Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:23 AM
మద్యం కుంభకోణం కేసులో సిట్ నోటీసులను సవాల్ చేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నోటీసులు చట్టబద్ధమేనని తెలిపిన కోర్టు, విచారణ ప్రక్రియను కొనసాగించేందుకు మార్గం సుగమం చేసింది.

సిట్ నోటీసులలో జోక్యానికి నిరాకరణ
తెలంగాణలో ఉన్నా విచారణకు రావాల్సిందే
తగిన సమయంతో మళ్లీ నోటీసులివ్వండి
దర్యాప్తు సంస్థకు స్పష్టీకరణ
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘సిట్’ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణకు హాజరైన సమయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. విచారణ ప్రక్రియను వీడియో తీయాలని, న్యాయవాదిని అనుమతించాలన్న వినతినీ తిరస్కరించింది. అలాంటి అభ్యర్థనలు ఏవీ పిటిషన్‌లో కోరలేదని తెలిపింది. విచారణకు హాజరయ్యేందుకు సముచిత సమయం ఇస్తూ తదుపరి నోటీసు జారీ చేయాలని సిట్‌ను ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు హాజరుకావాలని గత నెల 25, 28 తేదీల్లో సిట్ ఇచ్చిన నోటీసు(సీఆర్‌పీసీ సెక్షన్ 160)లను కొట్టివేయాలి కోరుతూ వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడని పేరున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పి. నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. వైసీపీ హయాంలో రెండేళ్లపాటు పిటిషనర్ ఐటీ సలహాదారుగా పనిచేశారన్నారు. మద్యం వ్యవహారంతో ఆయనకు సంబంధం లేదని తెలిపారు. ఐటీ సలహాదారు హోదాలో ఆ శాఖకు సంబంధించిన విషయాల గురించి చర్చించేందుకు మాత్రమే అప్పటి ప్రభుత్వ పెద్దలను కలిశారన్నారు. పిటిషనర్ తెలంగాణలో నివశిస్తున్నారని, నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరే అధికార పరిధి ఏపీ సీఐడీకి లేదన్నారు. పిటిషనర్‌ను విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందన్నారు. కసిరెడ్డిపై ఆరోపణలు నిరాధారమైనవేనని చెప్పారు. ఈ నేపథ్యంలో సిట్ నోటీసులను కొట్టివేయాలని కోరారు.
ఆ అధికారం ఉంది: ఏజీ
సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో ఉంటున్నవారికి సైతం నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరే అధికార పరిధి ఏపీ సీఐడీకి ఉంటుందన్నారు. ఇదే హైకోర్టులో సింగిల్ జడ్జి, ద్విసభ్య ధర్మాసనం ఈ విషయంపై స్పష్టమైన తీర్పులు ఇచ్చాయన్నారు. పిటిషనర్‌ను కేసులో నిందితుడిగా చేర్చలేదని తెలిపారు. అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సాక్షి గా విచారణకు హాజరుకావాలని నిబంధనల ప్రకారమే దర్యాప్తు అధికారి నోటీసులు ఇచ్చారన్నారు. పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి చట్టనిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఉంటున్నవారికి నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరే అధికారపరిధి ఏపీ సీఐడీకి ఉంటుందని పేర్కొన్నారు. సిట్ నోటీసుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ... కసిరెడ్డిని ఇంటి వద్దే విచారించేలా ఆదేశించాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ... పిటిషనర్‌కు 60 ఏళ్లు పైబడలేదని, అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News