ప్రజలకు 37 కేంద్ర పథకాలు ఇస్తున్నాం
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:03 AM
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 9( ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి కో ఆర్డినేషన్,మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో లోపాలు గుర్తించి సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా అధికారుల సూచనలు పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి నివేదిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో 37 పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రతి మూడు నెలలకోసారి దిశ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో జలజీవన్ మిష న్, అమృత్ వంటి పఽథకాలు నిర్జీవం కావడం చూశామన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రానున్న రోజు ల్లో ప్రజలకు మేలు చేయాలన్నారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మాత్రమే నిధులు వినియోగించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధి నిధులు సమర్థవంతంగా ఖర్చుచేశామన్నారు. 60 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. సమీక్షలో జడ్పీ సీఈవో వీవీఎస్.లక్ష్మణరావు,ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్ధ కమిషనర్ కేతన్ గార్గ్ , జిల్లా అధికారులు వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు ,ప్రజాప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 01:03 AM