AP News: ఏపీ సిఐడి మాజీ చీఫ్ అధికార దుర్వినియోగంపై విచారణ..
ABN, Publish Date - Jan 22 , 2025 | 08:19 AM
అమరావతి: ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.
అమరావతి: ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఎన్ (Former AP CID Chief) సంజయ్ (Sanjay) అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీంతో నిధుల అక్రమాలపై క్రమశిక్షణ చర్యలకు (Investigation) ప్రభుత్వం ఉత్తర్వులు (Government orders) ఇచ్చింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం, క్రమశిక్షణ రాహిత్యానికి సంజయ్ పాల్పడ్డారని అభియోగాలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ట్యాబ్‌ల కొనుగోళ్లు, అగ్ని మొబైల్ యాప్‌ను జేబు సంస్థలకు కట్టబెట్టారని, అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్‌పై ఆరోపణలు రావడంతో.. ఈ మేరకు అతనిపై డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యం తదితర అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. నెలరోజుల్లోగా అభియోగాలపై వివరణ ఇవ్వాలని సంజయ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అధికార దుర్వినియోగం, క్రమశిక్షణా రాహిత్యంపై విచారణ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే విచారణ సందర్భంగా రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని సంజయ్‌కు హెచ్చరిక జారీ చేసింది. నిధుల దుర్వినియోగం సహా నమోదైన వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.మరోవైపు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలంటూ సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.
మంగళవారం విచారణ..
అగ్ని ఎన్‌వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపకల్పన, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరాతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల ఏర్పాటు పేరుతో సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ కాంట్రాక్టు కంపెనీలతో కుమ్మకై నిధులు మళ్లించేశారని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంగళవారం ఆయన వాదనలు వినిపించారు. రూ1.75 కోట్లు మేర నిధులను సంజయ్ దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అగ్ని యాప్ రూపకల్పనకు ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే హడావుడిగా సౌత్రికా టెక్నాలజీస్ సంస్థకు రూ.80 లక్షలు చెల్లించారని, యాప్ రూపకల్పన పురోగతిని పరిశీలించకుండానే సొమ్ము చెల్లించేశారని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై గిరిజనులు, దళితులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు క్రిత్వ్యాప్ సంస్థతో 2024 జనవరి 30న ఒప్పందం చేసుకున్నారని, ఆ రోజే ఆ సంస్థకు సొమ్ము చెల్లించేశారని తెలిపారు. క్రిత్వ్యాప్ సంస్థతో ఒప్పందానికి ముందే సీఐడీ అధికారుల నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారని, క్రిత్వ్యాప్ సంస్థ సదస్సులు నిర్వహించకుండానే బిల్లులు సమర్పించిందని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల నుంచి నిధులు సంజయ్‌కి చేరాయో?లేదో? దర్యాప్తులో తేలాల్సి ఉందని, సదస్సుల నిర్వహణ గురించి దిగువస్థాయి అధికారులను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు వెలికితీయాలంటే సంజయ్ కస్టోడియల్ విచారణ అవసరమన్నారు. సంజయ్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుబెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
అంతకుముందు సంజయ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అధికారుల నేతృత్వంలోని కమిటీ యాప్ రూపకల్పనపై సంతృప్తి వ్యక్తం చేసిన తరువాతే శాఖాధిపతి హోదాలో పిటిషనర్ నిధులను విడుదల చేశారని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలలో జరిగే తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. అప్పటి మార్కెట్ ధర కన్నా 5శాతం తక్కువకే ల్యాప్‌టా్‌పలు కొనుగోలు చేశారని తెలిపారు. దారి మళ్లిందని చెబుతున్న సొమ్ము పిటిషనర్‌కు చేరినట్లు ఆధారాలు లేవన్నారు. కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటామని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జసిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపకశాఖ డీజీగా వ్యవహరించిన సంజయ్ 150 ట్యాబ్‌ల సరఫరా, అగ్ని ఎన్‌వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై గిరిజనులు, దళితులకు అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందాన్ని క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించడంతోపాటు మోసపూరితంగా బిల్లులు చెల్లించడం ద్వారా రూ1.75కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ డైరెక్టర్లు, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా డైరెక్టర్లు వేర్వేరుగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపైనా వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనుల మృతి
బొత్సకు ఆ విషయం కూడా తెలియదా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 22 , 2025 | 08:19 AM