Ap Multi-Specialty Hospitals: ప్రతి నియోజకవర్గానికీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:40 AM
ప్రతి నియోజకవర్గంలో 100-300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తూ, డిజిటల్ సర్వే, క్యాన్సర్, టీబీ, సికిల్ సెల్ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.

100 నుంచి 300 పడకలతో ఏర్పాటు
పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి చర్యలు
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి
కొత్తగా 13 డ్రగ్ డీ-ఎడిక్షన్ సెంటర్లు
ఆరోగ్య శాఖపై సమీక్షలో చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్యసేవల్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయన్నారు. మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని సూచించారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలన్నారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. విద్య, వైద్య రంగాలు తమ ప్రాధామ్యాలని, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలందేలా చూడాలన్నారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ ప్రక్రియపైనా సీఎం సమీక్షించారు. రూ.32.5 కోట్లతో 25 డ్రగ్ డీ-ఎడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయడం, కొత్తగా మరో 13 డ్రగ్ డీ-ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్‌సీల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మెషిన్లు పెంచాలని, కొవ్వూరు-నిడదవోలు సీహెచ్‌సీలు అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు.
కుప్పంలో డిజిటల్ సర్వేపై ఆరా
కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ సర్వే సెంటర్ పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన వినూత్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఇది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ సర్వే సెంటర్ దోహదపడతుందని చంద్రబాబు అన్నారు. దేశంలోనే అత్యధికంగా 4.47 కోట్ల మందికి రాష్ట్రంలో అభా కార్డులు జారీ అయ్యాయని, టీబీ ఎలిమినేషన్ కింద 82,693 మంది గిరిజనులకు ప్రత్యేకంగా స్ర్కీనింగ్ చేయగా 5,072 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. 10,11,461 మంది గిరిజనులకు స్ర్కీనింగ్ చేయగా 1977 మందికి సికిల్ సెల్ ఎనీమియా పాజిటివ్‌గా తేలిందన్నారు. రాష్ట్రంలో 95.60 శాతం జనన, మరణాల నమోదు జరిగిందని, 13,26,621 శిశు ఆధార్‌లు జారీ అయ్యాయని వివరించారు.
సీఎంను కలిసిన బాల పురస్కార్ గ్రహీత
జెస్సీరాజ్‌ను అభినందించిన చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత జెస్సీరాజ్ సీఎం చంద్రబాబును శుక్రవారం సచివాలయంలో కలిశారు. ఇటీవల తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్‌షి్‌పలో తాను సాధించిన విజయాలను సీఎంకు వివరించారు. ఈ పోటీల్లో జెస్సీరాజ్ రెండు బంగారు, ఒక వెండి, ఒక కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. జెస్సీరాజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన సీఎం ఆమెను అభినందించారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News