Chandrababu: బ్రాండ్ ఏపీ!
ABN, Publish Date - Jan 11 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్మాణ రంగం అధ్వానంగా తయారైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఇప్పుడిప్పుడే విశ్వాసం పెరుగుతోంది
అమరావతి అభివృద్ధి చెంది ఉంటే...
‘అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే గుంటూరు పరిసర ప్రాంతాలు ఈపాటికే నిలదొక్కుకొని ఉండేవి. అమరావతిని నిర్వీర్యం చేసి ఎక్కడ చూసినా విధ్వంసం చేశారు. హైదరాబాద్ కంటే మిన్నగా 183 కిలోమీటర్ల పొడవునా అమరావతి అవుటర్ రింగురోడ్డు ప్లాన్ చేశాం. గుంటూరు, విజయవాడ వంటి నగరాలు దీని పరిధిలోనే ఉంటాయి. అమరావతి ఒక మహానగరం అయి ఉండేది. విశాఖ, తిరుపతి నగరాలను కూడా గణనీయంగా అభివృద్ధి చేస్తాం’
- సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి
వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
ఆదుకొని మళ్లీ అభివృద్ధిలోకి తెస్తాం
అందరూ మెచ్చుకొనేలా నూతన పాలసీ
జాప్యం చేస్తే ఆటోమేటిక్‌గా అనుమతుల మంజూరు
ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం
ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం
బిల్డర్లూ తప్పులు చేయొద్దు.. అడ్డదారుల్లో పోవద్దు
నరెడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
గుంటూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్మాణ రంగం అధ్వానంగా తయారైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రంగానికి పెద్ద బూస్టప్ అవసరమని తెలిపారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని ఆదుకొని, మళ్లీ పైకి తీసుకొస్తామని ప్రకటించారు. శుక్రవారం గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్ కౌన్సిల్(నరెడ్కో) క్యాపిటల్ జోన్ 12వ ప్రాపర్టీ షోను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, ప్రసంగించారు. ‘ఎన్నికల సమయానికి రాష్ట్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. అన్ని రంగాలు పతానవస్థకు చేరుకొన్నాయి. ఎటు చూసినా విధ్వంసం, అంధకారమే. ప్రజలు మమ్మల్ని నమ్మి 93శాతం మంది అభ్యర్థులను గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలుపుకొంటూ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ.2.08 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి.. విశ్వాసం పెరుగుతోంది. బ్రాండ్ ఏపీ మళ్లీ ముందుకెళ్తోంది’ అని సీఎం చెప్పారు. భవన నిర్మాణ రంగంలో ఏపీ నూతన విధానం శెభాష్ అనేలా ఉంటుందని, ఏ ఇతర రాష్ట్రమైనా దాన్ని ఆదర్శంగా తీసుకొనేలా చేస్తామని చంద్రబాబు తెలిపారు. ‘2నెలల్లోనే భవన నిర్మాణాలకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును తెస్తున్నాం. అందులో సంబంధిత అన్ని శాఖల సేవలు అందుబాటులో ఉంటాయి. ఎన్‌వోసీలు, ఇతర అనుమతుల కోసం వాటిచుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. బిల్డింగ్, లేఅవుట్ ప్లాన్లను ఏ శాఖ ఎన్ని రోజుల్లో క్లియరెన్స్ చేసిందో కూడా తెలియజేస్తాం. నిర్ణీత వ్యవధిలో దరఖాస్తు క్లియర్ కాకపోతే ఆటోమేటిక్‌గా అనుమతులు వచ్చేలా చేసి జాప్యానికి బాధ్యులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొంటాం’ అని ప్రకటించారు.
అవకాశాలను అందిపుచ్చుకుంటాం
అభివృద్ధికి దోహదం చేసే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఇక్కడ టీడీపీ, కేంద్రంలో ఎన్డీయే ముందుంటాయని చంద్రబాబు అన్నారు. ‘పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం వృద్ధి కావాలి. అప్పుడే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం అభివృద్ధి సాధిస్తుంది. రాష్ట్రంలో 35లక్షల మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక లభించక నిర్మాణ రంగం కుదేలైంది. పనులు దొరక్క కార్మికులు రోడ్లెక్కారు. మేం అధికారంలోకి వస్తూనే ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చాం. ఇసుకను దబాయించి తీసుకొనే హక్కు కల్పించాం. ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేసి అసాంఘిక శక్తులను కట్టడి చేసి సులభతరం చేశాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిర్మాణ రంగం నిరంతరం అభివృద్ధి చెందాలి. ఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సమస్యలను రియల్‌టైంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
భూకబ్జాలు చేసేవారిని వదిలిపెట్టం
‘వైసీపీ హయాంలో రికార్డులు తారుమారు చేసి భూకబ్జాలను ప్రోత్సహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకొచ్చి ఇష్టానుసారం చేశారు. మేం ఆ చట్టాన్ని రద్దు చేశాం. ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. వాటి పరిష్కారానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు తీసుకొచ్చాం. ఇకపై భూకబ్జా చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌ని రూపొందించాం. తలసరి ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చబోతున్నాం. ఎన్‌టీపీసీ, జెన్‌కో సహకారంతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ సంస్థ బయో ఇంధనంతో ముందుకొచ్చింది. దాదాపుగా రూ.10 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు త్వరలో రాబోతున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇండస్ట్రియల్ టౌన్‌షి్‌పలుగా మారతాయి’ అని చంద్రబాబు తెలిపారు. బిల్డర్లు ఎవరూ తప్పులు చేయొద్దని సీఎం హితవు పలికారు. ‘అడ్డదారుల్లో పోవాలని చూడొద్దు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల విషయంలో బిల్డర్లు, రియల్టర్లు స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఎవరైనా తప్పు చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. టెక్నాలజీని అనుసంధానం చేసుకొని నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టాలి. కృత్రిమ మేధస్సుని వినియోగించుకొని మరింతగా అభివృద్ధి చెందాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.
Updated Date - Jan 11 , 2025 | 04:28 AM