తొక్కినారతీస్తా
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:34 AM
ఈవ్‌టీజింగ్ అంటే నాకు చిరాకు. పద్ధతి మార్చుకోకుంటే తొక్కి నారతీస్తా. నేను గనుక రోడ్డు మీదకు వస్తే ఎవరికీ నిద్రాహారాలు ఉండవు. గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయి. రాత్రివేళల్లో బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. చోరీలు అధికమయ్యాయి. పిఠాపురంలో పోలీసులు ఉదాశీనంగా ఉంటున్నారనే ఫిర్యాదులు అధికమయ్యాయి అంటూ పోలీసుశాఖ పని తీరుపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈవ్‌టీజింగ్ చేసే కుర్రకారుకు వార్నింగ్..
ఈవ్‌టీజింగ్ చేసే కుర్రకారుకు వార్నింగ్..
పోలీసుల తీరుపైనా పవన్ ఆగ్రహం
ఆడపిల్లలను ఏడిపిస్తే సహించను
గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగాయి
పోలీసుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి
ఇక నుంచి నెలకు 14 రోజులు ఇక్కడే
పిఠాపురం నుంచే రాష్ట్రవ్యాప్త యాత్ర
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
పిఠాపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఈవ్‌టీజింగ్ అంటే నాకు చిరాకు. పద్ధతి మార్చుకోకుంటే తొక్కి నారతీస్తా. నేను గనుక రోడ్డు మీదకు వస్తే ఎవరికీ నిద్రాహారాలు ఉండవు. గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయి. రాత్రివేళల్లో బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. చోరీలు అధికమయ్యాయి. పిఠాపురంలో పోలీసులు ఉదాశీనంగా ఉంటున్నారనే ఫిర్యాదులు అధికమయ్యాయి అంటూ పోలీసుశాఖ పని తీరుపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాతబస్టాండు వద్ద గల మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పిఠాపురానికి జాతీయస్థాయిలో పేరు తీసుకురావాలని ఉందని తెలిపారు. అదే సమయంలో పిఠాపురం నుంచి పలు ఫిర్యాదులు వచ్చా యని చెబుతూ ఫోన్ చూస్తూ పోలీసులపై వచ్చిన కొన్ని ఫిర్యాదులను చదివి వినిపించారు. కొద్దిరోజుల కిందట పిఠాపురంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లోకి రాత్రి పూట ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడ విద్యార్థులను బెదిరించి వారి వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులు లాక్కుని పరారయ్యారని తెలిపారు. మెయిన్‌రోడ్డులో కత్తి చూపించి బెదిరించి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారని.. ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని తెలిపారు. ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కేశవరావు పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినా తగ్గకపోగా ఈవ్‌టీజింగ్ పెరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఆడపిల్లలను ఏడిపిస్తే మగతనం కాదనే విషయాన్ని యువకులు తెలుసుకోవాలని, మగతనం కావాలంటే సైన్యం లో చేరాలని హితవు పలికారు.తన నియోజకవర్గంలో ఈవ్ టీజింగ్ అనే మాట ఇక వినపడకూడదని, ఆడపిల్లలను ఏడి పిస్తే తొక్కి నారతీస్తానని హెచ్చరించారు. పోలీసుస్టేషన్లలో లాయర్లు సెటిల్‌మెంట్లు చేయకూడదని పోలీసులకు హితవు పలికారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఏ అధికారిని నేను రికమెండ్ చేయలేదు. సుపరిపాలన ఇవ్వండి అని కోరానని తెలిపారు. అది జరగకపోతే నాలాంటి వారు వచ్చి రోడ్డు మీద తిరిగితే ఎవ్వరికి నిద్రాహారాలు ఉండవని హెచ్చరించారు. ఆయన వెంట కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్, కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, జనసేన, బీజేపీ ఇన్‌చార్జిలు మర్రెడ్డి శ్రీనివాసరావు, బుర్రా కృష్ణంరాజు,కుడా చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయకుమార్ వార్డు కౌన్సిలర్ నల్లా రమణమ్మ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తదితరులు ఉన్నారు.
పిఠాపురం నుంచి యాత్ర ప్రారంభిస్తా..
స్టార్‌డమ్ వదులుకుని ఒకటిన్నర దశాబ్దంగా నలిగిపోయా.. ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి.. ఆ గాయాలకు పిఠాపురం ప్రజలు మందు పోశారని పవన్ తెలిపారు. మీరు చుక్కనీరు దొరక్క దాహంతో అలమటిస్తు న్న వ్యక్తికి నీరందిస్తే ఎలా ఉంటుందో గెలుపు ద్వారా రుచి చూపించారు. 26 జిల్లాలు తిరగాలని అనుకున్నా. అయితే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత రాష్ట్రం సంగతి చూద్దామని భావించి పిఠాపురం నుంచే తన యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తాను కొన్న స్థలంలోనే షెడ్లు వేసుకుని నెలలో 14 రోజులు ఇక్కడే ఉండి 54 గ్రామాలు వెళ్లి అందరినీ కలుస్తానన్నారు. ముందుగా ఉప్పాడ మత్స్యకార గ్రామాల నుంచి మొదలుపెడతానని పవన్ చెప్పారు.
