Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..
ABN, Publish Date - Mar 14 , 2025 | 07:46 PM
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నేతని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చావుని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ బాలినేని మండిపడ్డారు.

కాకినాడ: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్వశక్తితో ఎదిగిన నేతని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చావుని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ బాలినేని మండిపడ్డారు. పిఠాపురం చిత్రాడలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై బాలినేని నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. "పిఠాపురం సభ సాక్షిగా, ఇక్కడి అమ్మవారి సాక్షిగా అంతా నిజమే చెపుతా. రాజకీయాల్లోకి వచ్చి తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగోట్టుకున్నా. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులూ కాజేశారు. నాకు జరిగిన అన్యాయం మరెవ్వరికి జరగకూడదు. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడతా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు రాజకీయ భిక్ష పెట్టారు. అందుకే నాలుగేళ్ల మంత్రి పదవిని వదులుకుని జగన్ వెంట నడిచా. జగన్‌కు అధికారం వచ్చాక నాకు మంత్రి పదవి ఇచ్చి మళ్లీ తీసేశారు. దానికి నేను బాధపడను. పవన్ కల్యాణ్ గురించి కౌన్సిలర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువని జగన్ అన్నారు. కానీ, ఫ్యాన్ పార్టీ అధినేత మాత్రం తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దయతో సీఎం అయ్యారు.
పవన్ స్వశక్తితో పైకి వచ్చిన నాయకుడు. పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే జగన్ వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను తిడితే ఎవ్వరూ ఊరుకోరు. కూటమి ప్రభుత్వం కనుక ఆరు నెలలు ఊరుకుంది. నేనయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే లాఠీతో విరగ్గొట్టి లోపల వేసే వాడిని. చిన్నచిన్న కార్యకర్తలపై కేసులు పెట్టి లోపల వేయడం కాదు. వైసీపీ హయాంలో కోట్లకు కోట్లు తినేసిన నాయకులు ఉన్నారు. వారిపై కేసులు పెట్టాలి. 2019-24 మధ్య అధికార ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు నా మీదైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. బాలినేని చాణక్యుడని.. కూటమి మధ్య చిచ్చుపెట్టేందుకే చేరాడని ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్‌కు తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చెయ్యను.
అవకాశం ఇస్తే జిల్లాలోని జిల్లా పరిషత్ ఛైర్మన్‌తో సహా అందరినీ జనసేనలోకి తీసుకువస్తా. జనసేన కార్యకర్తలను చాలా మందిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరూ కుర్చొని ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేయాలి. జనసేన కార్యకర్తలకు రేషియో ప్రకారం పదవుల ఇవ్వకపోతే ఎన్నికల సమయానికి వారు ప్రశ్నిస్తారు. వారి బాధ ఎలాంటిదో అప్పుడు తెలుస్తుంది. పవన్ కల్యాణ్‍తో సినిమా తీయాలనేది నా చిరకాల కోరిక. దాన్ని నెరవేర్చుకుంటా. వైఎస్ఆర్ పార్టీని వీడుతానని ఎవ్వరూ ఊహించలేదు. బాలినేని మంచివారని ప్రతిపక్షంలో ఉండగా పవన్ అన్నారు. అప్పుడే జనసేనలో చేరకపోవడం నా దౌర్భాగ్యమని" అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..
Chandrababu lokesh Wishes: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌కు సీఎం, లోకేష్ శుభాకాంక్షలు
Updated Date - Mar 14 , 2025 | 08:21 PM