కోట్లాట
ABN, Publish Date - Jan 16 , 2025 | 01:14 AM
సంక్రాంతి పెద్ద పండుగ మూడు రోజుల పాటు ధూమ్‌ధామ్‌గా సాగింది. నోట్లు చేతులు మారాయి. కోళ్ళు కత్తులు కట్టుకున్నాయి. ఓ వైపు కోతాట, మరోవైపు గుండాట, ఇంకో వైపు పొట్టేలు పోటీలు.. ఎక్కడికక్కడ ఏటీ ఎంలే కాదు జనం జేబులు ఖాళీ అయ్యాయి.
పండుగ మూడు రోజులు పందేల జోరు
చేతులు మారిన కోట్ల రూపాయలు
ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల ఏర్పాటు.. విజేతలకు బహుమతులుగా బైక్‌లు
ఫ్లడ్‌లైట్‌ల నడుమ సాగిన పందేలు
అంతా పూర్తయ్యాకే పోలీసుల రంగ ప్రవేశం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
సంక్రాంతి పెద్ద పండుగ మూడు రోజుల పాటు ధూమ్‌ధామ్‌గా సాగింది. నోట్లు చేతులు మారాయి. కోళ్ళు కత్తులు కట్టుకున్నాయి. ఓ వైపు కోతాట, మరోవైపు గుండాట, ఇంకో వైపు పొట్టేలు పోటీలు.. ఎక్కడికక్కడ ఏటీ ఎంలే కాదు జనం జేబులు ఖాళీ అయ్యాయి. మద్యం ఏరులై పారింది. తెలంగాణ మద్యం అదనంగా వచ్చిపడింది. బుల్లితెర తారలు దిగొచ్చారు. ప్రజాప్రతినిధులు బరుల వద్ద చుట్టాలయ్యారు. పండుగ ముగిసింది ఇక చాలంటూ యథావిధిగా కనుమ సాయంత్రం ఐదు గంటలకు ఎక్కడికక్కడ బరుల వద్ద పోలీసులు వచ్చి వాలారు.
జిల్లాలో పట్టణం, పల్లె తేడా లేకుండా వందలాది బరుల్లో పందెం కోళ్ళు ఎగిరి పడ్డాయి. నూజివీడు ప్రాంతంలోని గోప వరం, చెక్కపల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ పోటీల పేరిట ముసుగు పందేలు వేశారు. చింతలపూడి, ఏలూరు, దెందులూరు, కైక లూరు వంటి నియోజకవర్గాల్లో అయితే బరు లకు జనం క్యూకట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులంతా పండుగ మూడు రోజులు బరుల వద్ద గడిపారు. అక్కడే దొరికిన మద్యం, కోడి పకోడితో జల్సా చేశారు. వారి వెనుకే మహిళలు కూడా. ఈసారి పోటీ ల్లో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐల సంఖ్య కాస్త ఎక్కువ గానే ఉన్నా వారెవ్వరూ కెమెరాల ముందుకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇక స్థానికులైతే భోగి నుంచి కనుమ వరకు పండుగ పూట తెగ మురిసిపోయి రెచ్చిపోయారు. లక్షల రూపాయలు పందెం కట్టి గెలిచిన వారు కొందరైతే ఓడిన వారు మరికొందరు. కొన్నిచోట్ల అయితే నగదు భద్రత నిమిత్తం అసిస్టెంట్లను అండ తెచ్చుకున్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, దుగ్గిరాల, ముసునూరు, భుజబలపట్నం, వంటి ప్రాంతాలన్నింటిలోనూ జనం ఎగబడ్డారు. ఏడు నియోజకవర్గాల్లో రోజుకు 350 నుంచి 450 మేర పందెంకట్టిన కోళ్ళు పోటీ పడ్డాయి. పండుగ పూట సరదా అంటూ చిన్నారులు కూడా 500 నుంచి 1500 వరకు పందేల్లో బెట్టింగ్ కాశారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఓడిపోయిన వారు ఉన్నారు. పనిలో పని గా తమ ఇంటికి వచ్చిన అతిథులు మురిసి పోయేలా బరుల వద్దే సంబరాలు చేశారు. పెద్ద ఎత్తున బరుల వద్ద కోడి పందేలను మహిళలు వీక్షించారు.
కాస్తంత వెరైటీగా..
ఈసారి కోడి పందేల్లో కాస్తంత వెరైటీ కనిపించింది. గతంలో కేవలం నోట్ల కట్టలతోనే కళ్ళు జిగేల్‌మనిపించేవారు. ఈసారి కోడి పందేలకు వచ్చే వారందరినీ సంతృప్తిపరిచేలా ఎవరికీ పందెం జరిగే తీరు కనపడలేదన్న అపవాదు రాకుండా బరుల వద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను అమర్చారు. నూజివీడు ప్రాంతంలో ఈ స్ర్కీన్‌ల నడుమ పోటీలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో చేతులకు స్టిక్కరింగ్ వేసి మరీ పంపారు. ఆఖరుకి ఫ్లడ్‌లైట్‌ల్లో తెల్లవార్లూ పందేలు సాగుతుండగా ఎవరూ అలసిపోకుండా నిర్వాహకులందరూ ఏర్పాట్లు చేశారు. కొందరైతే కాస్తంత సేద తీరేందుకు పందెం రాయుళ్ళకు ఏర్పాట్లు చేశారు. తోటల్లో ఈసారి కొత్తగా పందేలు సాగాయి. కొందరికి మాత్ర మే సమాచారం ఇచ్చి పందేలు పూర్తి చేశారు. వీఐపీలు, బుల్లితెర నటులు ఇబ్బంది పడ కుండా కారవాన్‌లు అందుబాటులో ఉంచారు.
