కోడీ..రె..ఢీ!
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:56 AM
పోలీస్ వర్సెస్ కోడి..ఈ పోటీలో గెలుపెవరిదో మరి కొన్ని క్షణాల్లో తేలిపోనుంది.. నిర్వాహకులు తగ్గేదేలే అంటే.. పోలీసులూ అదే దారిలో ఉన్నారు.. అక్కడక్కడా బేరాలు సాగిపోతున్నాయి. అటు పోలీసులు బరి తెగిస్తే.. ఇటు నిర్వాహకులు అదే దారిలో ఉన్నారు.
బరి తెగించిన నిర్వాహకులు
కూటమి నాయకుల గ్రీన్‌సిగ్నల్
పోలీసులు వద్దంటున్నా ఏర్పాట్లు
కొన్ని చోట్ల బేరసారాలు
బరులకు వేలం నిర్వహణ
ఒక బరి రేటు రూ.అర కోటి
క్రికెట్ స్టేడియాల్లా తయారు
అతిథులకు విందు భోజనాలు
(రాజమహేంద్రవరం/అమలాపురం/ దేవరపల్లి/ గోపాలపురం/ పెరవలి/ కొవ్వూరు/ ఐ.పోలవరం- ఆంధ్రజ్యోతి) : పోలీస్ వర్సెస్ కోడి..ఈ పోటీలో గెలుపెవరిదో మరి కొన్ని క్షణాల్లో తేలిపోనుంది.. నిర్వాహకులు తగ్గేదేలే అంటే.. పోలీసులూ అదే దారిలో ఉన్నారు.. అక్కడక్కడా బేరాలు సాగిపోతున్నాయి. అటు పోలీసులు బరి తెగిస్తే.. ఇటు నిర్వాహకులు అదే దారిలో ఉన్నారు. కోడి పందాలు, గుండాట వంటి జూదాలకు ఎగబడుతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే పండుగ మూడు రోజులు అనుమతిస్తారన్న ధైర్యంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు కోడిపందెం పెద్ద ఆకర్షణగా మారింది. 21 నియోజకవర్గాల్లోనూ బరులు సిద్ధం చేశారు. గతంలో వైసీపీ నేతలు బరితెగిస్తే.. ఈసారి అదే ఒరవడిని కూటమి నేతలు కొనసాగించడం గమనార్హం. సంక్రాంతి కోడి పందాలకు రంగం సిద్ధమైంది. కోడి పందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దనిపోలీస్,రెవెన్యూ యంత్రాంగం హెచ్చరిస్తున్నా నిర్వాహకులు మాత్రం తగ్గేదేలే అంటూ ఎప్పటి మాదిరిగానే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పందాలకు సర్వం సిద్ధం చేశారు. చాలాచోట్ల కోడి పందాల శిబి రాలు క్రికెట్ స్టేడియాలను తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద బరులకు రూ.50 లక్షల వరకూ వేలంపాట వేస్తున్నారు. చిన్న గ్రామాల్లో కూడా రూ.16 లక్షల వరకూ ఉన్నా యి. జూదం విపరీతంగా పెరిగింది. ఒక్కో బరి లోనూ గుండాట నిర్వహణకు రూ.7 లక్షల నుం చి రూ.10 లక్షల వరకూ ఇస్తున్నట్టు సమా చారం.గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీ ద్వితీయ స్థాయినేతలు,గ్రామనేతలు వీటిని ఎక్కువ నిర్వ హిస్తున్నారు. జూద క్రీడల నిర్వహణకు ఆయా ప్రాంతాల్లో ఉన్న కూటమి నేతలు ముందుకు రావడం, ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సులు చేయించుకుని అనుమతులు పొందడం ద్వారా లక్షల లాభార్జన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు రోజుల పందాలు వారికి మంచి ఆదాయ వనరుగా మారాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా జూదం పెరిగిపోయింది. గతంలో అమ్మవారి తీర్ధాల వంటి వాటికి చాటుమాటుగా గుండాట ఆడేవారు. ఇవాళ సంక్రాంతి అంటే అన్ని ఊర్లకు గుండాటలు వచ్చేశాయి. ఇవి మన సంప్రదా యమా? ఇది పచ్చి జూదం. అక్కడకు వచ్చిన ప్రజల జేబులను నిలువునా దోపిడీ చేస్తారు. ఇక్కడే మద్యం..పేకాట ఉంటాయి.నీతులు వల్లించే పోలీసులు మామూళ్లకు కక్కుర్తిపడి చట్టాన్ని ప్రక్కన పడేస్తున్నారు.ఉభయ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు భారీగా చేరుకుంటున్నారు.సోమవారం నుంచి ప్రారంభమయ్యే సంక్రాంతి ఉత్సవాలను తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్న వారికి జూదక్రీడలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
క్రికెట్ స్టేడియాలా..బరులా!
