నచ్చినవారు వచ్చేవరకు రద్దే
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:23 AM
నీటిపారుదల శాఖలో టెండర్లంటే కాసుల వర్షమే. కాల్వల్లో పూడికతీత, వాటి నిర్వహణ వంటి పనుల్లో భారీగా డబ్బు మిగులుతుండటంతో టెండర్లను దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే, తమకు కమీషన్లు ఇచ్చేవారికి.. తమకు అనుకూలురుకు ఈ టెండర్లను కట్టబెట్టేందుకు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చేసేది లేక అధికారులు ప్రతిసారీ టెండర్లను రద్దు చేసేస్తున్నారు. వైసీపీ హయాంలోని ఈ జాడ్యాన్ని కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులూ కొనసాగిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇరిగేషన్ పనుల్లో ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం
గుడివాడ, పామర్రు ఇరిగేషన్, డ్రెయినేజీ టెండర్లు రద్దు
ఎమ్మెల్యేల జోక్యంలేని చోట్ల పనులు షురూ
కొన్ని నియోజకవర్గాల్లో 39 శాతం లెస్‌కు టెండర్లు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గత ఏడాది నవంబరులో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ డివిజన్ పరిధిలో ఉన్న నాలుగు సెక్షన్లలో రూ.5.74 కోట్లతో 29 పనులకు టెండర్లను పిలిచారు. గత ఏడాది నవంబరు 11న పిలిచి 25న తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో నవంబరు 25న కాకుండా డిసెంబరు 2వ తేదీ వరకు టెండరు దాఖలకు సమయాన్ని పొడిగించారు. తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు రావడంతో డిసెంబరు 7న వాటిని రద్దు చేశారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో రూ.3.84 కోట్లతో 26 పనులు చేపట్టేందుకు నవంబరు 11న టెండర్లు పిలిచారు. వీటిని డిసెంబరు 9న రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ టెండర్లు పిలిచారు. డిసెంబరు 30న వీటిని తెరవాల్సి ఉంది. కానీ, కొన్ని నియోజకవర్గాల పరిధిలోని టెండర్లను మాత్రమే ఓకే చేసి.. గుడివాడ, పామర్రు నియోజకవర్గాల పరిధిలోని టెండర్లను మళ్లీ రద్దు చేస్తున్నట్లు గురువారం అధికారులు ప్రకటించారు.
అయినవారి కోసమే..
నీటిపారుదల శాఖలో పనుల్లో ‘గిట్టుబాటు’ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. అదే స్థాయిలో లెస్‌కూ టెండర్లు వేస్తుంటారు. ఉదాహరణకు.. వెంట్రప్రగడ సెక్షన్‌లో దోసపాడు చానెల్‌ను సుమారు 4.5 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి నిర్వహించేందుకు రూ.19.18 లక్షలతో టెండర్ పిలవగా, 32 శాతం లెస్‌కు రూ.13.47 లక్షలకే పనులు చేస్తామని కాంట్రాక్టర్ టెండర్ వేశారు. అలాగే, ఆత్కూరు యూటీ మీడియం డ్రెయిన్ మరమ్మతులు, నిర్వహణకు రూ.25.49 లక్షలతో పనులు పిలవగా, సుమారు 39 శాతం లెస్‌కు రూ.15.59 లక్షలకే పనులు చేస్తామని టెండర్ వేశారు. మిగిలిన పనులకు భారీస్థాయిలో లెస్‌కు టెండర్లు పడ్డాయి. కైకలూరు, గన్నవరం, అవనిగడ్డ వంటి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల నుంచి ఎలాంటి జోక్యం లేకపోవడంతో టెండర్లను ఓపెన్ చేసి పనులు అప్పగించేశారు.
ఆ మూడు నియోజకవర్గాల్లో..
గుడివాడ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల అనుచరుల జోక్యం మితిమీరడంతో అధికారులు పదేపదే టెండర్లను రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి రెండో విడతలో టెండర్లు ఓకే చేశారు. కానీ, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల టెండర్లు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకో, కమీషన్ల కోసమే ఈ టెండర్లను స్థానిక నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పదేపదే రద్దు చేయిస్తున్నారు. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి టెండర్లలో పాల్గొనకుండా చేసేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలం కావడంతో అధికారులను తమకు అనుకూలంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ వస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు మారుమాట్లాడకుండా వారు చెప్పినట్లు చేస్తున్నారు. ఈ రద్దు బాగోతంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టి సారించాలని అధికారులు కోరుతున్నారు.
Updated Date - Jan 10 , 2025 | 12:23 AM