అందరినీ తృప్తిపరిచారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో ఎవరికీ అసంతృప్తి ఉండరాదనే నేపథ్యంలో తమ అనుచరులు బరులు పెట్టి పందేలు వేసు కోవడానికి ఎమ్మెల్యేలు సహకారం ఇచ్చారు. అంత టితో సరిపెట్టకుండా ఎవరికీ ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చోట్ల అతిగా మద్యం తాగిన వ్యక్తులు పందెంబరుల వద్ద వివాదాలకు దిగారు. అటువంటివారికి నచ్చ చెప్పి బయటకు పంపేందుకు పవర్ ఉపయోగిం చారు. ప్రత్యేకించి గొడవలు ఎక్కడా బహిర్గతం కాకుండా ద్వితీ య శ్రేణి నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. అన్ని ప్రాం తాల్లోను ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని అందరికీ ఉత్సాహం ఇచ్చారు.
ఎంత డబ్బో..
బెట్టింగ్‌రాయుళ్ళంతా నగదును కట్టలు కట్టలుగా తెచ్చి బెట్టింగు ను కాశారు. తగినంత భద్రత తీసుకున్నారు. మొత్తం నగదును నలుగురైదుగురికి విభజించి అందుబాటులో ఉంచుకున్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన వ్యాపార వేత్త రూ.50 లక్షల నగదును సంక్రాంతి ఒక్కరోజునే కోడి పందేల్లో బెట్టింగ్‌గా కాశారు. లండన్ నుంచి వచ్చిన అతిథి ఒకరు తన అదృష్ట సంఖ్య తొమ్మిదితో తొమ్మిది లక్షలు కాసి గెలుపొందడం విశేషం. రాయచోటి నుంచి వచ్చిన వరలక్ష్మి అనే మహిళ మూడు పందేల్లో రూ.11 లక్షలు పందెంగా కాశారు. ఇలా ఎక్కడికక్కడ నగదు విచ్చలవిడిగానే సాగింది. ఇక కోతాట విషయానికొస్తే చెప్పనక్కర్లేదు. ప్రతీ పందెం బరిలోను కోతాట ఒక్కో రోజు 35 లక్షల నుంచి 45 లక్షల మేర సాగాయి. జిల్లా మొత్తం మీద ఒక్క కోడి పందేల్లోనే రూ.60 నుంచి రూ.90 కోట్లు చేతులు మారగా, అదే పేకాటలో అయితే అంతే మొత్తం జోరుగా సాగిందని అంచనా. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం సొమ్ము మూడు రెట్లు అధికం. ఇక గుండాట విషయంలో చెప్పనక్కర్లేదు.
క్లైమాక్స్‌లో పోలీసులు..
మూడు రోజులపాటు బరుల వద్ద సంబరాలు సాగగా కనుమ పండుగ క్లైమాక్స్‌లో పోలీ సులు రంగ ప్రవేశం చేసి హడావుడి చేశారు. బరుల్లో ఉన్న టెంట్‌లన్నింటినీ రాత్రి 7 గంటల కల్లా తొలగించారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడు కేసులు కట్టారు. కనుమ చివరినాడు మూడు రోజుల సినిమాకు క్లైమాక్స్ ఇదే నని పోలీసులను చూసిన జనం కామెంట్లు చేశారు.
తెగ తాగేశారు..
ఏలూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం బ్రాండ్‌లను సంక్రాంతి కానుక గా అందివ్వడంతో మద్యంబాబులు తెగతేశారు. భోగి నుంచి కనుమ వరకు అమ్మకాలు రూ.15 కోట్ల దాటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క బుధవారమే రూ.8 కోట్లు పైనే అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని 141 షాపుల ద్వారా భోగి రోజు 13వ తేదీన రూ.10 కోట్లు, 14న సంక్రాంతి రోజున రూ.7 కోట్లు, కనుమ రోజు ఉదయం ఒక రూ.కోటి వరకు సరుకును ఏలూరు డిపో నుంచి వైన్‌షాపుల యజమానులు లిఫ్ట్ చేసుకు న్నారు. కాగా డిపోకు అధికారికంగా బుధవారం సెలవు కావడంతో కొంత స్టాకును యజమానులు తీసుకెళ్లలేకపోయారు. గతేడాది జనవరిలో 1.37 లక్షల కేసుల మద్యం అమ్మకాలు సాగగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 76 వేల 250 కేసుల మద్యం అమ్మకాలు చేశారు. రోజుకు ఐదు వేల కేసుల మద్యం అమ్మ కాలు సగటున జరుగుతున్నాయి. ఈ లెక్కన మిగిలిన 15 రోజుల్లో 1.50 లక్షల కేసుల మద్యం అమ్మడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం మరో రూ.10 కోట్ల పైనే స్టాకును తరలించుకునే అవకాశం ఉంది.
