Andhra Pradesh Secretariat Fire: సచివాలయంలో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Apr 05 , 2025 | 02:29 AM
అమరావతి సచివాలయంలో బ్యాటరీ రూమ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని, రెండో బ్లాక్‌ను దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. భద్రతా లోపాలపై సీఎం ఆడిట్ ఆదేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రెండో బ్లాక్ బ్యాటరీ రూమ్‌లో మంటలు
బ్యాటరీల నిర్వహణ లోపమే కారణం
ఆ బ్లాక్‌లోనే ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చాంబర్లు
పరిశీలించిన సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లోని కంప్యూటర్ వ్యవస్థకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీ రూమ్‌లో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సచివాలయంలోని ఎస్‌పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని అదుపు చేశారు. దాదాపు 60 బ్యాటరీలు కాలిపోవడంతో రెండో బ్లాక్ కింద, పై అంతస్తులకు పొగ అలుముకుంది. ఆ బ్లాక్ అంతా బ్యాటరీలు కాలిపోయిన వాసన రావడంతో ఉద్యోగులు, సందర్శకులు ఇబ్బంది పడ్డారు. దీంతో రెండో బ్లాక్ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. కాగా, రెండో బ్లాక్‌లోనే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు కేశవ్, అనిత, నారాయణ, రామనారాయణరెడ్డి, మనోహర్, దుర్గేష్ చాంబర్లు ఉన్నాయి. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాటరీల నిర్వహణ లోపంవల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ బ్లాక్‌లో ఫైర్ అలారం మోగలేదని నిర్ధారించారు.
భద్రతా ప్రమాణాలపై ఆడిట్
అగ్ని ప్రమాద ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముకే్‌షకుమార్‌మీనాతో కలిసి రెండో బ్లాక్‌ను సందర్శించిన సీఎం.. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. అనంతరం మొదటి బ్లాక్‌లో ఉన్న మరో బ్యాటరీ రూమ్‌ను సీఎం పరిశీలించారు.
అన్ని కోణాల్లో విచారణ: అనిత
ప్రమాదంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. తగలబడిన బ్యాటరీ రూమ్‌ను పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెల్లవారుజామున 6.30గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందడంతో 3నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి, 10 నిమిషాల్లో మంటల్ని అదుపు చేశారు. తగలబడిన బ్యాటరీ రూమ్ నుంచి పొగ పై ఫ్లోర్‌లోకి వెళ్లడంతో అక్కడ ఏసీలు, బ్యాటరీలు కూడా కాలినట్లు కనిపిస్తున్నాయి. జీఏడీ, సీఆర్‌డీఏ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై అన్ని కోణాల్లో కూలంకుషంగా విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని పోలీ్‌సశాఖను ఆదేశించాం. పోలీస్, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరిచర్యలు తీసుకుంటాం. సచివాలయంలో ఫైర్ అలారం ఎక్కడెక్కడ పని చేయట్లేదో ఫైర్ ఆడిట్ చేయించి, నివేదిక తీసుకుంటాం. రానున్న కాలంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జీఏడీ అధికారులను ఆదేశించాం’ అని చెప్పారు.
ఆగమేఘాల మీద చెత్త తొలగింపు
రెండో బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను పరిశీలించిన తర్వాత మొదటి బ్లాక్‌లోని సీఎంఆర్‌ఎఫ్ విభాగాన్ని సీఎం సందర్శించారు. అక్కడున్న ఫైళ్లను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి అపరిశుభ్రత, సచివాలయంలో అక్కడక్కడా చెత్త పేరుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో చెత్త కనిపించకూడదని, 24గంటల్లో తొలగించాలని ఆదేశించారు. దీంతో సచివాలయ శానిటేషన్ సిబ్బంది ఆఘమేఘాల మీద బ్లాకుల్లో, ప్రాంగణంలో చెత్తను ఎత్తించి, ట్రాక్టర్లతో బయటికి తరలించారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:17 AM