Road accident compensation: ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం..1.30 కోట్ల పరిహారం
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:42 AM
నెల్లూరు జిల్లాలో 2016లో రహదారి నిర్మాణంలో అలక్ష్యంతో జరిగిన ప్రమాదంలో ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించగా, జిల్లా కోర్టు రూ.1.30 కోట్లు పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. హైకోర్టు కూడా తీర్పును సమర్థిస్తూ, ముందుగా సగం మొత్తం చెల్లించాలని ఆదేశించింది.

బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉపాధ్యాయుడు
గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టని వైనం
కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన
నెల్లూరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రహదారుల నిర్మాణ సమయంలో సంబంధిత కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే.. అలాంటి నిబంధనలు పాటించని కారణంగా 2016లో నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణానికి కారణం ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్లేనని పేర్కొంటూ మృతుని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించి రూ.1.30 కోట్లను పరిహారంగా పొందారు. హైకోర్టు కూడా బాధిత కుటుంబానికే అండగా నిలిచింది. ముందుగా పరిహారంలో సగం సొమ్మును చెల్లించాలని అధికారులను ఆదేశించింది. విడవలూరు మండలం రామతీర్థం పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దాసరి కామరాజ్ 2016 మే 27న ఓ పనిమీద నెల్లూరు వెళ్లి రాత్రి 11 గంటలకు బైక్‌పై తిరిగి స్వగ్రామమైన వావిళ్లకు వస్తున్నారు. అప్పట్లో గుండాలమ్మపాలెం వద్ద ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనికోసం తీసిన గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈ గుంతలను గమనించలేకపోయిన కామరాజ్ బైక్‌పై వెళ్తూ గుంతలో పడి ప్రమాదానికి గురై మరణించారు. దీనిపై కొడవలూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కామరాజ్‌కు భార్య, తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. దీంతో వారు 2019లో జిల్లా కోర్టును ఆశ్రయించి, పరిహారం ఇప్పించాలని కోరారు.
కామరాజ్‌కు ఇంకా 12 ఏళ్ల సర్వీసు ఉందని, ఆయన జీతం, బెనిఫిట్స్ మొత్తం లెక్కించి రూ.90 లక్షలు పరిహారంగా ఇప్పించాలని అభ్యర్థించారు. ఈ కేసుపై మూడో జిల్లా అదనపు కోర్టులో ఐదేళ్లపాటు విచారణ జరిగింది. చివరకు కోర్టు.. రూ.81.25 లక్షలను బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించింది. అలాగే సూట్ వేసినప్పటి నుంచి తీర్పు వచ్చే వరకు వడ్డీతో కలిపి చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తం రూ.1.30 కోట్లుగా తేలింది. జిల్లా కోర్టు తీర్పును ఆర్‌అండ్‌బీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు గత నెలలో విచారణకు వచ్చింది. హైకోర్టు స్పందిస్తూ.. కేసు విచారణ కంటే ముందు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సగం పరిహారాన్ని బాధిత కుటుంబానికి జమ చేయాలని, ఆ మొత్తంలో సగాన్ని వారు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించింది. దీంతో రూ.65 లక్షలను బాధితుల ఖాతాలో జమ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పరిహారం చెల్లించాలంటూ కాంట్రాక్టర్ పైడాల తిరుపతిరెడ్డికి కావలి ఆర్‌అండ్‌బీ ఈఈ రామకృష్ణప్రసాద్ గత నెల 4న నోటీసు ఇచ్చారు. అయితే, ఈ విషయంలో తన తప్పులేదని సదరు కాంట్రాక్టర్ తిరిగి ఈఈకి వివరణ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే బాధిత కుటుంబానికి పరిహారం దక్కనుంది. సగం మొత్తం డిపాజిట్ చేయాలన్న కోర్టు ఆదేశాలతో కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చామని కావలి ఆర్‌అండ్‌బీ ఈఈ రామకృష్ణప్రసాద్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..