మురమళ్ల వద్ద పందెం బరిని మినీ స్టేడియాన్ని తలపించే రీతిలో తీర్చిదిద్దారు.ప్రత్యేక అతిథులు కొందరు సినీ నటులు బరికి హాజరయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా పక్కనే ఉన్న పాండిచ్చేరి రాష్ట్ర పరిధిలోని యానాంలో హోటళ్ల రూమ్‌లతో పాటు గెస్ట్‌హౌస్‌లను సిద్ధం చేసినట్టు తెలిసింది. తూర్పుగోదా వరి జిల్లా పెరవలి మండలంలో నాలుగైదు చోట్ల కోడి పందాలు వేసేందుకు బరులు సిద్ధం చేశారు.ఐ.పోలవరంలో సుమారు 200 మంది వీఐపీలు కూర్చుని పందాలను తిలకించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన పందెం బరి చుట్టూ ఇనుప కంచెతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వీఐపీలకు పసందైన విందు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ముమ్మిడివరంలో మాత్రం పోలీసులు ఓ బరి వద్దకు వెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి తొలగించారు. తూర్పుగోదావరి జిల్లా రం గంపేట శివారులో ఒక బరి, గోపాలపురంలో ఒక బరిని పోలీసులు ధ్వంసం చేశారు.
పోలీసులూ బరి తెగించారు!
పట్టణాలు, పల్లెలు సహా అనేక ప్రాంతాల్లో పందెం బరులను బహిరంగంగా వేస్తున్నారు. వీటి నిరోధానికి పోలీసు,రెవెన్యూ అధికారులు హెచ్చరికలు తప్ప బరిలో మాత్రం దిగడంలేదు. పోలీసు యంత్రాంగానికి ఆయా ప్రాంతాల్లో జరిగే పందాల నిర్వాహకులు భారీగానే మామూళ్లు ముట్టచెబుతున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి మామూళ్ల రేట్లను పెంచేశారంటూ కొన్నిచోట్ల గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల సంయుక్త సహకారంతో పందెం బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 నియోజకవర్గాల పరిధిలో పందెం బరులు సిద్ధమయ్యాయి. జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల చెంతనే వీటిని ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పిన బరులకే పోలీసులు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు.ముందుగానే అన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాతే వీటికి అనుమతులిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసు యంత్రాంగం ఈసారి అసలు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు కనీసం ఉనికి చాటకపోవడం వెనుక భారీగా ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని ప్రచారం జరుగుతోంది.
లక్షల్లో గుండాట వేలం..
కోనసీమ జిల్లాలోని మురమళ్ల, చెయ్యేరు, ఎస్.యానాంతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగే పందెం బరుల వద్ద గుండాట బోర్డులు ఏర్పాటు చేసేందుకు బహిరంగ వేలం ద్వారా పాటలు జరిగినట్టు తెలిసింది. మురమళ్ల బరి వద్ద గుండాట కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. చెయ్యేరులో గుండాట కోసం నిర్వాహకులు బరిని రూ.18 లక్షలకు దక్కించుకున్నట్టు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వేలం జరిగినట్టు సమాచారం.
బరిలో బాక్సింగ్‌కు రెడీ..
డబ్ల్యుడబ్ల్యుఎఫ్ చూస్తుంటే..... బాక్సింగ్ రింగ్‌లో దిగేటప్పుడు బాక్సర్లు ఒత్తిడిని అధిగమించడానికి ఎక్సర్‌సైజులు చేస్తుంటారు.. ఇక్కడ కోడిని చూడండి.. ఏం చేస్తోందో గమనించండి. సంక్రాంతి పండుగ వచ్చేయడంతో నేడో, రేపో ప్రతి కోడీ బరిలో దిగాల్సిందే.. ఈ మేరకు నిర్వాహకులు కోళ్లతో ఇలా ఎక్సర్‌సైజులు చేయిస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురంలో ఇలా....
Updated Date - Jan 13 , 2025 | 12:56 AM