బరి వద్దే విందు భోజనం
పెదవేగి : సంక్రాంతిని పురస్కరించుకుని పెదవేగి మం డలం దుగ్గిరాలలో కోడి పందేలు భారీగా సాగాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు చికెన్, మటన్, రొయ్యల బిర్యానీలతో ఉచిత భోజనం ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల్లో దాదాపు 75 వేల మందికి ఉచిత భోజనం అందిం చారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి, అతిథి మర్యాదలతో ఆకట్టుకున్నారు.
కోజా... భలే డిమాండ్..
ద్వారకాతిరుమల/ కొయ్యలగూడెం : పందెంలో ఓడిపోయి చనిపోయిన కోడిని కోజాగా పిలుస్తారు. పందేలకు ముందు పందె గాళ్లు వీటికి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, కైమా వంటి ఆహారాన్ని అందిస్తారు. దీనివల్ల మంచి రుచి వస్తుందని వీటికోసం మాంసం ప్రియులు ఎగబడుతుంటారు. ఒక్కో కోజా రూ. 3000 నుంచి రూ.10 వేల వరకు పలి కింది. ఏలూరు శివారులో రూ.15 వేలు పలకడం విశేషం.
ఫోన్ పే, గూగుల్ పేలో పందేల సొమ్ము
బుట్టాయగూడెం : ఎన్నడూలేని విధంగా ఈసారి కోడిపందేల్లో ఫోన్ పే, గూగుల్ పేలకు డిమాండ్ పెరి గింది. చేతిలో డబ్బులు లేకపోవడంతో పందేలరాయుళ్ళు ఫోన్ పే, గూగుల్ పేలకు పని చెప్పారు. సంక్రాంతి పండుగ రోజుల్లో బ్యాంకులకు సెలవు కావడం, ఏటీఎంలు ఖాళీ కావడంతో డబ్బులకు ఎక్కలేని డిమాండ్ వచ్చింది. చాలామంది దగ్గర నగదు రూపంలో లేకపోవడంతో ఫోన్ పే, గూగుల్ పే లతో కోడిపందేలు కాశారు. కొందరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే పది శాతం కమిషన్ తీసుకుని నోట్ల రూపంలో తిరిగి డబ్బులు ఇచ్చారు. రూ.వెయ్యికి రూ.100 కమిషన్‌తో లావాదేవీలు జరిగాయి. ప్రత్యేకించి కొందరి మధ్య అయితే బెట్టింగు లన్నీ ఫోన్‌పే టూ ఫోన్‌పే పద్ధతిలో సాగాయి. కొందరు ఈ–బ్యాంకింగ్ పద్ధతిని పాటించారు.
371 కేసులు నమోదు
ఏలూరు క్రైం : జిల్లాలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో 371 కేసులు నమోదు చేసి 891 మందిని అరెస్టు చేశారు. 13న 92 కోడిపందేల కేసులు, 52 పేకాట, 27 గుండాట కేసులు నమోదు చేశారు. మొత్తం 171 కేసుల్లో 411 మందిని అరెస్టు చేసి రూ.రెండు లక్షల 55 వేల 440 నగదు, 114 కోళ్ళు, 150 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. 14న 99 కోడి పందేల కేసులు, 65 జూదం, 36 గుండాట కేసులు మొత్తం 200 కేసులు నమోదు చేసి 480 మందిని అరెస్టు చేసి 115 కోళ్ళు, 116 కోడికత్తులు, రూ.మూడు లక్షల 20 వేల 755 నగదు స్వాధీనం చేసుకు న్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన కోడిపందేల్లా రూ.500 దొంగనోట్లు చెక్కర్లు కొట్టాయని చెప్పుకుంటు న్నారు. కొన్ని ప్రాంతాల్లో గంజాయి విక్రయించినట్లుగా తెలుస్తోంది. కోడిపందేలను ప్రధాన రహదారుల పక్కనే నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఏలూరు రూరల్ మండలం కొమడవోలు, పాలగూడెం, చాటపర్రురోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొమడవోలులో ట్రాఫిక్ జామ్ అయి ఒక ఆటో ప్రమాదవ శాత్తు పక్కనే ఉన్న పంట కాల్వలో బోల్తా పడింది. బొర్రంపాలెం అడ్డరోడ్డు వద్ద ఒక పామాయిల్ తోటలో రోడ్డు పక్కనే పందేలు నిర్వహించడంతో, వాహనా లు రోడ్లపైనే పెట్టివేయడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Updated Date - Jan 16 , 2025 | 01:14 AM