యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:48 PM
యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ అన్నారు.

కర్నూలు స్పోర్ట్స్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ అన్నారు. ఆదివారం యోగా స్పోర్ట్స్ అసోసియేషన ఆధ్వర్యంలో పెద్దపాడులోని వేదాన్షి పాఠశాలలో ఒకటో రాష్ట్ర స్థాయి యోగా ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగా సాధన కోసం ప్రత్యేక తరగతులను త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ప్రపంచ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచానికి ఆరోగ్య సంపదను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం రాష్ట్ర యోగా సంఘం చైర్మన లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత 13 సంవత్సరాల నుంచి యోగా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణిస్తున్నారని తెలిపారు. ఈ నెల 13 నుంచి 16 వరకు కేరళలో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ శెట్టి, పాఠశాల కరస్పాండెంట్ పరమేష్, అనంతపురం జిల్లా యోగా సంఘం నాయకులు మనోహర్ రెడ్డి, జాతీయ యోగా సంఘం టెక్నికల్ అఫీషియల్స్ డా.ముంతాజ్ బేగం, విజయ్ కుమార్, ఈశ్వర్ నాయుడు, ఫయాజ్, పద్మలత, విద్యాసాగర్, 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు
Updated Date - Feb 09 , 2025 | 11:48 PM