Tippayapalle: పురుషుల పండుగ..!
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:12 AM
పండుగలు, జాతరలు లేదా ఏ ఆధ్మాత్మిక కార్యక్రమమైనా.. సాధారణంగా స్త్రీల హడావుడి ఎక్కువగా ఉంటుంది. పొంగళ్లు, పూజల నుంచి దాదాపు అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే జరుగుతుంటాయి..! పురుషుల పాత్ర పెద్దగా ఉండదు.
అన్నమయ్య జిల్లా తిప్పాయపల్లెలో ప్రత్యేక ఆచారం
పుల్లంపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): పండుగలు, జాతరలు లేదా ఏ ఆధ్మాత్మిక కార్యక్రమమైనా.. సాధారణంగా స్త్రీల హడావుడి ఎక్కువగా ఉంటుంది. పొంగళ్లు, పూజల నుంచి దాదాపు అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే జరుగుతుంటాయి..! పురుషుల పాత్ర పెద్దగా ఉండదు. అయితే కేవలం మగవాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా ఒక పండుగ ఉందండోయ్..! ఈ పండుగ చూడాలంటే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామానికి రావాల్సిందే. ఇక్కడ సంజీవరాయుడికి పొంగళ్లు పెట్టేందుకు అవసరమైన సామగ్రిని స్వయంగా ఇంటి నుంచి ఆలయానికి తెచ్చుకోవడం నుంచి పొంగళ్లు వండి.. దేవుడికి నైవేద్యం సమర్పించే వరకు అంతా మగవాళ్లే చేస్తారు. ఆడవాళ్లకు ఆలయంలోకి ప్రవేశం లేదు. ఆలయం వెలుపల నుంచి హారతి తీసుకోవడానికి మాత్రమే వారు పరిమితమవుతారు. సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం సంజీవరాయ స్వామికి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించడం వింత గా ఉన్నా.. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తూ వస్తున్నారు. తిప్పాయపల్లెలోని సంజీవరాయుడికి ఆదివారం భక్తిశ్రద్ధలతో మగవారు పొంగుబాళ్లు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామునే పురుషులు ఇంటి నుంచి సామగ్రిని ఆలయానికి తీసుకువచ్చి, భక్తిశ్రద్ధలతో టెంకాయ కొట్టి పొయ్యి మీద పొంగళ్లు వండారు. 200 మందికిపైగా మగవాళ్లు నైవేద్యం సమర్పించారు. టెంకాయలు కొట్టి బెల్లం, కొబ్బరి చదివింపులు చేసి మొక్కులు తీసుకున్నారు. మహిళలంతా ఆలయం ముందు ఉండి హారతి తీసుకున్నారు.
ఆలయ చరిత్ర ఏంటంటే?: 1516వ సంవత్సరంలో తిప్పాయపల్లె ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుండగా.. ఆ గ్రామంలోకి వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు ఓ బండరాయిపై బీజాక్షరాలు రాసి సంజీవరాయుడిగా నామకరణం చేశాడు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం భక్తిశ్రద్ధలతో సంజీవరాయుడికి పొంగళ్లు పెడితే గ్రామానికి అరిష్టం ఉండదని, పంటలు పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని చెప్పి అదృశ్యమయ్యాడని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఆచారం పాటిస్తున్నారు. మగవాళ్లు పూజలు చేస్తే కోరికలు తీరతాయని నమ్మకం. గ్రామంలో ఏ పని చేయాలన్నా సంజీవరాయుడికి పూజలు చేసి మొదలుపెడతారు. చిన్న వయస్సులో ఉన్న ఆడపిల్లలకు తప్ప మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదు. అంతేగాకుండా మహిళలు పొంగళ్లు కూడా ముట్టరు. ఆలయంలోకి దళితులు రారు.
ఆరోగ్యం బాగుండాలని వచ్చా
మా స్వస్థలం శ్రీకాకుళం. నేను వైజాగ్‌లో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్నాను. నాకు చాలాకాలం నుంచి ఆరో గ్యం సరిగా లేదు. ఇక్కడ మగవాళ్లు మాత్రమే పొంగళ్లు పెడతారని, ఇక్కడ దేవుడిని మొక్కుకుంటే మంచి జరుగుతుందన్న నా భార్య సలహా మేరకు సంజీవరాయుడికి పొంగళ్లు పెట్టేందుకు వచ్చాను. ఆరోగ్యం బాగుంటే వచ్చే ఏడాది కూడా వస్తానని మొక్కుకున్నాను.
- హరి, వైజాగ్
Updated Date - Jan 13 , 2025 | 03:12 AM