High Court: వాదన వినకుండా డీలర్‌షిప్ రద్దు సరికాదు
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:39 AM
చిత్తూరుజిల్లాలో చౌక ధరల దుకాణం డీలర్‌షిప్ రద్దును హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో 2009లో ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను చట్టవ్యతిరేకంగా భావించి, ముందుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఆర్డీవోకు వివరణలతో తాజా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): చౌక ధరల దుకాణం డీలర్‌షిప్(ఫెయిర్ షాప్) రద్దుకు ముందు సంబంధిత డీలర్ వాదన వినాలని, కనీస విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి విచారణ జరపకుండా సహజన్యాయసూత్రాలకు విరుద్ధంగా ఓ మహిళకు చెందిన చౌక ధరల దుకాణం డీలర్ షిప్‌ను రద్దు చేస్తూ చిత్తూరుజిల్లా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది. మదనపల్లి చౌక ధరల దుకాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో తహశీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫెయిర్ షాప్ యజమాని ఎం.అరుణ డీలర్‌షి్‌పను రద్దుచేస్తూ 2009లో ఆర్డీవో ఉత్తర్వులు ఇచ్చారు. జేసీ, కలెక్టర్ వద్ద అప్పీల్ వేసినప్పటికీ ఉపశమనం లభించకపోవడంతో 2013లో అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డీవో స్వతంత్రంగా వ్యవహరించకుండా తహశీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీలర్‌షిప్ రద్దు చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇది చట్టనిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. చట్టనిబంధనల ప్రకారం డీలర్ షిప్ రద్దుకు ముందు కనీస విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయడింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని వివరాలు పరిగణనలోకి తీసుకొని తాజాగా నిర్ణయం తీసుకోవాలని మదనపల్లి ఆర్డీవోను ఆదేశించింది.