నారు. దీంతో కుక్కల సంఖ్య పెరుగుతోంది. వ్యర్థాలు ఆవరణలో పడేయకుండా నివారిస్తే చిరుతల రాకపోకలు కూడా ఆగిపోతాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చిరుతలు మనుషులపై దాడి చేసే వరకూ ఆగకుండా ఆ దిశగా చర్యలు తక్షణావసరం.
Updated Date - Jan 12 , 2025 | 01:49 AM