CM Chandrababu Naidu: కలిసి పనిచేయలేరా?

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:35 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ పాలకమండలి, అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఆలయ పవిత్రత, పారిశుధ్యం, భవిష్యత్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భక్తుల సేవలో పారదర్శకత, సమర్థమైన పాలన అవసరమని చెప్పారు.

CM Chandrababu Naidu: కలిసి పనిచేయలేరా?

నేను చెప్పినవీ అమలు చేయకపోతే ఎలా?

ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకోలేరా?

టీటీడీలో వంద శాతం ప్రక్షాళన జరగాలి

భక్తుల మనోభావాలు, పవిత్రతకు పెద్దపీట

పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు

దేవాలయానికి మనం ధర్మకర్తలం మాత్రమే

రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు

అధికారులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు: సీఎం

3 గంటలపాటు ముఖ్యమంత్రి బాబు సమీక్ష

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీలో మంచి పనులు జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సక్రమంగా జరగకపోతే ఆ ప్రభావం కూడా ప్రభుత్వంపై ఉంటుంది. మీరంతా అవగాహనతో ఎందుకు పని చేయరు? అందరూ కూర్చుని చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడం చేత కాదా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ పాలకమండలి, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో 3గంటలపాటు ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలలో పారిశుధ్య పనులు, తిరుమల పర్వత శ్రేణులపై పచ్చదనం పెంపు, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పన వంటి విషయాల్లో తాను చెప్పినవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, పాలకమండలి సమన్వయంతో పరస్పర అవగాహనతో పని చేయడం లేదని స్వయంగా ప్రస్తావించారు. దేవదాయ మంత్రిని టీటీడీ వ్యవహారాలకు దూరంగా ఉంచడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపై టీటీడీ ఏ కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా చైర్మన్‌, ఈవోతో పాటు దేవదాయ శాఖ మంత్రిని పరిగణనలోకి తీసుకోవాలని, ఈ ముగ్గురు చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలని సృష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారని ఈ సమావేశంలో సీఎం ప్రశ్నించారు. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కలిపి దాదాపు 20 వేలమంది ఉద్యోగులు ఉన్నారని అధికారులు వివరించారు. ఇందులో నాలుగు వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారని, వీరందరిని గత ప్రభుత్వం నియమించిందని తెలిపారు. అవసరాన్ని బట్టి సిబ్బంది ఉండాలని, ఎవరి కోసమో ఉండకూదని సీఎం అన్నారు. లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడాలని, వెనకటి అస్తవ్యస్త విధానాలు కొనసాగడానికి వీల్లేదన్నారు. ప్రక్షాళన వంద శాతం జరగాల్సిందేనని, మినహాయింపులు లేవని తేల్చిచెప్పారు.


పవిత్రతకు పెద్ద పీట...

‘తిరుమలలో భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలి. తిరుమల ఆలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుతంలో, ఇప్పటికి మార్పు కనిపించింది. ఆ మార్పు 100 శాతం ఉండాలి. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో వాటిని మాత్రమే చేయాలి. మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్త మాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండల వాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనిపై ఇంటర్నల్‌ ఆడిటింగ్‌తో పాటు కాగ్‌ ద్వారా ఆడిట్‌ జరిపితే మంచిది’ అని చంద్రబాబు అన్నారు. భక్తుల కోసం అలిపిరిలో బేస్‌ క్యాంప్‌ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 25 వేలమందికి సౌకర్యంగా ఉండేలా నిర్మిస్తున్నట్టు వివరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25 వేలమంది వరకూ భక్తులు వస్తారని అధికారులు తెలుపగా.. మరింత అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. బర్డ్‌ ఆస్పత్రి డైరెక్టర్‌, టీటీడీ జేఈవో, సీవీఎ్‌సవో, ఎస్వీబీసీ చైర్మన్‌ నియామకాలను త్వరలో చేపడతామని చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సా్‌పలో అందిస్తామని అధికారులు చెప్పగా.. వెంటనే ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్‌ను లింక్‌ చేయడం వల్ల అక్రమాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. మరోవైపు పారిశుధ్య నిర్వహణపైనా దృష్టిపెట్టాలని సూచించారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టార్లలో విస్తరించి ఉండగా, ప్రస్తుతం 68.14 శాతం పచ్చదనం ఉందని, 80 శాతానికి తీసుకువెళ్లాలని సృష్టం చేశారు.

ఆలయాల అభివృద్ధి

రాజధానిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణంతో పాటు ఒక రాజగోపురం, మూడు గోపురాలు నిర్మించాలని,త్వరలోనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని విస్తరణ పనులతో పాటు సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కరీంనగర్‌, కొడంగల్‌, నవీ ముంబై, బాంద్రా, ఉలందుర్పేట, కోయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణం-అభివృద్ధి కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు. సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్‌ విజిలెన్స్‌ అధికారులు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


సేవలపై సంతృప్తి

రథసప్తమి, వైకుంఠ ఏకాదశి సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై సర్వేల్లో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు సీఎంకు వివరించారు. మార్చి 9 నుంచి 14 వరకు సాధారణ రోజుల్లో తిరుమల వచ్చిన భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ విధానంలో చేసిన సర్వేలోనూ అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైంది.

జీ స్క్వేర్‌ వివాదంపై చర్చ

చెన్నై కేంద్రంగా పని చేస్తున్న జీ స్క్వేర్‌ అనే రియల్‌ సంస్థ వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. ఆ సంస్థ చెన్నైలో తన వెంచర్లు ఉన్న చోట టీటీడీ ఆలయాన్ని సొంత ఖర్చులతో నిర్మించడానికి ముందుకొచ్చింది. ఎవరో వ్యాపారాల కోసం ఆలయాలను కట్టిస్తామంటే మనమెందుకు అంగీకరించాలంటూ టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దేవస్థానం డబ్బులు ఖర్చు పెట్టకుండా కోట్ల ఖర్చుతో ఆలయాలు నిర్మిస్తుంటే అభ్యంతరం ఎందుకని సీఎం ప్రశ్నించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత డబ్బులతో స్వామి ఆలయాన్ని నిర్మిస్తామంటే ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆగమ శాస్త్రబద్ధంగా ఆలయాలను నిర్మించాలని, టీటీడీ తరఫున ఆగమ శాస్త్ర సలహాలు, సూచనలను అందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:35 AM