Share News

Tirumala: సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

ABN , Publish Date - Mar 04 , 2025 | 07:01 AM

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను కోర్టు మూడు రోజుల సిట్‌ కస్టడీకి అప్పగించింది.

Tirumala: సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

  • ఏ3, ఏ5లను అప్పగించిన కోర్టు

  • ఏ5 బెయిల్‌ పిటిషన్‌ విచారణ 6కు వాయిదా

  • ఏ3, ఏ4ల తరఫున మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

తిరుపతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను కోర్టు మూడు రోజుల సిట్‌ కస్టడీకి అప్పగించింది. తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం ఈ మేరకు అనుమతిచ్చింది. గత నెల 9న నలుగురు నిందితులు అరెస్టు కాగా, నలుగురినీ 14 నుంచి 18వ తేదీ వరకు(ఐదు రోజులు) సిట్‌ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 18న ఆ నలుగురినీ జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించిన సిట్‌ అధికారులు ఆ మరుసటి రోజే ఏ3, ఏ5 లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. వారిని ఇదివరకే సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకుని ఐదు రోజులు విచారించిన కారణంగా మళ్లీ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని వారి తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో వాదించారు. అయితే, కల్తీ నెయ్యి కేసులో వీరిద్దరూ కీలక నిందితులని, గతంలో సిట్‌ అధికారులు ఐదురోజులు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ నిందితులు విచారణకు సహకరించలేదని ఏపీపీ జయశేఖర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. టీటీడీ వంటి ప్రతిష్టాత్మక ధార్మిక సంస్థను మోసగించడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినడానికి నిందితులు కారకులయ్యారన్నారు. వారిని మరింత లోతుగా విచారించడం ద్వారానే వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి కోటేశ్వరరావు ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు అనుమతి జారీ చేశారు. కాగా, ఈ కేసులో ఏ5 నిందితుడు అపూర్వ వినయ్‌ కాంత్‌ చావడా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 6వ తేదీకి వాయిదా పడింది. అలాగే, ఏ3, ఏ4 నిందితులకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వారి తరఫు న్యాయవాదులు సోమవారం మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Mar 04 , 2025 | 07:01 AM