పండుగకు విజిట్రబుల్స్!
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:40 AM
మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. రైతు బజార్లలోనే కిలో టమాటా రూ.16 నుంచి రూ.18 లకు విక్రయిస్తున్నారంటే బహిరంగ మార్కెట్లలో పరిస్థితిని ఊహించవచ్చు.
కొనుగోలుదారులు బెధరహో
బహిరంగ మార్కెట్లలో దోపిడీ
కిలోకి రూ.20పైనే పెంచి విక్రయం
రైతు బజార్లలోనూ ధరల బేజార్
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. రైతు బజార్లలోనే కిలో టమాటా రూ.16 నుంచి రూ.18 లకు విక్రయిస్తున్నారంటే బహిరంగ మార్కెట్లలో పరిస్థితిని ఊహించవచ్చు. రైతు బజార్లలో ధరల కంటే బహిరంగ, చిల్లర మార్కెట్లలో రెట్టింపు, అంతకుమించి ధరల్లో కూరగాయలను విక్రయిస్తున్నారు. బహిరంగ, చిల్లర మార్కెట్లలో దొండకాయలు, బెండకాయలు కిలో రూ.70-రూ.80పైనే అమ్ముతున్నారు. బెండ, దొండకాయలతో సమానంగా బీరకాయలు రేట్లు పలకడం గమనార్హం. పచ్చిమిర్చి రూ.60లకు చేరింది. గుత్తి వంకాయ (గులాబీ రకం) రూ.80,చేమ దుంపలు రూ.80, మీడియం సైజు ఆనబకాయ రూ.50, ములక్కాడ ఒకటి రూ.15, చిక్కుళ్లు రూ.150 ఇలా అన్ని కూరగాయల ఽధరలు మండిపోతున్నాయి. కేరట్, బీట్‌రూట్ కిలో రూ.100కు చేరుకున్నాయి. కేప్సికం రూ.130లకు పెరిగింది. రైతు బజార్లలో కిలో టమాటా రూ.16లు ఉంటే బహిరంగ,చిల్లర మార్కెట్లో రూ.40లు చెబుతున్నారు.ఈ లెక్కన రైతుబజార్లలో రూ.20ల కంటే తక్కువకే కిలో టమాటాలు వస్తాయన్నమాట.ఇలా బహిరంగ మార్కెట్లలో ధరల మోత మోగుతోంది.
రైతు బజార్లలో ధరలిలా..
రైతుబజార్లలోనూ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. రైతుబజార్లలో ఆదివారం కిలో టమాటా రూ.16లకు, దొమ్మేరు వంకాయలు రూ.54, గులాబీ రకం రూ.44, నలుపు (జాళ్లు) రూ.38, తెలుపు (చార) రూ.32, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.34, కాకరకాయలు రూ.32, బీరకాయలు (పందిరి) రూ.42, కాలిఫ్లవర్ రూ.15, కేరట్ రూ.44, గోరుచిక్కుళ్లు రూ.34, ఆనబకాయ రూ.30, దేశవాళీ చిక్కుళ్లు రూ.68, కనుపు చిక్కుళ్లు రూ.90, చేమదుంపలు రూ.40, కంద రూ.67, బీట్‌రూట్ రూ.44, కీరదోస రూ.36, బీన్స్ కాయలు రూ.80, బీన్స్ గింజలు రూ.130, కేప్సికం రూ.74,బొబ్బర్లు రూ.38, పెండలం రూ.30లకు విక్రయించారు. ధరలు ఎంత పెరిగినా కూరగాయలు నిత్యావసరాలు కావడంతో ప్రజలకు కొనుగోలు చేయకతప్పడంలేదు.
చలి, మంచు ప్రభావమేనా..
మార్కెట్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడానికి వాతావరణ మార్పులు ప్రధాన కారణం అని కూరగాయలు సాగు చేసే రైతులు, కొందరు వ్యాపారులు చెబుతున్నారు. దీనిలో నిజం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్కెట్ మాయాజాలం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే రైతుబజార్లలో కొందరు వ్యాపారులకు షాపులున్నాయి. ఈ స్థానిక రైతులు తమ పొలాల్లో ఆనబకాయలు, పొట్టి బీరకాయలు, కాలీఫ్లవర్ వంటివి సాగు చేస్తున్నా రోజువారీ దిగుబడులు మార్కెట్ అవసరాలను తీర్చేస్థాయిలో రావడంలేదు. దీంతో కూరగాయల వ్యాపారులంతా ఇతర జిల్లాల నుంచి మన మార్కెట్లకు సరుకు తీసుకొస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. భోగి పండగలోపు స్థానికంగా కూరగాయల సాగు దిగుబడులు పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది పెద్ద పండగ సాధారణ, మిడిల్‌క్లాస్‌కు పెద్ద ఆర్థికభారంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Updated Date - Jan 08 , 2025 | 12:40 AM