NRX drugs: డాక్టర్ చీటీ లేకుండా.. మత్తు మాత్రలు అమ్మొద్దు
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:32 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఆర్‌ఎక్స్ మత్తు మందుల విక్రయాలను కట్టడి చేసేందుకు ‘ఈగల్’ ఐజీ ఆకే రవికృష్ణ చర్యలు చేపట్టారు. మెడికల్ షాపులు డాక్టర్ చీటీ లేకుండా విక్రయించొద్దని హెచ్చరించారు. అయితే, విక్రయదారులు దీని వల్ల అవసరమైన రోగులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

డ్రగ్ డీలర్లకు ‘ఈగల్’ ఐజీ రవికృష్ణ నిర్దేశం
తాము ఆపితే.. యువత ఆన్‌లైన్‌లో తెప్పించుకొంటున్నారన్న డీలర్లు
ఆ మందులు అవసరమైన రోగులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్(మత్తు మాత్రలు) విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, డాక్టర్ చీటీ లేకుండా అటువంటి మందులు ఇవ్వొద్దని డ్రగ్ డీలర్లకు ‘ఈగల్’ ఐజీ ఆకే రవికృష్ణ సూచించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, మందుల విక్రయ డీలర్లు, విజిలెన్స్ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో మత్తు మహమ్మారిని తరిమేసే యజ్ఞంలో భాగంగా పోలీసులతో కలిసి గంజాయిని బాగా కట్టడి చేశామని చెప్పారు. మత్తుకు అలవాటు పడ్డ యువత మెడికల్ షాపుల్లో ఎన్‌ఆర్‌ఎక్స్ మందులు కొని విచ్చలవిడిగా వినియోగిస్తుండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. అందుకని ఆ రకమైన మందులు డాక్టర్ సిఫారసు చీటీ లేకుండా ఎవ్వరూ విక్రయించవద్దని ఆదేశించారు. ఇటీవల ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఈగల్, డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ విభాగాలు ఉమ్మడిగా నిర్వహించిన సోదాల్లో 158 మెడికల్ షాపుల్లో పలు అక్రమాలు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా నిషేధిత మందులు విక్రయిస్తే ప్రజల్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే, ఈగల్ ఐజీ చర్యల వల్ల రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఎక్స్ మందులు తప్పనిసరిగా వాడాల్సిన రోగులు ఇబ్బంది పడుతున్నారని వాటి విక్రయదారులు చెబుతున్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రేతల్ని అరెస్టు చేసి మత్తును అదుపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ‘ఈగల్’ విభాగాన్ని ఏర్పాటు చేస్తే, మెడికల్ స్టోర్లపై పడటం విచిత్రంగా ఉందంటున్నారు. ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ విక్రయాలను తాము పూర్తిగా ఆపేశామని, అయితే, యువత ఆన్‌లైన్‌లో వాటిని బెంగళూరు, హైదరాబాద్ నుంచి తెప్పించుకొంటున్నారని చెబుతున్నారు. మందుల షాపుల తనిఖీలకు డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు, తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేసేందుకు ఏడీలు, ఉత్పత్తుల్లో నాణ్యత లేకుంటే చర్య తీసుకోవడానికి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఈగల్ విభాగం చర్యలు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..
Updated Date - Apr 03 , 2025 | 05:32 AM