High Court: జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి షాక్
ABN, Publish Date - Jan 11 , 2025 | 03:28 AM
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నరసాపురం మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును హత్య చేసేందుకు పన్నినకుట్రలో భాగస్వామి అయ్యారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
రఘురామ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నరసాపురం మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును హత్య చేసేందుకు పన్నినకుట్రలో భాగస్వామి అయ్యారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ శుక్రవారం తీర్పుఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని నివేదిక ఇచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేసిన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు రఘురామను కస్టోడియల్ హింసకు గురిచేసినట్లు నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తనను కస్టోడియల్ హింసకు గురిచేసిన సీఐడీ పోలీసులతో పాటు తప్పుడు వైద్య నివేదిక అందజేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణరాజు గుంటూరు, నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రభావతి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి, ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, రఘురామ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రాథమిక ఆధారాలున్నాయి
‘సీఐడీ పోలీసు కస్టడీలో తన పాదాలపై దారుణంగా కొట్టారని రఘురామరాజు నిర్దిష్టంగా చెబుతున్నప్పటికీ కాలివేళ్లు విరిగిన ప్రాంతాన్ని వదిలిపెట్టి పాదాలను ఎక్స్‌రే తీశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో మెడికల్ బోర్డు ఏర్పడిన నేపథ్యంలో కోర్టుకు సమర్పించిన రిపోర్టులు, ఎక్స్‌రే ఫిలింలన్నీ సక్రమంగా ఉన్నాయా? లేవా? చూడాల్సిన బాధ్యత మెడికల్ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రభావతిపై ఉంది. రఘురామ విషయంలో తీసిన పాక్షిక ఎక్స్‌రేపై అభ్యంతరం తెలపకుండా ప్రభావతి దానిని పరిగణనలోకి తీసుకున్నారని, కుట్రలో ఆమెకు పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభావతి పాత్ర లేదని చెప్పలేం. కోర్టు ఉత్తర్వులను గౌరవించడంతో పాటు వైద్య విలువలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉంది. పిటిషనర్ విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 03:28 AM