50 నిమిషాలు స్టాల్స్ దగ్గరే..
పిఠాపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పవన్ రాకతో పిఠాపురంలో ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. పిఠాపురం పాతబస్టాండు మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో పల్లెపండుగ- పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. హరిదాసు కీర్తనలు.. పిట్టదొరల కోతలు, మాటలు వింటూ, జంగమదేవర జోస్యాన్ని ఆసక్తిగా ఆలకించారు. మహిళతో సోది చెప్పించుకున్నారు. రథాలపేట అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులతో సరదాగా ముచ్చటించి భోగిపండ్లు వేశారు. గర్భిణులు కె.వరలక్ష్మి, ఏ.రమ్యలకు సీమంతం నిర్వహించి ఆశీస్సులు అందించారు. చేనేత జౌళిశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో నేత, పట్టు చీరలు, జాంధాని చీరలను తిలకించి ప్రత్యేకంగా ఆరా తీశారు. గ్రంథాలయ సంస్థ పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. సుమారు 50 నిమిషాలకుపైగా స్టాల్స్ వద్ద గడిపారు. కుమారపురంలో ఉపాధిహామీ పథకం కింద రూ.1.85 లక్షలతో నిర్మించిన మినీగోకులాన్ని ప్రారంభించారు.నాలుగు గోవులను రైతు యాతం నాగేశ్వరరావుకు అందజేశారు. ఇక్కడ నుంచే రాష్ట్రంలో 12,500 గోకులాలకు ప్రారంభోత్సవం చేశారు.
వైసీపీ వల్లే అధ్వానంగా ఏడీబీ రోడ్డు
ఫ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
ఫ ఏడీబీ రహదారి విస్తరణ పనుల పరిశీలన
రంగంపేట, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏడీబీ రోడ్డు పనులను పటించుకోనందువల్లే అధ్వా నంగా తయారైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. శుక్రవారం పిఠాపురం పర్యటకు వచ్చిన ఆయన మధురుపూడి విమానాశ్రయం నుంచి రాజానగరం, రంగంపేట మీదుగా ఏడీబీ రోడ్‌లో పిఠాపురం బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వద్ద గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెం ట్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వడిశలేరు గ్రామంలోని కార్గిల్‌ఫ్యాక్టరీ వద్ద ఏడీబీ రోడ్‌లో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన తోకాడ చరణ్, ఆరవ మణికంఠ ప్రమాదానికి గురై మరణించిన సంఘటనా స్థలాన్ని పవన్ పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్‌మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం ఏడీబీ రహదారి విస్తరణ పనులను పరిశీలించి, సమగ్ర వివరాలను తెలుసుకున్నారు.
రాజానగరం నుంచి సామర్లకోట ఏడీబీ రోడ్డు నాలుగులైన్లు విస్తరణ రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పనుల పురోగతి,తదితర అంశాలపై వివరించారు. నాలుగులైన్లు రహదారిగా అభివృద్ధికి చెందిన 30 కిలో మీటర్లలో 16.29 కిలో మీటర్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉందని, ఇందునిమిత్తం 189 కోట్ల, 87 లక్షల రూపాయిల ప్రాజెక్టు అంచనాతో పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. 2017 అక్టో బరులో పనుల చేపట్టగా 2021 ఫిబ్రవరిలో పూ ర్తి చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని, ఆ మేరకు పనులను పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లా పరిధిలో ఉన్న రూట్‌మ్యాప్ ప్రకటనలో గ్రామా ల వారీగా పనుల పురోగతిని కలెక్టర్ వివరించా రు. పరిహారం చెల్లింపులకు చెందిన బిల్లులు అ ప్లోడ్ చేసినట్టు తెలిపారు. ఎస్టీరాజాపురం వద్ద కల్వర్టు నిర్మాణ పనులను పవన్ పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, డిఎస్పీ భవ్యకిషోర్, ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అయితే ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు వెళ్లినా సరే ఏడీబీ రోడ్డు మీదుగానే వెళతానని పవన్ చెప్పిన విషయం అంద రికీ తెలిసినదే. మాట ప్రకారమే శుక్రవారం ఏడీ బీ రోడ్డు మీదుగానే ఆయన పిఠాపురం వెళ్లారు.
Updated Date - Jan 11 , 2025 | 12:34 AM