సినిమా రంగానికీ సామాజిక బాధ్యత ఉండాలి
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:20 AM
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సినిమా రంగానికీ సామాజిక బాధ్యత ఉందని ప్రముఖ సినిమా దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు.
అది మర్చిపోయి, ధనార్జనే ధ్యేయంగా మారడం దురదృష్టకరం
‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకావిష్కరణలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ
విజయవాడ కల్చరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సినిమా రంగానికీ సామాజిక బాధ్యత ఉందని ప్రముఖ సినిమా దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో మూడో రోజు శనివారం రామోజీరావు సాహిత్య వేదికపై నిర్వహించిన రెండో కార్యక్రమంలో ఎమ్మెస్కో పబ్లిషర్స్ వారి ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. చరిత్రను, బాధ్యత ను మర్చిపోయిన తెలుగు సినిమా రంగం కేవలం ధనార్జనే ధ్యేయంగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. సామాజిక సమస్యలపై నాటి సినిమాల్లో పాటలు ప్రజలను ఆలోచింపజేశాయన్నారు.
ఊ అంటావా మావా..ఊహూ అంటావా లాంటి పాటలొస్తున్నాయి
ఇప్పటి సినిమాల్లో ఊ అంటావా మామా ఊహూ అంటావా లాంటి పాటలు వస్తున్నాయని తెలుగు సినిమా పాట ఎటు వెళ్లిపోతుందోనని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల సినీ రంగంలో ఉన్నా తనకే తెలియని విశేషాలు ఈ పుస్తకంలో రచయిత రెంటాల జయదేవ్ పొందుపరిచారన్నారు. మనందరి మనసులకూ దగ్గరైన కళారూపం సినిమా అని జస్టిస్ కృష్ణమోహన్ అన్నారు. ఎమ్మెస్కో ప్రచురణకర్త విజయకుమార్, పూర్ణపిక్చర్స్ అధినేత విశ్వనాథమ్ నవరంగ్ థియేటర్‌అధినేత భూపాల్‌ప్రసాద్ పాల్గొన్నారు.
అమెరికా ప్రపంచాధిపత్యానికి రోజులు చెల్లాయ్
అమెరికా ప్రపంచాధిపత్యానికి రోజులు చెల్లిపోయాయని, ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉండే రోజులు అంతమయ్యాయని బండ్ల సాం బశివరావు అన్నారు. రామోజీరావు సాహిత్యవేదికపై సాహితీమిత్రులు ప్రచురించిన డి.పాపారావు రచించిన మానవాళికి మహోదయం-అంతం కాదిది ఆరం భం పుస్తకాన్ని ఆయన పరిచయం చేశారు. పాత్రికేయుడు ఎస్.వెంకట్రావు ఆవిష్కరించారు.
Updated Date - Jan 05 , 2025 | 01:20 AM